మహాకాళి, లక్ష్మి, సరస్వతి పరదేవత స్వరూపాలే | Sakshi
Sakshi News home page

మహాకాళి, లక్ష్మి, సరస్వతి పరదేవత స్వరూపాలే

Published Sun, May 26 2024 6:45 AM

మహాకాళి, లక్ష్మి, సరస్వతి పరదేవత స్వరూపాలే

ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు

భవానీపురం(విజయవాడపశ్చిమ): అమ్మవారి భక్తులు కొలిచే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి పరదేవతామూర్తి కనకదుర్గమ్మ స్వరూపాలేనని ప్రముఖ ప్రవచనకర్త బ్రహ్మశ్రీ డాక్టర్‌ చాగంటి కోటేశ్వరరావు ప్రవచించారు. శ్రీదుర్గామల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రెండు రోజులపాటు ‘శ్రీమాత వైభవం’ అంశంపై నిర్వహించిన ఆయన ప్రవచనాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి విరచితం, శ్రేష్ఠి లక్ష్మీసీతారామాంజనేయ శర్మ పరిశోధించి రచించిన శ్రీశైలతీరర్థసారః ఆధ్యాత్మిక గ్రంథం శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఈఓ కేఎస్‌ రామరావు ప్రధాన సంపాదకత్వంలో దేవస్థానం ముద్రించగా చాగంటి ఆవిష్కరించారు. అనంతరం చాగంటి ప్రవచిస్తూ మనిషిని కామ, క్రోధ, మద, మాత్సర్యాలు వంటి దుర్గుణాలు పట్టి పీడిస్తుంటాయని, పరదేవత రూపంలో దుర్గమ్మ వాటన్నింటిని తొలగించి సద్గుణాలను ప్రసాదిస్తుందని తెలిపారు. నేను, నాది అన్న అహంకారం నుంచి బయటపడాలంటే పరదేవత అనుగ్రహం ఉండాలన్నారు. మహాకాళిని మూడు రోజులపాటు ఉపాసిస్తే దుర్గుణాల స్థానంలో సద్గుణాలను నింపుతుందని తెలిపారు. వాక్కు శాంతిని కలిగిస్తుందని, అటువంటి స్వరపేటికను దుర్వినియోగం చేస్తే పరదేవత సహించదని పేర్కొన్నారు.భూమి కొన్న ప్రతి ఒక్కరూ దాని కొలతలు కొలుస్తుంటారని, చివరికి వారంతా ఆ భూమిలోనే కలిసిపోక తప్పదన్నారు. నేను, నాది అనుకుని తపనపడే మనిషి శ్మశానంలో బూడిద అయినప్పుడు ఒంటరిగా ఉండే జీవుడికి తోడుగా తాను ఉంటానని శివుడు పార్వతితో చెబుతాడని అన్నారు. కష్టపడి సంపాదించడమే జీవితం కాదని, దానధర్మాలు కూడా చేయాలని, పుచ్చుకునేవారు అమ్మవారి రూపంలో వచ్చి పుణ్యాన్ని ప్రసాదిస్తారని తెలిపారు. సరస్వతి కటాక్షం వలన మనిషి మనసుకు ప్రశాంతత చేకూరుతుందన్నారు. గత జన్మలో మనం చేసే పుణ్యాలబట్టే లక్ష్మీదేవి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు దంపతులను రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ కమిషనర్‌ శ్రీరాం సత్యనారాయణ, దుర్గగుడి ఈఓ కెఎస్‌ రామరావు సత్కరించారు. కార్యక్రమంలో హైకోర్ట్‌ న్యాయమూర్తులు జస్టిస్‌ శ్రీనివాస్‌, జస్టిస్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement