సన్నబియ్యంపై ఆశలు..! | Sakshi
Sakshi News home page

సన్నబియ్యంపై ఆశలు..!

Published Mon, May 27 2024 12:35 AM

సన్నబియ్యంపై ఆశలు..!

భైంసాటౌన్‌: రేషన్‌ దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ధ్యే యంగా పెట్టుకుందని, అందుకే సన్నవడ్ల సాగు ప్రోత్సహించేందుకు రూ.500 బోనస్‌ ప్రకటించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెల్లరేషన్‌ కార్డుదారులు సన్నబి య్యం పంపిణీపై ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తు తం రేషన్‌ దుకాణాల్లో దొడ్డురకం బియ్యం అందిస్తుండగా వాటిని తినలేక చాలామంది లబ్ధి దారులు బియ్యం అమ్ముకుంటున్నారు. రైతులు ఎక్కువగా దొడ్డు రకం ధాన్యం సాగు చేస్తుండడంతో ఇప్పటి వరకు ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి సీఎంఆర్‌ కోసం రైస్‌మిల్లులకు కేటాయించేది. మిల్లర్లు బియ్యం మరాడించి ఎఫ్‌సీఐ, పౌరసరఫరాల శాఖకు పంపితే వాటిని రేషన్‌ దుకాణాల ద్వారా కార్డుదారులకు పంపిణీ చేస్తోంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులు ఆశలు పెట్టుకున్నారు.

6.41 లక్షల మందికి ప్రయోజనం...

జిల్లాలో తెల్లరేషన్‌ కార్డులు 2,08,462 ఉండగా 6,41,411 మంది లబ్ధిదారులున్నారు. వీరికి ప్రతినెలా యూనిట్‌కు ఆరు కిలోల చొప్పున అందిస్తున్నారు. దీంతో నెలకు 40,560 మెట్రిక్‌ టన్నుల బియ్యం అవసరమవుతోంది. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల ద్వారా దొడ్డుబియ్యం పంపిణీ చేస్తుండగా చాలావరకు నాసిరకంగా ఉంటున్నా యి. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని తినలేక కిలోకు రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయించుకుంటున్నారు. మార్కెట్‌లో సన్నబియ్యం కిలోకు రూ.50 నుంచి రూ.70 వరకు ధర పలుకుతున్నాయి. దీంతో ఆర్థికంగా భారమైనా సన్నబియ్యం కొనుగోలు చేస్తున్నారు. ఫలితంగా నెలకు 25 కిలోల బస్తాకు రూ.1300 నుంచి రూ.1700 వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే పేదలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

అక్రమ రవాణాకు చెక్‌...

ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో అందిస్తున్న దొడ్డుబియ్యాన్ని లబ్ధిదారులు విక్రయించుకోవడంతో అక్రమ రవాణకు తరలుతున్నాయి. కొందరు రైస్‌మిల్లర్లు సీఎంఆర్‌ కోసం కేటాయించిన ధాన్యం మరాడించకుండా పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారు. దళారుల ద్వారా లబ్ధిదారుల నుంచి సేకరించిన దొడ్డు బియ్యాన్నే తిరిగి ఎఫ్‌సీఐకి అప్పగిస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌ బియ్యం లబ్ధిదారుల నుంచి దళారులకు, వారి నుంచి రైస్‌మిల్లులకు, అక్కడి నుంచి ఎఫ్‌సీఐకి, మళ్లీ రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకే రీసైకిల్‌ అవుతోంది. ఫలితంగా నాసిరకం బియ్యం పంపిణీ అవుతోంది. ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తే లబ్ధిదారులు విక్రయించాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు చెక్‌ పడుతుంది.

రేషన్‌ దుకాణాల్లో పంపిణీకి యోచన

అమలు చేస్తే కార్డుదారులకు ప్రయోజనం

దొడ్డు బియ్యం అక్రమ రవాణాకు చెక్‌

జిల్లాలో రేషన్‌ కార్డుల వివరాలు

ఏఎఫ్‌ఎస్‌సీ కార్డులు : 12,672

ఎఫ్‌ఎస్‌సీ కార్డులు : 1,95,758

అంత్యోదయ కార్డులు : 32

మొత్తం రేషన్‌ కార్డులు : 2,08,462

లబ్ధిదారులు : 6,41,411

అవసరమైన బియ్యం కోటా

: 40,56,074 కిలోలు

Advertisement
 
Advertisement
 
Advertisement