అన్ని వర్గాలను రెచ్చగొట్టడమే చంద్రబాబు లక్ష్యం | Sakshi
Sakshi News home page

అన్ని వర్గాలను రెచ్చగొట్టడమే చంద్రబాబు లక్ష్యం

Published Sun, May 2 2021 4:08 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: కరోనాతో పోరాడుతున్న ప్రభుత్వానికి అండగా ఉండాల్సిన విపక్ష నేత చంద్రబాబు.. అన్ని వర్గాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్రానికి చీడలా, విలన్‌లా మారిన ఆయన హైదరాబాద్‌లో కూర్చుని జూమ్‌లో చెప్పే మాటలను ఎల్లో మీడియా రసగుళికల్లా ప్రసారం చేయడం శోచనీయమన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శనివారం మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తూ వారి మన్ననలు పొందారని తెలిపారు. తనపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకునే జగన్‌ మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నారని, కుటుంబ పెద్దలా అందరినీ అన్ని విధాలుగా ఆదుకుంటుండడం వల్లనే ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోందని ఆయన అన్నారు. ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు జై కొడుతుండడం ఇందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక సమస్యల్లోనూ కోవిడ్‌ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొని దేశానికి ఆదర్శంగా నిలిచారని చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... 

లాక్‌డౌన్‌ పరిష్కారం కాదు..
రెండో దశ కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ ఎంతమాత్రం పరిష్కారం కాదని ప్రపంచ దేశాలే అంటున్నాయి. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కూడా ఇదే అభిప్రాయంతో ఉంది. కరోనాతో కలిసి నడవక తప్పని పరిస్థితి అని ఆయన ఎప్పుడో చెప్పారు. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలయితే, నష్టం ఇప్పటి కన్నా ఎక్కువ ఉంటుంది. అన్ని వర్గాలకూ ఇబ్బందే. ఉత్పత్తి రంగం ఆగిపోతే, పేద కుటుంబాలు రోడ్డుపై పడితే పరిస్థితి ఏమిటి? వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు
చంద్రబాబు హైదరాబాద్‌లో కూర్చుని జూమ్‌ ద్వారా ఇక్కడి ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలను రెచ్చగొట్టడం దారుణం. విపత్తు వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా సాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ చంద్రబాబు సాధ్యం కాని, రెచ్చగొట్టేలా చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. 1999–2004 మధ్య 54 సంస్థలను అమ్మేసిన చంద్రబాబు కార్మికుల గురించి మాట్లాడటం, ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉంది.

కరోనాపై ప్రభుత్వం పోరు
కోవిడ్‌ నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది. ఆస్పత్రులు, బెడ్లు పెంచుతున్నాం. ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం జగన్‌ మాట్లాడారు. ఎక్కడికక్కడ వారు తగిన చొరవ చూపుతున్నారు. అంబులెన్సులు, ఆక్సిజన్‌ సిలిండర్లు అందుబాటులో ఉంచడం, రోగులను ఆస్పత్రులకు తరలించడం లాంటి వాటిలో నిమగ్నమవుతున్నారు.  

విద్యార్థుల మేలు కోసమే పరీక్షలు.. 
పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. పరీక్షల నిర్వహణపై కేంద్రం ఓ విధానాన్ని ప్రకటించలేదు. కొన్ని రాష్ట్రాలు పరీక్షలు నిర్వహిస్తుండగా, కొన్ని రాష్ట్రాలు రద్దు చేశాయి. మనం పరీక్షలు రద్దు చేసి పాస్‌ మార్కులు మాత్రమే ఇస్తే విద్యార్థుల భవిష్యత్‌ ఏమిటి? మంచి కాలేజీల్లో సీట్లు ఎలా సంపాదిస్తారు?  ఒకవేళ పరీక్షలు వాయిదా వేద్దామన్నా ఈ పరిస్థితి ఎప్పటి వరకు ఉంటుందో ఎవరూ చెప్పలేని స్థితి. మన విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు నిర్వహించేందుకు అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటోంది.  

Advertisement

తప్పక చదవండి

Advertisement