కడుపు కోతలపై కొరడా | Sakshi
Sakshi News home page

కడుపు కోతలపై కొరడా

Published Sun, May 26 2024 5:10 AM

కడుపు కోతలపై కొరడా

విజయనగరం ఫోర్ట్‌:

కాసులకు కక్కుర్తిపడి కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు ప్రసవం కోసం వచ్చే గర్భిణులకు కడుపుకోత మిగుల్చుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా సిజేరియన్లు చేస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల కంటే ప్రైవేటు ఆస్పత్రుల్లోనే అధికంగా సిజేరియన్లు జరుగుతున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో 80 శాతంకు పైగా సిజేరియన్లు జరగ్గా, మరి కొన్ని ఆస్పత్రుల్లో శతశాతం సిజేరియన్లు జరగడం గమనార్హం. వీటికి అడ్డుకట్ట వేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపించింది. అత్యధికంగా సిజేరియన్లు చేసిన ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసింది. కారణాలు తెలియజేయాలని కోరింది.

9 ఆస్పత్రులకు నోటీసులు

జిల్లాలో సిజేరియన్లు అధికంగా నిర్వహిస్తున్న 9 ఆస్పత్రులకు వైద్యారోగ్యశాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. జీఎంఆర్‌ వరలక్ష్మి కేర్‌ హాస్పటిల్‌, అమృత హాస్పటిల్‌, శ్రీ సాయి పీవీఆర్‌ ఆస్పత్రి, వెంకటరామ ఆస్పత్రి, పీజీ స్టార్‌ ఆస్పత్రి, మువ్వగోపాల ఆస్పత్రి, కొలపర్తి ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి, అభినవ నర్సింగ్‌ ఆస్పత్రికి నోటీసులు జారీ చేశారు.

సిజేరియన్‌తో ఆరోగ్య సమస్యలు

ఒకసారి సిజేరియన్‌ చేస్తే రెండో కాన్పులో కూడా సిజేరియన్‌ తప్పనిసరి. దీనివల్ల మహిళలకు నడుంనొప్పి, కాళ్ల నొప్పులు వంటి సమస్యలు చుట్టుముడతాయి. సాధారణ ప్రసవం అయితే రక్తస్రావం తక్కువగా జరుగుతుంది. అదే సిజేరియన్‌ అయితే రక్తస్రావం అధికంగా జరుతుంది. దీనివల్ల మహిళలు రక్తహీనతకు గురయ్యే అవకాశం ఉంది. సాధారణ ప్రసవం అయితే కేవలం రూ.10 వేలు నుంచి రూ.15 వేలు ఖర్చు అవుతుంది. సిజేరియన్‌ అయితే రూ.25 వేల నుంచి రూ.40వేల వరకు కార్పొరేట్‌ ఆస్పత్రులు వసూలు చేస్తున్నాయి.

సిజేరియన్లు అధికంగా చేసే ఆస్పత్రులపై చర్యలు

జిల్లాలో 9 ప్రైవేటు ఆస్పత్రులకు నోటీసులు జారీ చేసిన వైద్య ఆరోగ్యశాఖ

ప్రసవాల్లో 80 శాతం ఆపరేషన్లకే మొగ్గు

ఓ ఆస్పత్రిలో శతశాతం సిజేరియన్లే

సిజేరియన్‌కే ప్రాధాన్యం

ప్రైవేటు ఆస్పత్రికి గర్భిణి రాగానే ఏదో ఒక కారణం చెప్పి సిజేరియన్‌ చేయడానికే ప్రాధాన్యమిస్తున్నారు. కడుపులో బిడ్డ ఉమ్మినీరు తాగింది, బీపీఎక్కువుగా ఉంది ఇలా ఎదో ఒక కారణం చెప్పి సిజేరియన్‌ చేసేస్తున్నారు. వైద్యుడు చెప్పినట్టు చేయకపోతే తల్లీబిడ్డకు ఏమవుతుందోనని భయపడి వైద్యుల చెప్పినట్టు తలాడిస్తున్నారు. జిల్లాలో ప్రసవాలు జరిగే ప్రభుత్వాస్పత్రులు 57 ఉన్నాయి. వీటిలో పీహెచ్‌సీలు 44, సీహెచ్‌సీలు 11, ఘోషాస్పత్రి, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. ప్రసవాలు జరిగే ప్రైవేటు ఆస్పత్రులు 64 వరకు ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో అధిక శాతం సాధారణ ప్రసవాలు జరిపేందుకే వైద్యులు ప్రయత్నిస్తుండగా, ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం సిజేరియన్లకే మొగ్గుచూపుతున్నట్టు వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది

Advertisement
 
Advertisement
 
Advertisement