పాత్రికేయ వ్యవస్థ పవిత్రమైనది | Sakshi
Sakshi News home page

పాత్రికేయ వ్యవస్థ పవిత్రమైనది

Published Fri, Nov 17 2023 1:04 AM

-

సెంచూరియన్‌ వర్సీటీ చాన్స్‌లర్‌ జీఎస్‌ఎన్‌.రాజు

విజయనగరం: సమాజానికి చుక్కానిగా వ్యవహరించే పాత్రికేయ వ్యవస్ధ అత్యంత పవిత్రమైనదని సెంచూరియన్‌ విశ్వవిద్యాలయం చాన్స్‌లర్‌ జీఎస్‌ఎన్‌.రాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షుడు సముద్రాల గురుప్రసాద్‌ ఆధ్వర్యంలో గురజాడ స్మారక కేంద్ర గ్రంథాలయంలో గురువారం జరిగిన జాతీయ పత్రికా దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ పత్రికలు ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మల్లా నిలుస్తాయన్నారు. నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగానికి విశిష్ట సేవలందిస్తున్న అనకాపల్లికి చెందిన కాండ్రేగుల కల్యాణ్‌ రామ్‌కు 2023 సంవత్సరానికి గాను జాతీయ పత్రికా దినోత్సవ పురస్కారాన్ని అందజేశారు. అదేవిధంగా 200 మంది ఇంజినీరింగ్‌, బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ విద్యార్థులకు ప్రశంసపత్రాలు, పతకాలను ప్రదానం చేశారు. గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటూ ఉత్తమబుక్‌ రీడర్స్‌గా నిలిచిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి చెందిన 20 మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో సత్య విద్యాసంస్ధల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.శశిభూషణరావు, కుసుమంచి ఫౌండేషన్‌ వ్యవస్ధాపకుడు కుసుమంచి సుబ్బారావు, ప్రముఖ వైద్యురాలు డాక్టర్‌ సన్యాసమ్మ, ట్రైబల్‌ యూనివర్సిటీ పరిపాలనాధికారి డాక్టర్‌ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement