శ్రీవారి సేవలో పాలకులు | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో పాలకులు

Published Tue, Dec 5 2023 4:58 AM

- - Sakshi

సీతంపేట: ఇటీవల సీతంపేటలో టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీడిక రాజన్నదొర, పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ తదితరులు సోమవారం దర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. వేద పండితుల వేదాశీస్సులు, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

ఆఫ్‌లైన్‌లో ధాన్యం సేకరణ

విజయనగరం అర్బన్‌: రైతులు నూర్పిడిచేసిన ధాన్యంను ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నా మని జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌ తెలిపారు. ఇప్పటివరకు 440 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. మరో వెయ్యిమెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మంగళవారం సేకరించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. 52 వేల గన్నీ బ్యాగులను అందుబాటులో ఉంచామని చెప్పారు.

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన మరో లారీ

● వెదుళ్లపాలెం హైవేలో డ్రైవర్‌ దుర్మరణం

నక్కపల్లి (అనకాపల్లి జిల్లా): మండలంలోని వెదుఽళ్లపాలెం సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మరణించాడు. ఎస్‌ఐ విభీషణ్‌రావు తెలిపిన వివరాల ప్రకారం... తుని నుంచి నక్కపల్లి వైపు వస్తున్న లారీని వెదుళ్లపాలెం సమీపంలో డ్రైవర్‌ నిలిపి టైర్లలో గాలి పరిశీలిస్తుండగా.. వెనుకనుంచి మరో లారీ వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆగి ఉన్న లారీ డ్రైవర్‌ విజయనగరం జిల్లా గుర్ల మండలం పెనుబర్తి గ్రామానికి చెందిన దొప్పా పైడితల్లి(45) అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న మరో ప్రైవేటు ట్రావెల్‌ బస్సు తన ముందున్న పాలవ్యాన్‌ను ఢీకొట్టి పక్కనే సైడు కాలువలోకి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారని ఎస్‌ఐ తెలిపారు. ఈ ఘటనలపై కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.

శరవేగంగా ఆర్‌యూబీ నిర్మాణం

కొత్తవలస: మండలంలోని కంటకాపల్లి రైల్వే లెవిల్‌ క్రాసింగ్‌ (గేటు) స్థానంలో అండర్‌ బ్రిడ్జి నిర్మాణ పనులు సోమవారం యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. వాల్తేర్‌ డివిజన్‌ డీఆర్‌ఎం సౌరబ్‌ప్రసాద్‌ దగ్గరుండి పనులు పర్యవేక్షించారు. రైల్వే విద్యుత్‌, ఇంజినీరింగ్‌, ఎమర్జెన్సీ, కార్మిక విభాగాలు క్రేన్లు, జేసీబీలు, పొక్లెయిన్లతో పనులు నిర్వహించారు. పలు రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని దారిమళ్లించారు. ట్రాక్‌లను వెంటవెంటనే పునరుద్ధరించారు. 90 శాతం పనులు పూర్తిచేశామని, మిగిలిన 10 శాతం పనులు మంగళవారం పూర్తిచేస్తామని డీఆర్‌ఎం తెలిపారు.

యుద్ధప్రాతిపదికన సాగుతున్న 
బ్రిడ్జి నిర్మాణ పనులు
1/2

యుద్ధప్రాతిపదికన సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు

 పైడితల్లి (ఫైల్‌)
2/2

పైడితల్లి (ఫైల్‌)

Advertisement
Advertisement