Sakshi News home page

నేడు ములుగుకు ఈటల రాజేందర్‌ రాక

Published Wed, Nov 22 2023 1:38 AM

-

ములుగు: ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆయా పార్టీల ఉన్నత శ్రేణి నాయకులు రానున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయా పార్టీల నాయకులు సభల ఏర్పాటుకు తగిన పనులు చేస్తున్నారు. దీంతో రాజకీయ వేడి మరింత పెరగనుంది. అభ్యర్థుల గ్రాఫ్‌ పెరగడానికి సభలు సహకరిస్తాయని భావించి ఆయా పార్టీల అభ్యర్థులు మండలాల నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలను తరలించి తమ బలాన్ని చూపడానికి సిద్ధం అవుతున్నారు. మండలాల వారీగా ప్రజలను తరలించే పనిని ఆయా మండలాల ఇన్‌చార్జ్‌లకు అప్పగించారు. నేటి నుంచి 26వరకు జిల్లా కేంద్రం సభలు, రోడ్డు షోలతో హోరెత్తనుంది.

నేడు ములుగుకు ఈటల రాజేందర్‌ రాక

బీజేపీ అభ్యర్థి అజ్మీరా ప్రహ్లాద్‌ తరఫున ప్రచారం చేయడానికి హుజురాబాద్‌ ఎమ్మెల్యే, పార్టీ చేరికల కమిటీ కన్వీనర్‌ ఈటల రాజేందర్‌ నేడు(బుధవారం) జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్‌ సమీపంలో నిర్వహించనున్న సభకు హాజరుకానున్నారు. ఉదయం 10.30గంటలకు సభ నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. ఈటలలతో పాటు కేంద్ర మంత్రి రానున్నట్లు సమాచారం. అయితే కేంద్రమంత్రి ఎవరు అనేది సమాచారం లేదు. ప్రత్యేక చాపర్‌లో ఈటల రాజేందర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెలిపాడ్‌కు చేరుకుని అక్కడి నుంచి కాన్వాయ్‌ ద్వారా సభకు చేరుకుంటారు. అదే విధంగా ఈ నెల 26న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ప్రచార సభకు రప్పించేందుకు బీజేపీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా అధికారిక ప్రకటన వెల్లడికాలేదు.

24న సీఎం రాక

బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతిని ఎలాగైనా గెలిపించాలని ఆ పార్టీ నాయకులు, మంత్రులు పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీన సీఎం కేసీఆర్‌ ములుగుకు రానున్నారు. జిల్లా కేంద్రంలోని తంగేడు స్టేడియంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, రెడ్కో చైర్మన్‌ వై సతీశ్‌రెడ్డి సభాస్థలిని పరిశీలించారు. సుమారుగా 50 వేలకు పైగా ప్రజలు, మద్దతుదారులను తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఇతర నాయకులు బడే నాగజ్యోతిని గెలిపించే ప్రక్రియలో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ రాకకోసం తంగేడు స్టేడియంకు 150 మీటర్ల దూరంలో ప్రత్యేక హెలికాప్టర్‌ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంతో పాటు మంత్రులు పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం ములుగు చేరుకొని సభలో ప్రసంగిస్తారు.

ఖరారు కాని కాంగ్రెస్‌ నాయకుల తేదీలు

కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యే ధనసరి అనసూయ(సీతక్క) తరఫున ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వెంకటాపురం(ఎం) మండలంలోని రామాంజపూర్‌లో నిర్వహించిన ప్రచార సభకు హాజరయ్యారు. ప్రజలు, కార్యకర్తలను ఉత్తేజ పరిచారు. అనంతరం ప్రచారానికి వచ్చే ఉన్నత శ్రేణి నాయకుల వివరాలు బహిర్గతం కాలేదు. సీతక్క రోజు వారీగా ఒక్కో మండలంలో సైలెంట్‌గా ప్రచారం కొనసాగిస్తున్నారు.

మల్లంపల్లిపై ఫోకస్‌

ఇటీవల మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓను జారీ చేసిన విషయం తెలిసిందే. 14 గ్రామ పంచాయతీలతో మండలం ఏర్పాటు కానుండగా 25 వేల మందికి పైగా జనాభా ఉంది. ఇందులో 12వేల మంది ఓటర్లు ఉన్నారు. మొదటి నుంచి మండలం ఏర్పాటు చేయలేదని అక్కడి ప్రజలు ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. తుది సమయంలో మండల ప్రకటన రాగా ఓటర్ల నాడి పసిగట్టి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ, బీఎస్పీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి సీతక్క రెండుసార్లు ప్రచారం చేసింది. బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున మంత్రి సత్యవతి రాథోడ్‌ , పోచంపల్లి, రెడ్కో చైర్మన్‌ సతీష్‌రెడ్డి రోడ్డు షో నిర్వహించి ప్రచారం చేశారు.

సభాస్థలిని పరిశీలిస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రహ్లాద్‌

Advertisement
Advertisement