కొమెరికా సెంటర్‌లో ప్రత్యేక ఆకర్షణగా సినీ నటుడు నవీన్ పోలిశెట్టి ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ ప్రదర్శనలు
ఫ్రిస్కో : అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఫ్రిస్కో నగరంలో గల ప్రతిష్టాత్మక ‘కొమెరికా సెంటర్’ వేదికగా ‘టి-ప్యాడ్’ (TPAD) ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు 15వేల మందితో అత్యంత వైభవంగా, కన్నులపండువగా జరిగాయి. ఉదయం నుంచి రాత్రి వరకు తెలుగువారి ఆటపాటలు ప్రాంగణానికి తెలంగాణ సంప్రదాయ పరిమళాలతో కొత్త వన్నెలద్దాయి. కనీసం వెయ్యి మందికి పైగా మహిళలు, యువతులు సాంప్రదాయ దుస్తుల్లో బతుకమ్మ ఆడారు. అనంతరం శాస్త్రోక్తంగా, పద్ధతి ప్రకారం బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక టవర్ లాగా, ల్యాండ్‌మార్క్ తరహాలో స్టేడియం మధ్యలో కొలువైన ఆ బతుకమ్మ వద్ద మహిళలు ఆడటం, సందర్శకులు సెల్ఫీలు దిగడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. కార్యక్రమంలో భాగంగా ప్రదర్శించిన మహిషాసుర మర్ధిని నృత్యరూపం ఆకట్టుకుంది.

ఉర్రూతలూగించిన నవీన్ పోలిశెట్టి
ప్రముఖ సినీ నటుడు నవీన్ పోలిశెట్టి ఈ వేడుకలకు ప్రత్యేకంగా విచ్చేసి సందడి చేశారు. అమెరికాలో ఇంత ఘనంగా బతుకమ్మ నిర్వహించడం చూసి ముగ్ధుడైన ఆయన, స్వయంగా వేదికపైకి వచ్చి గంటపాటు అద్భుతమైన ప్రదర్శనతో అలరించారు. సభికులతో నేరుగా మాట్లాడుతూ, చమక్కులు విసురుతూ, యువతతో పాటు చిన్నపిల్లలను (జెన్-జీ, జెన్ ఆల్ఫా తరం) వేదికపైకి ఆహ్వానించి వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉర్రూతలూగించారు.
కట్టిపడేసిన ‘ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్’
ప్రముఖ గాయకుడు కృష్ణ చైతన్య నేతృత్వంలోని ‘ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్’ సంగీత విభావరి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు నవీన్ పోలిశెట్టి ప్రదర్శన, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ సంగీతం నిరంతరాయంగా సాగి, హాజరైన ప్రేక్షకులను కట్టిపడేశాయి. తెలుగు సంస్థల చరిత్రలోనే ఒక సినీ నటుడు, సంగీత బృందం ఇంతగా జనంతో మమేకమై అలరించడం సరికొత్త అనుభూతిని మిగిల్చిందని ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు – సమష్టి కృషి
ఈ భారీ కార్యక్రమాన్ని టి-ప్యాడ్ ప్రెసిడెంట్ లక్ష్మి పోరెడ్డి, ఫౌండేషన్ కమిటీ చైర్ రఘువీర్ బండారు, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ చైర్ రవికాంత్ మామిడి, కోఆర్డినేటర్ లింగారెడ్డి ఆల్వ సమర్థవంతమైన నాయకత్వంలో విజయవంతం చేశారు. దాదాపు 20 కమిటీలకు చెందిన వాలంటీర్లు ఎంతో కృషి చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సురక్షితమైన సెక్యూరిటీ చెకింగ్స్‌తో కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా అత్యంత సాఫీగా సాగింది. ఈ సందర్భంగా టి-ప్యాడ్ నాయకత్వం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసింది. ఈవెంట్‌ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లినందుకు మీడియా పార్ట్నర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్స్, వివిధ డిజిటల్ ఛానళ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతటి బృహత్తర వేడుక సాధ్యమయ్యేందుకు, నవీన్ పోలిశెట్టి, ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్ లాంటి ప్రముఖులను రప్పించడానికి సహకరించిన స్పాన్సర్లకు, ఆర్థిక సాయం అందించిన దాతలకు, అహర్నిశలు శ్రమించిన వాలంటీర్లకు టి-ప్యాడ్ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రకటించారు.


