ఇన్‌చార్జి వీసీ ఇంకెన్నాళ్లు..!? | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జి వీసీ ఇంకెన్నాళ్లు..!?

Published Wed, May 22 2024 3:40 AM

ఇన్‌చార్జి వీసీ ఇంకెన్నాళ్లు..!?

● ‘బాసర’కు రెగ్యులర్‌ వీసీని ఇవ్వరా.. ● ట్రిపుల్‌ఐటీ సమస్యలు పట్టించుకోరా.. ● ఇప్పటికీ విడుదలకు నోచుకోని నోటిఫికేషన్‌ ● వర్సిటీపై ప్రభుత్వానికి పట్టింపు కరువు..!

భైంసా: చదువులతల్లి కొలువైన బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రంతో పాటు ఇక్కడే ఉన్న ట్రిపుల్‌ఐటీ విద్యాక్షేత్రంపైనా ప్రభుత్వం చిన్నచూపు చూస్తూనే ఉంది. బాసర ఆర్జీయూకేటీ 2024–25 విద్యాసంవత్సరం నోటిఫికేషన్‌ కూడా ఇప్పటికీ విడుదల కాలేదు. ఏళ్లు గడుస్తున్నా.. ఇక్కడ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్లతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రాష్ట్రంలోని ఏకై క ట్రిపుల్‌ఐటీగా ఉన్నా పట్టించుకునే వారే లేరు. రాష్ట్రవ్యాప్తంగా యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తున్నా.. ఐఏఎస్‌లను ఇన్‌చార్జీలుగా పెడుతున్నా.. బాసర వర్సిటీని మాత్రం లెక్కలోకి తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వాలు మారినా బాసర క్యాంపస్‌లో మార్పు రావడం లేదు. ట్రిపుల్‌ఐటీ ప్రారంభం నుంచి ఇప్పటివరకు విద్యార్థులు దశలవారీగా పోరాటాలు చేస్తున్నా సమస్యలు పరిష్కరించే సరైన అధికారి కనిపించడం లేదు. ఇప్పటికై నా రెగ్యులర్‌ వీసీని ఇస్తారా? లేదా? అన్న అనుమానాలే కొనసాగుతున్నాయి.

చిన్నచూపు ఎందుకు?

పేదింటి పిల్లలను ఉన్నతంగా తీర్చిదిద్దే విద్యాక్షేత్రంపై చిన్నచూపు కొనసాగుతోంది. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీకి రెగ్యులర్‌ వీసీ లేకపోవడం, ఇన్‌చార్జి వీసీ ఉన్నా ఆయన వర్సిటీలో ఉండకపోవడం దారుణం. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. క్యాంపస్‌లో కార్యక్రమం ఉన్నప్పుడే వచ్చివెళ్తున్నారు. స్థానికంగా ఉండే డైరెక్టర్‌ను కూడా తాజాగా మాతృసంస్థకు పంపించారు. దీంతో ట్రిపుల్‌ఐటీ పరిస్థితి ‘అందరూ ఉనా అనాధ’లా మారింది. వర్సిటీలో బాధ్యతలను డీన్‌లకే అప్పగించి చేతులు దులుపుకొనే పరిస్థితి కనిపిస్తోంది. పాత ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా ఆర్జీయూకేటీని పట్టించుకోవడం లేదని విద్యార్థులు, తల్లిదండ్రులు వాపోతున్నారు.

ఉద్యోగ భద్రత లేకపోవడంతో...

ఐఐటీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివిన వాళ్లు, మంచి మెరిట్‌ ఉన్న విషయ నిపుణులతో బాసర ట్రిపుల్‌ ఐటీ కళకళలాడేది. అలాంటి విద్యావంతుల బోధనతో వేలమంది విద్యార్థులు ఉన్నతస్థానాలకు ఎదిగారు. క్రమంగా తమ ఉద్యోగ భద్రత అగమ్యగోచరంగా మారడంతో సదరు అధ్యాపకులు ఇతర ఉద్యోగాల వైపు వెళ్లిపోతున్నారు. దాదాపు తొమ్మిదివేల మంది విద్యార్థులు ఉండే వర్సిటీలో కనీసం 350 మంది వరకు అధ్యాపకులు ఉండాలి. కానీ 125 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో రెగ్యులర్‌ వాళ్లు 20 మంది వరకే ఉండడం గమనార్హం.

ఇన్‌చార్జి వీసీలతోనే..

రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు ఆర్జీయూకేటీకి చాలా తేడా ఉంది. చుట్టూ ప్రహరీతో పూర్తిగా రెసిడెన్షియల్‌ క్యాంపస్‌గా ఉండే ఈ సువిశాల ప్రాంగణంలో దాదాపు వేలమంది విద్యార్థులుంటారు. ఇంతపెద్ద విద్యాసంస్థలో అప్పుడప్పుడు ఏదో ఒక ఘటన జరగడం సహజమే. కానీ తరచూ విద్యార్థుల ఆత్మహత్యలు, వారికి పెట్టే భోజనంతో సహా యూనిఫాం, ల్యాప్‌టాప్స్‌, షూస్‌.. ఇలా ఎన్నో వాటిలో సమస్యలు వస్తూనే ఉన్నాయి. స్థానికంగా పర్యవేక్షిస్తూ.. ప్రభుత్వంతో అనుసంధానిస్తూ.. విద్యార్థుల సమస్యలను పరిష్కరించగలిగే వాళ్లు ఇక్కడ అత్యవసరం. గతంలోనూ ఇన్‌చార్జి వీసీల పాలన కారణంగానే విద్యార్థులు ఉద్యమం చేపట్టే దాకా వెళ్లింది. అప్పుడు ఎన్నో హామీలిచ్చిన ప్రభుత్వం మళ్లీ పాత తప్పే చేసింది. ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌గా ఉన్న వెంకటరమణకు ఇన్‌చార్జి వీసీ బాధ్యతలిచ్చి చేతులు దులుపుకుంది. ఇప్పుడు ఆయన కూడా స్థానికంగా ఉండటం లేదు. తనకు ఇదొక అదనపు బాధ్యత మాత్రమే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అరకొర పట్టింపుతోనే ఆర్జీయూకేటీ జాతీయ స్థాయి అవార్డులు సాధిస్తోంది. ఇక పూర్తిస్థాయి వీసీని, సరిపడా అధ్యాపకులను నియమించి సమస్యలు లేని వర్సిటీని చేస్తే అంతర్జాతీయంగా పేరు తీసుకువస్తామని ఇక్కడి విద్యార్థిలోకం చెబుతోంది.

సీఎం హామీ ఇచ్చారు..

బాసర సరస్వతీ మాత చెంత ఉన్న ట్రిపుల్‌ ఐటీని ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగించాలన్నది మా ప్రయత్నం. అందులో భాగంగానే ఇక్కడ ఇన్‌చార్జి వీసీని తొలగించి రెగ్యులర్‌ వీసీని నియమించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరాం. వర్సిటీలకు సంబంధించి కమిటీ వేశామని, త్వరలోనే చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు.

– పవార్‌ రామారావు పటేల్‌, ఎమ్మెల్యే, ముధోల్‌

Advertisement
 
Advertisement
 
Advertisement