రజనీకాంత్‌ ఫోటో షేర్‌ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్‌ సిప్లిగంజ్‌ | Singer Rahul Sipligunj Says I Made A Mistake By Sharing Rajinikanth Pic | Sakshi
Sakshi News home page

రజనీకాంత్‌ ఫోటో షేర్‌ చేసి పెద్ద తప్పు చేశా: రాహుల్‌ సిప్లిగంజ్‌

Oct 19 2024 4:28 PM | Updated on Oct 19 2024 6:56 PM

Singer Rahul Sipligunj Says I Made A Mistake By Sharing Rajinikanth Pic

‘నాటు నాటు’సాంగ్‌తో దేశవ్యాప్తంగా పాపులర్‌ అయ్యాడు సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌. ఆ ఒక్క పాటతో దేశ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అయితే ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గుణం రాహుల్‌లో ఉంది. ఆస్కార్‌ అవార్డు సాధించినా.. ఆ గర్వాన్ని ఎక్కడ ప్రదర్శించలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో చేసిన పెద్ద తప్పు గురించి చెప్పాడు. 

నాకు రజకాంత్‌ అంటే చాలా ఇష్టం. రంగమార్తాండ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రకాశ్‌ రాజ్‌, రమ్యకృష్ణ గార్లతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. ఆ మూవీ షూట్‌లో ఉన్నప్పుడు.. నేను రజనీ ఫ్యాన్‌ అని ప్రకాశ్‌ రాజ్‌కు చెప్పాను. దీంతో ఓ సారి ప్రకాశ్‌ రాజ్‌ నన్ను పిలిచి రజనికాంత్‌ మూవీ షూటింగ్‌కి వెళ్తున్నా రమ్మని చెప్పారు. నేను వెంటనే వెళ్లిపోయాను. అప్పుడు అన్నాత్తే షూటింగ్‌ జరుగుతోంది. 

విరామం సమయంలో రజనీకాంత్‌ సర్‌కి నన్ను పరిచయం చేశారు.  అయితే అప్పుడు ఆయన ఆ మూవీ కాస్ట్యూమ్స్‌లో ఉన్నారు. అయినా కూడా నాకు ఫోటో దిగే అవకాశం ఇచ్చారు. అప్పటికీ ఆ సినిమాకు సంబంధించి తన లుక్‌ ఇంకా విడుదల కాలేదు. ఈ విషయం నాకు చెప్పి సినిమా రిలీజ్‌ వరకు ఆ ఫొటో షేర్‌ చేయొద్దని చెప్పారు. 

ఓ పది రోజుల తర్వాత ఆనందం తట్టుకోలేక ఒకరోజు దాన్ని సోషల్‌ మీడియాలో పెట్టేశా. అది వైరల్‌గా మారింది. హీరో లుక్‌ బయటకు రావడం వల్ల నిర్మాణ సంస్థ కంగారు పడింది. నాకు తెలిసి జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు అదే. ఒక అభిమానిగా ఇప్పటికీ బాధపడుతుంటాను. ఆ తర్వాత దానిని డిలీట్‌ కూడా చేసేశాను.

Advertisement
 
Advertisement
Advertisement