విద్యార్థుల సమగ్ర వికాసానికి నూతన విద్యా విధానం | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సమగ్ర వికాసానికి నూతన విద్యా విధానం

Published Sun, May 26 2024 6:45 AM

విద్యార్థుల సమగ్ర వికాసానికి నూతన విద్యా విధానం

జంగారెడ్డిగూడెం: విద్యార్థులను సమగ్రంగా తీర్చిదిద్దేలా డిగ్రీ కళాశాలల్లో నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నట్లు కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ డాక్టర్‌ పోలా భాస్కర్‌ అన్నారు. శనివారం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తూర్పు, పశ్చిమ, కృష్ణా ఉమ్మడి జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. రానున్న విద్యాసంవత్సరంలో డిగ్రీ కళా శాలల్లో అదనపు గ్రూపులు ప్రారంభించాలా? కళాశాలల పరిస్థితి ఏమిటనే విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా గతంలో మూడు సంవత్సరాల డిగ్రీలో అవలంభించిన విద్యా ప్రణాళికను మార్పు చేసి, ఐదు రకాల అంశాలతో నూతన ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లంలో పట్టు సాధించేలా ఇప్పటికే ఉన్న రెండు పేపర్‌లతో పాటు మరో రెండు పేపర్లు ప్రవేశపెడుతున్నామని, దీని ద్వారా ఇంగ్లిష్‌ స్కిల్స్‌ పెంపొంది, ఎలాంటి పోటీలోనైనా గెలిచేలా శిక్షణ ఇవ్వనున్నట్లు వివరించారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 50 వేల పైచిలుకు సీట్లు ఉండగా, 30 వేలు మాత్రమే అడ్మిషన్లు అవుతున్నాయని, మిగిలిన 20 వేల సీట్లు సైతం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామన్నారు.

ఉద్యోగం, ఉపాధి సాధించేలా..

ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులను పట్టభద్రులుగా తీర్చిదిద్దడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించేలా చర్యలు తీసుకున్నాని తెలిపారు. ఉద్యోగాలు సాధించేలా మాత్ర మే కాకుండా పారిశ్రామికవేత్తగా ఎదిగేందుకు డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌ కార్యక్రమాలు రూపొందించామన్నారు. డిగ్రీ కళాశాలలను 21 క్లస్టర్‌లుగా ఏర్పాటు చేసి క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కాలేజీ ఎడ్యుకేషన ఆర్‌జేడీ డాక్టర్‌ ఎస్‌.శోభారాణి, అకడమిక్‌ గైడెన్స్‌ అధికారి డాక్టర్‌ సీహెచ్‌ తులసి, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రసాద్‌బాబు, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు.

కళాశాల విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement