నిరసనలకు జంతర్ మంతర్ కేంద్రంగా ఎలా మారింది? ఇకపై ఏం కానుంది? | Jantar Mantar epicentre of protests since the 80s Now it isnt | Sakshi
Sakshi News home page

నిరసనలకు జంతర్ మంతర్ కేంద్రంగా ఎలా మారింది? ఇకపై ఏం కానుంది?

Oct 12 2026 9:16 PM | Updated on Oct 12 2026 9:25 PM

Jantar Mantar epicentre of protests since the 80s Now it isnt

ఢిల్లీలోని జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజా నిరసనలకు కీలక వేదికగా నిలిచింది. అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి మహిళల భద్రత, రైతుల సమస్యలు, విద్యార్థుల ఆందోళనల వరకు అనేక ఉద్యమాలకు ఈ ప్రాంతం కేంద్రంగా మారింది. అయితే, నిరసనలకు అధికారికంగా కేటాయించిన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను ఢిల్లీ పోలీసులు తొలగించడంతో ప్రజల ఆందోళనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వేదికలపై మరోసారి చర్చ మొదలైంది.

ప్రజా సమస్యలపై గళమెత్తడానికి జంతర్ మంతర్ అనేక వర్గాలకు అవకాశం కల్పించింది. ప్రభుత్వ అధికార కేంద్రాలకు సమీపంలో ఉండటంతో తమ సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెళ్లవచ్చని నిరసనకారులు భావించేవారు. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని అధికారిక నిరసన స్థలంగా గుర్తించకపోవడం ప్రజల నిరసన హక్కుపై ప్రభావం చూపుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 1993లో 33 సంస్థలు ప్రభుత్వ ఆర్థిక విధానాలు, మతతత్వానికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద జైల్ భరో ఆందోళన నిర్వహించాయి.

ఆ నిరసనలో దాదాపు 25,000 మంది పాల్గొన్నట్లు ఓ ఎంపీ పార్లమెంటులో ప్రస్తావించారు. 2011 ఏప్రిల్ 5న అన్నా హజారే అవినీతిని అరికట్టేందుకు బలమైన జనలోక్‌పాల్ బిల్లు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం మంత్రులు, పౌర సమాజ ప్రతినిధులతో కూడిన సంయుక్త ముసాయిదా కమిటీ ఏర్పాటుకు అంగీకరించడంతో ఉద్యమం ఊపందుకుంది. ఏప్రిల్ 9న ఆయన దీక్ష విరమించారు.

2012 డిసెంబరులో నిరసనలు
ఆ తర్వాత 2012 డిసెంబరులో ఢిల్లీలో కదులుతున్న బస్సులో ఓ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం, అనంతరం ఆమె మరణం దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యాయి. న్యాయం చేయాలని, మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని కోరుతూ వేలాది మంది యువత జంతర్ మంతర్ పరిసరాల్లో నిరసనలు చేపట్టారు. 2014లో ఈశాన్య రాష్ట్రానికి చెందిన విద్యార్థి నీడో తానియా మృతిపై కూడా ఇక్కడ ఆందోళనలు జరిగాయి.

ఈ ఘటన జాతి వివక్ష, ఈశాన్య ప్రాంత ప్రజలపై దాడుల అంశాలను చర్చలోకి తెచ్చింది. 2017లో తమిళనాడు రైతులు వ్యవసాయ సంక్షోభం, అప్పుల భారం, కరువు నష్టాలపై 41 రోజులపాటు నిరసన తెలిపారు. 2023లో భారత రెజ్లింగ్ సమాఖ్య అప్పటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా క్రీడాకారులను లైంగికంగా వేధించారనే ఆరోపణలతో ప్రముఖ రెజ్లర్లు ఆందోళన చేపట్టారు. ఆయనను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. 2024లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ వివాదంపైనా విద్యార్థులు నిరసనలు నిర్వహించారు.

అన్నా హజారే ఉద్యమంలో పాల్గొన్న రాణి శర్మ మాట్లాడుతూ.. జంతర్ మంతర్‌ను అధికారిక నిరసన స్థలాల జాబితా నుంచి తొలగించడం అసమ్మతి వ్యక్తం చేసే అవకాశాలను కుదించడమేనని అభిప్రాయపడ్డారు. “ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాలకు జంతర్ మంతర్ సమీపంలో ఉండటం వల్ల ప్రజలు తమ గళాన్ని వినిపించడానికి, తమ మాట వినిపించుకునేందుకు ఇది సరైన వేదికగా నిలిచింది. దీన్ని అధికారిక నిరసన స్థలంగా గుర్తించకపోవడం అసమ్మతి స్వరాలపై అణచివేత చర్య” అని ఆమె వ్యాఖ్యానించారు. మరోవైపు, జంతర్ మంతర్‌ను నిరసన స్థలంగా గుర్తించకపోవడం ప్రజా ఉద్యమాల భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వానికి సమీపంలో నిరసన తెలిపే అవకాశం తగ్గితే ప్రజల సమస్యలు ఎంతవరకు పాలకుల దృష్టికి చేరతాయన్నది కీలకంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement