● కానరాని ఫిట్‌నెస్‌.. అనుభవం లేని డ్రైవర్లు ● నిబంధనలు పాటించని యజమానులు ● ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు | Sakshi
Sakshi News home page

● కానరాని ఫిట్‌నెస్‌.. అనుభవం లేని డ్రైవర్లు ● నిబంధనలు పాటించని యజమానులు ● ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ● ‘మామూలు’గా వ్యవహరిస్తున్న అధికారులు

Published Fri, May 24 2024 11:50 PM

● కానరాని ఫిట్‌నెస్‌.. అనుభవం లేని డ్రైవర్లు ● నిబంధనలు

ఆదిలాబాద్‌ వయా నిర్మల్‌ నుంచి హైదరాబాద్‌కు బుధవారం రాత్రి బయల్దేరిన ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు నిర్మల్‌ ఘాట్‌ సెక్షన్‌ సమీపంలో బోల్తా పడింది. డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం, ఓవర్‌ లోడ్‌ కారణంగా ఓ ప్రయాణికుడు మృత్యువాత పడగా, అందులో ప్రయాణిస్తున్న 25 మంది గాయాలపాలయ్యారు. మరో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఈ ఘటన అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో ప్రయాణికుల రోదనలు మిన్నంటాయి.

ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాద్‌, హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు వచ్చే ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో ప్రతిరోజు బస్‌ టాప్‌పైన, వెనుక, కింది భాగంలో నిబంధనలకు విరుద్ధంగా గూడ్స్‌ తరలించడం సర్వసాధారణంగా మారింది. రవాణాశాఖ అధికారులకు ఇదంతా తెలిసినా ‘మామూలు’గా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.

నిర్మల్‌ వద్ద ప్రమాదానికి గురైన ప్రైవేట్‌ బస్సు

ఆదిలాబాద్‌టౌన్‌: ప్రైవేట్‌ బస్సు ప్రయాణం సురక్షితమేనా అనే అనుమానం వ్యక్తమవుతుంది. కాలం చెల్లిన ఫిట్‌నెస్‌ లేని డొక్కు బస్సులు.. అనుభవం లేని డ్రైవర్లు.. నిబంధనలు పాటించని యజమానుల కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. వారు చేసే తప్పిదంతో తాజాగా ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ధనార్జనే తప్పా ప్రయాణికుల ప్రాణాలు వారికి లెక్కలేకుండా పోతోంది. ప్రతిరోజు వేకువజామున 4 గంటల ప్రాంతంలో, రాత్రి 9 నుంచి ఒంటిగంట వరకు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు ప్రైవేట్‌ బస్సులు నడుపుతున్నారు. అక్కడినుంచి తిరిగి జిల్లా కేంద్రానికి ప్రయాణికులను తీసుకొస్తున్నారు. కొన్ని బస్సులు మినహా చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయి. నిర్మల్‌ ఘాట్‌ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మరణించారు. అందులో 49 మంది వరకు ప్రయాణించినట్టు సమాచారం. రవాణాశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రైవేట్‌ బస్సుల యజమానులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కాలం చెల్లిన బస్సులతో..

ఆదిలాబాద్‌ నుంచి ప్రతిరోజు 20 వరకు ప్రైవేట్‌ బస్సులు హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. అలాగే హైదరాబాద్‌ నుంచి కూడా అదే సంఖ్యలో జిల్లా కేంద్రానికి వస్తుంటాయి. వీటితో పాటు మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు చెందిన బస్సులు సైతం జిల్లా ప్రయాణికులను తరలిస్తుంటారు. అలాగే మరో 97 కాంట్రాక్ట్‌ క్యారేజీ బస్సులు ఉన్నాయి. ప్రైవేట్‌ బస్సుల్లో ఎక్కువగా కాల పరిమితి దగ్గరగా ఉన్నవే ఉన్నాయి. చాలా వాటిలో అరిగిన టైర్లు, సరిగా ఉండని అద్దాలే దర్శనమిస్తాయి. అయినా ఏసీ పేరిట వీడియోకోచ్‌, తదితర సౌకర్యాలు ఉన్నట్లు చెప్పి టికెట్లు బుక్‌ చేసుకుంటారు. బస్సు ఎక్కే సరికి ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తాయి. తీరా చేసేదేమి లేక అదే డొక్కు బస్సుల్లో గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన దుస్థితి.

గూడ్స్‌ తరలింపే వారి ధ్యేయం..

నిబంధనల ప్రకారం ప్రయాణికులను తరలించే బ స్సుల్లో గూడ్స్‌ తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం. అయినప్పటికీ కాసులకు కక్కుర్తిపడి ప్రైవేట్‌ బస్సుల య జమానులు బస్సుల్లో పెద్ద ఎత్తున గూడ్స్‌ తరలిస్తున్నారు. ప్రయాణికుల పరిమితితో పాటు గూ డ్స్‌ త రలిస్తుండడంతో ఆ బస్సులు ఎక్కడ బోల్తాపడతా యోనన్న భయాందోళన ప్రయాణికుల్లో నెలకొంటుంది. బుధవారం జరిగిన ఘటన ఇదే కోవలోకి వస్తుంది. గతంలోనూ ఓ ప్రైవేట్‌ బస్సు నిర్మల్‌ ప్రా ంతంలో బోల్తా పడింది. పదేపదే ఘటనలు చోటు చేసుకుంటున్నా రవాణా శాఖ అధికారులు పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం అనుమానాలకు తావి స్తోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు హడావుడి చేయడమే తప్పా మళ్లీ ‘మామూలు’గానే తీసుకుంటున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇటు ప్రయాణికుల చార్జీలతో పాటు అటు గూడ్స్‌ తరలించి లక్షల్లో ఆర్జిస్తున్నారు. ప్రయాణికుల ప్రాణాల గురించి పట్టించుకోకుండా గ్యాస్‌ సిలిండర్లు, గంజాయి, తదితర మత్తు పదార్థాలు సైతం ఇందులో తరలిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు.

తనిఖీలు కరువు..

రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు ప్రైవేట్‌ బస్సులను తనిఖీలు చేయాల్సి ఉండగా అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. వారి నిర్లక్ష్యం.. ప్రయాణికుల ప్రాణాల మీదికి వస్తోంది. ప్రతి బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉండాల్సి ఉండగా, ఒక్కరితోనే ప్రయాణం కానిచ్చేస్తున్నారు. ఫస్ట్‌ఎయిడ్‌ బాక్స్‌లో ఉండాల్సిన మెడికల్‌ కిట్‌ ఏ బస్సులోనూ కనిపించదు. ఫైర్‌ పరికరాలు మచ్చుకు కానరావు. ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ డోర్లు సైతం అంతంతే. వీటికి తోడు అనుభవం లేని డ్రైవర్లతో ప్రయాణికులను తరలిస్తున్నా అధికారుల తనిఖీలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రవాణా శాఖలో ఇదివరకు రెగ్యులర్‌ డీటీసీ ఉండగా, ఆయన వరంగల్‌కు బదిలీపై వెళ్లారు. అప్పటినుంచి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన అధికారి ఇన్‌చార్జిగా ఉన్నారు. రెగ్యులర్‌ అధికారి లేకపోవడంతో ప్రస్తుతం పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలున్నాయి. ఈ విషయమై ‘సాక్షి’ ఆ శాఖ అధికారుల వివరణ కోరేందుకు ఫోన్‌లో సంప్రదించగా వారు అందుబాటులోకి రాలేదు.

Advertisement
 
Advertisement
 
Advertisement