‘కోనోకార్పస్‌’ కోరల్లో! | Sakshi
Sakshi News home page

‘కోనోకార్పస్‌’ కోరల్లో!

Published Mon, May 27 2024 12:35 AM

‘కోనో

● పక్షులు వాలవు.. పశువులు తినవు ● పర్యావరణానికి ప్రయోజనం శూన్యం ● పువ్వుల రేణువులతో అనారోగ్యం ● జిల్లాలో విపరీతంగా పెరిగిన చెట్లు ● ఇప్పటికే ఈ చెట్లపై నిషేధం.. ● అయినా తొలగించని అధికారులు, పాలకులు

నిర్మల్‌: సాధారణంగా అడవులను, చెట్లను ఎవరైనా నరికేస్తే.. పర్యావరణ ప్రేమికులు, సాధారణ పౌరులూ ఆందోళన చెందుతుంటారు. కానీ ఇప్పుడు ఏపుగా, పచ్చగా పెరుగుతున్న ‘కోనోకార్పస్‌’ చెట్లను చూస్తే పర్యావరణ వేత్తలే హడలిపోతున్నారు. ‘వద్దు బాబూ.. వీటిని వెంటనే తొలగించండి..’ అంటున్నారు. ఎందుకంటే.. ఇవి అంత ప్రమాదకరంగా మారుతున్నాయి. వీటితో పర్యావరణానికి మేలు జరగకపోగా.. ప్రజారోగ్యానికి హాని కలుగుతోంది. ఇప్పటికే ప్రపంచంలోని ఎన్నో దేశాలు, దేశంలోని చాలా రాష్ట్రాలు కోనోకార్పస్‌ చెట్లను నిషేధించాయి. చాలా దేశాల్లో కూకటివేళ్లతో పెకిలించి వేశాయి. జిల్లాల్లో మాత్రం ఈ చెట్లు వేళ్లానుకుని పోయాయి.

హరితహారం తెచ్చిన శాపం..

గత ప్రభుత్వం చేపట్టిన హరితహారం అద్భుతమైన కార్యక్రమం. కానీ.. అదే శాపంగానూ మారింది. ప్రభుత్వం పెట్టిన గడువు, నిబంధనలకు స్థానిక అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది మంచి చెడులను ఆలోచించకుండా త్వరగా పెరిగే మొక్కలను తీసుకువచ్చి విరివిగా నాటేశారు. ఇప్పుడు వాటి దుష్ఫలితాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే జిల్లాలోకి వచ్చింది కోనోకార్పస్‌ మొక్క. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై డివైడర్ల మధ్యలో మొత్తం ఇవే మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లోనూ వీటినే పెంచారు. పచ్చగా, ఏపుగా పెరగడంతో అంతా ‘వావ్‌..’ అన్నారు. ఇప్పుడు పువ్వులు, కాయలూ కాస్తుండటం, అవి ప్రజారోగ్యానికి ప్రమాదకారిగా మారుతున్నాయని తెలియడంతో ‘ఈ చెట్లు వద్దు బాబో..’ అంటున్నారు.

పుప్పొడితో పరేషాన్‌..

కోనోకార్పస్‌ చెట్ల పువ్వుల పుప్పొడి పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా మనుషుల్లో అలర్జీలు, శ్వాసకోశ వ్యాధులు, అస్తమా వంటివి వస్తున్నట్లు తేలింది. ఈచెట్టు ఎంత ప్రమాదకరమంటే వీటి వేళ్లు భూమిలోతులోకి వెళ్లి బలంగా నాటుకుంటాయి. ఈక్రమంలో పునాదులతోపాటు భూమిలో వేసిన కేబుళ్లు, పైపులనూ ఇది ధ్వంసం చేస్తోంది. ఇక ఈ మొక్కలు హరితహారంలో పెంచడానికి మరోకారణం.. వీటిని పశువులు తినవు. కనీసం పక్షులు గూళ్లు కూడా పెట్టవు. వీటి పవ్వులు, పుప్పొడిపై సీతాకోక చిలుకలు కూడా వాలవు. అంటే.. ఆ చెట్టు ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు.

రాష్ట్రంలో నిషేధం..

భూమి లోతు వరకూ నాటుకుపోవడంతో కోతకు గురికాకుండా ఉంచే కోనోకార్పస్‌ చెట్లను తీరప్రాంతాల్లో విరివిగా పెంచారు. ప్రపంచంలోని చాలా దేశాలు మొదట్లో వీటిని విరివిగా పెంచాయి. తర్వాత వీటివల్ల కలుగుతున్న అనర్థాలు తెలియడంతో మూలాలతో సహా పెకిలించి వేశాయి. దుబాయ్‌లో వీటిని విస్తారంగా పెంచారు. తర్వాత ఎడారి దేశం సైతం వీటిని పీకేయించింది. మన దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా వీటిని నిషేధించాయి. తెలంగాణలోనూ ఈ మొక్కలను హరితహారంలో నాటవద్దని చెప్పినా.. అప్పటికే జరగాల్సి న నష్టం జరిగిపోయింది.

కొమ్మలు కాదు.. చెట్లనే తొలగించాలి

ఎక్కడా పెంచని కోనోకార్పస్‌ మొక్కలను జిల్లాలో మాత్రం నిత్యం నీళ్లు పోసి పెంచుతున్నారు. దాదాపు అన్ని గ్రామాల్లో ఈ మొక్కలు ఉన్నాయి. రియల్‌ఎస్టేట్‌ నిర్వాహకులు వెంచర్లలో వీటిని ఎక్కువగా పెంచారు. ఇప్పుడు ఈ చెట్లు అంతటా పువ్వులు, కాయలు కాసే దశకు చేరాయి. తరచూ వీటిపై ఫిర్యాదులు వస్తుండటంతో మున్సిపాలిటీలు, పంచాయతీలు ఆ పువ్వులు, కాయలు కాసే కొమ్మలను కొట్టేస్తున్నాయి. కానీ.. దీనివల్ల ప్రతీ ఏడాది రెండుసార్లు ఖర్చు తప్ప.. ప్రజారోగ్యానికి ఎలాంటి ఉపయోగం లేదన్న వాదన పెరుగుతోంది. వీటిని మొత్తానికే తొలగించాలన్న డిమాండ్‌ బలపడుతోంది.

మొత్తానికే తొలగించాలి

జిల్లా కేంద్రంలోని మంచిర్యాల రోడ్డులో ఇటీవల కోనోకార్పస్‌ చెట్ల కొమ్మలను మున్సిపల్‌ సిబ్బంది కొట్టేశారు. ఇలా ఏడాదికి రెండుసార్లు చేయడం వల్ల ప్రజాధనం వృథా కావడంతో పాటు ఆ చెట్లవల్ల ప్రజారోగ్యం దెబ్బతింటోంది. కోనోకార్పస్‌ చెట్లను మొత్తానికే తీసివేయాలి.

– దశరథ పోశెట్టి, నిర్మల్‌

నష్టాలే ఎక్కువ..

కోనోకార్పస్‌తోపాటు ఎనిమిది ఆకుల చెట్టు, గన్నేరుచెట్లతో లాభాలకంటే నష్టాలే ఎక్కువ. ఈ చెట్లను చాలాదేశాలు, రాష్ట్రాలు నిషేధించాయి. స్థానికంగా అవగాహన లేకపోవడంతోనే విరివిగా పెంచుతున్నారు. పర్యావరణంతోపాటు పశుపక్షాదులు, ప్రజారోగ్యానికీ ఇవి ప్రమాదకరం. వీటిని తొలగించాలి. – డాక్టర్‌ వెల్మల మధు, అసోసియేట్‌

ప్రొఫెసర్‌, భైంసా డిగ్రీ కళాశాల

‘కోనోకార్పస్‌’ కోరల్లో!
1/4

‘కోనోకార్పస్‌’ కోరల్లో!

‘కోనోకార్పస్‌’ కోరల్లో!
2/4

‘కోనోకార్పస్‌’ కోరల్లో!

‘కోనోకార్పస్‌’ కోరల్లో!
3/4

‘కోనోకార్పస్‌’ కోరల్లో!

‘కోనోకార్పస్‌’ కోరల్లో!
4/4

‘కోనోకార్పస్‌’ కోరల్లో!

Advertisement
 
Advertisement
 
Advertisement