కమనీయం.. నరసింహుని కల్యాణం | Sakshi
Sakshi News home page

కమనీయం.. నరసింహుని కల్యాణం

Published Fri, May 24 2024 9:15 AM

కమనీయ

జగ్గయ్యపేట అర్బన్‌: నరసింహుని కల్యాణోత్సవం నయనానందకరంగా సాగింది. వేద మంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ వందలాది భక్తుల సమక్షంలో కల్యాణ వేడుక అంబరాన్నంటింది. వేదాద్రిలో వేంచేసియున్న యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి 12 గంటలకు నరసింహ స్వామి వారి కల్యాణం నిర్వహించారు. మేళతాళాలతో, భక్తుల జయజయధ్వానాల నడుమ స్వామి వారి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం వద్దకు తీసుకువచ్చారు. అనంతరం వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు పరాంకుశం వాసుదేవాచార్యులు, యోగానందాచార్యులు, శ్రీధరాచార్యులు పర్యవేక్షణలో వేద పండితులు, అర్చకుల వేద మంత్రోచ్ఛరణలతో స్వామి వారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోక కల్యాణార్థం స్వామివారికి కల్యాణోత్సవం నిర్వహించినట్లు వేద పండితులు తెలిపారు.

సుమనోహర దృశ్యం..

కృష్ణా నది ఒడ్డున ఆలయం ఉండటంతో పండు వెన్నెల్లో భక్తుల హర్షధ్వానాల మధ్య దాదాపు రెండు గంటల పాటు స్వామి వారి కల్యాణం నిర్వహించారు. ఆలయ వంశపారంపర్య ధర్వకర్త వెలగపూడి ఇందిరా దత్‌ ఆలయ సంప్రదాయం ప్రకారం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ ఈఓ హేమలతాదేవి పర్యవేక్షణలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా బాలాత్రిపుర సుందరీ అమ్మవారి ట్రస్ట్‌, కేసీపీ, హేమాద్రి, రామ్‌కో సిమెంట్స్‌, ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, మధ్యాహ్నం అన్నదానం ప్రసాదాలు పంపిణీ చేశారు. సీఐ జానకీరామ్‌ పర్యవేక్షణలో మూడు మండలాల ఎస్‌ఐలు పాల్గొని పోలీస్‌ బందోబస్తు నిర్వహించారు. స్వామి వారి కల్యాణోత్సవంలో ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను పాల్గొని స్వామి వారి కల్యాణాన్ని తిలకించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కమనీయం.. నరసింహుని కల్యాణం
1/1

కమనీయం.. నరసింహుని కల్యాణం

Advertisement
 
Advertisement
 
Advertisement