ఎన్నికల నిబంధనలు పాటించాలి | Sakshi
Sakshi News home page

ఎన్నికల నిబంధనలు పాటించాలి

Published Thu, Nov 16 2023 1:32 AM

అధికారులతో మాట్లాడుతున్న సవిన్‌ బన్సల్‌  - Sakshi

ములుగు: ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలని అసెంబ్లీ సాధారణ ఎన్నికల పరిశీలకుడు సవిన్‌ బన్సల్‌ అధికారులకు సూచించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పోలీస్‌ శాఖ పరిశీలకుడు అంజన్‌ చక్రబోర్తి, ఎన్నికల వ్యయ పరిశీలకుడు వాగీష్‌కుమార్‌సింగ్‌, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఇలా త్రిపాఠి, ఎస్పీ గాష్‌ ఆలంతో కలిసి ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న నోడల్‌ అధికారులతో నిర్వహణ, చేపడుతున్న చర్యలపై సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండేలా చూడాలన్నారు. మౌలిక సదుపాయాలు, తాగునీరు, టాయిలెట్లు, విద్యుత్‌, దివ్యాంగుల కోసం ప్రత్యేక ర్యాంపుల ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. నూతన ఓటర్లు సులభంగా ఓటు వేసే విధంగా ప్రత్యేక హెల్ప్‌ డెస్క్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవీఎంల వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా విద్వేశ ప్రసంగాలు, డబ్బుల పంపిణీ, ఇతరత్రా ఉల్లంఘనలపై సీ–విజిల్‌ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసుకునే వెసులు బాటు కల్పిస్తున్నామని, ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచాలన్నారు. ప్రజలు 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చనే విషయంపై అవగాహన కల్పించాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల ఎన్నికల ఖర్చు వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. సామాజిక మాద్యమాల్లో ఆడియో, వీడియోలు ప్రసారం చేయడానికి అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికల అంశాలకు సంబంధించి అభ్యర్థులు, ప్రజా ప్రతినిధులు, పార్టీల నాయకులు సాధారణ ఎన్నికల పరిశీలకుడు సెల్‌ నంబర్‌ 8500275774, వ్యయ పరిశీలకుడు వాగీష్‌కుమార్‌ సింగ్‌ సెల్‌ నంబర్‌ 8500275692, పోలీస్‌ పర్యవేక్షకుడు అంజన్‌ చక్రబోర్తి సెల్‌ నంబర్‌ 8712670126లకు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు అబ్జర్వర్లు జిల్లాలోనే ఉండి అన్ని అంశాలను పరిశీలిస్తారన్నారు. అనంతరం కలెక్టరేట్‌లోని ఈవీఎం గోదాం, కౌంటింగ్‌ హాల్‌ను పరిశీలించారు. ఈ సమావేశంలో ఓఎస్డీ అశోక్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి, ఏఆర్‌ అదనపు ఎస్పీ సదానందం, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

సాధారణ ఎన్నికల పరిశీలకుడు

సవిన్‌ బన్సల్‌

ఈవీఎం సెంటర్‌ను పరిశీలిస్తున్న అబ్జర్వర్లు
1/1

ఈవీఎం సెంటర్‌ను పరిశీలిస్తున్న అబ్జర్వర్లు

Advertisement
Advertisement