స్థిరత్వ సర్టిఫికెట్‌ ఉంటేనే ! | Sakshi
Sakshi News home page

స్థిరత్వ సర్టిఫికెట్‌ ఉంటేనే !

Published Wed, May 22 2024 6:55 AM

స్థిరత్వ సర్టిఫికెట్‌ ఉంటేనే !

పటమట(విజయవాడతూర్పు): బహిరంగ ప్రదేశాల్లో, ప్రైవేటు భవనాలపై వాణిజ్య, వ్యాపార ప్రకటనలను ఆకర్షణీయంగా ప్రదర్శించే క్రమంలో ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు ఇప్పుడు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈదురుగాలులు, భారీ వర్షాలు, భూకంపాలతోపాటు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు పబ్లిక్‌ ప్రదేశాలు, ప్రైవేటు భవనాలలపై ఏర్పాటు చేస్తున్న హోర్డింగ్‌లు ప్రమాదకరంగా మారుతున్నాయి. దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఇవి తుప్పుపట్టి ఎప్పుడు కూలతాయో తెలియని స్థితిలో ఉన్నాయి. హోర్డింగ్‌లను ఏర్పాటు చేసే ఏజెన్సీలు వాటి నిర్వహణను గాలికొదిలేశాయి. ఈదురుగాలులు వీచినప్పుడు హోర్డింగ్‌ల వల్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ముంబైలో హోర్డింగ్‌ కుప్పకూలి 16 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో అలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇకపై చిన్న వ్యాపారాల నుంచి భారీ వ్యాపార ప్రకటనలకు వినియోగించే హోర్డింగ్‌లు, బ్యానర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌ ఉంటేనే వీఎంసీ నుంచి ప్రకటనల ప్రదర్శనను అనుమతి వస్తుంది..

స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌ అంటే...

నిర్మాణ స్థిరత్వ ఽధ్రువీకరణ పత్రం అనేది భవన నిర్మాణ స్థిరత్వాన్ని ఽధ్రువీకరించే ముఖ్యమైన పత్రం. ఆస్తుల కొనుగోలు, అమ్మకం, పునరుద్ధరణ సమయంలో ఇది చాలా ముఖ్యమైన అవసరం. భవనం నిర్మాణ అంశాలు స్థిరంగా, సురక్షితంగా ఉన్నాయని సర్టిఫికెట్‌ నిర్ధారిస్తుంది. దీన్ని స్ట్రక్చరల్‌ ఇంజినీర్‌, లేదా ఆర్కిటెక్‌ ఇంజినీర్‌లు ఇస్తారు. సంబందింత భవనాన్ని తనిఖీ చేసి, నిర్మాణ నాణ్యత, వయస్సును నిర్థారిస్తారు. ఇప్పటికే ఉన్న భవనాల అవసరమైన భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని, పునాది, ఫ్రేమ్‌లు, గోడలు, పైకప్పుతో సహా దాని నిర్మాణ భాగాల అనువుగా ఉన్నాయని నిర్థారించాల్సి ఉంటుంది. సంబంధిత భవనం ప్రమాదాలు, ప్రకృతి వైపరీత్యాలు, ఈదురుగాలు, తుఫానులు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు సంభవించినా ఇవి పడిపోవని నిర్థారించిన తర్వాత మాత్రమే భవనాలకు, హోర్డింగ్‌లకు ఈ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు.

నగరంలో ఇలా...

నగరంలోని మూడు సర్కిళ్ల పరిధిలోని ఆయా ప్రాంతాల్లో 15 యాడ్‌ ఏజెన్సీలు, ప్రకటన సంస్థలు వీఎంసీలో రిజిస్టర్‌కాగా ఇంకా అనధికారికంగా మరో 10 సంస్థలు బహిరంగ ప్రదేశాల్లో ప్రచార కార్యాకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఆయా సంస్థలు నగరంలో ఇప్పటి వరకు 800 హోర్డింగ్‌లు/బోర్డులను మాత్రమే గుర్తించగా నగర వ్యాప్తంగా అవి సుమారు 2500 వరకు ఉంటాయని వీటన్నింటికీ ఇకపై స్ట్రక్చరల్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి. లేని పక్షంలో వాటిని తొలగిస్తామని వీఎంసీ పట్టణ ప్రణాళిక అధికారులు హెచ్చరిస్తున్నారు.

నగరంలో ప్రచార హోర్డింగ్‌లు,

బోర్డులకు తప్పనిసరి చేసిన వీఎంసీ

నెలాఖరు నుంచి ప్రత్యేక డ్రైవ్‌లు

ఇప్పటికే ఏజెన్సీలు, ప్రచార సంస్థలు, భవన యజమానులకు నోటీసులు ఇచ్చిన వీఎంసీ

నెలాఖరు నుంచి స్పెషల్‌ డ్రైవ్‌

ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే హోర్డింగ్‌లు, బోర్డులకు తప్పనిసరిగా స్ట్రక్చరల్‌ స్టెబిలిటీ సర్టిఫికెట్‌ తప్పనిసరి. ఈ మేరకు వీఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం వార్డు ప్లానింగ్‌ కార్యదర్శులు, బిల్డింగ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇతర అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి హోర్డింగ్‌లను గుర్తిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వాటికి, కొత్తగా ఏర్పాటు చేయబోయే వాటికి కూడా తప్పనిసరిగా సర్టిఫికెట్‌ తీసుకోవాలని నోటీసులు పంపాం. ఈ నెలాఖరు నుంచి డ్రైవ్‌ నిర్వహిస్తాం, చిన్నా, పెద్ద వ్యాపార సంస్థ అని తేడాలేకుండా అందరూ తీసుకోవాల్సిందే. స్టెడిలిటీ సర్టిఫికెట్‌ తీసుకోని వారు డిఫెస్మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ప్రావర్టీ యాక్ట్‌ ద్వారా చర్యలు చేపడతాం.

– జీవీజీఎస్‌వీ ప్రసాద్‌,

చీఫ్‌ సిటీ ప్లానర్‌, వీఎంసీ

Advertisement
 
Advertisement
 
Advertisement