‘321’ మూవీ రివ్యూ.. లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్, ఏది గొప్ప? | 321 Movie Review And Rating in Telugu | Sakshi
Sakshi News home page

321 Movie Review: ‘321’ మూవీ ఎలా ఉందంటే..?

Oct 23 2026 2:31 PM | Updated on Oct 23 2026 2:42 PM

321 Movie Review And Rating in Telugu

టైటిల్‌: 321
నటీనటులు: మోహిత్ పెడద, లావణ్య సహుకర, వివాన్ సూర్య, లక్ష్మి వెన్నెల తదితరులు
నిర్మాణ సంస్థ:బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్
నిర్మాత: రామానుజ రెడ్డి 
దర్శకత్వం: శాంతికుమార్ చిలుముల
సంగీతం: కాల్విన్ జాయ్
విడుదల తేది: అక్టోబర్‌ 23, 2026

కథేంటంటే..
పెళ్లి విషయంలో విభిన్నమైన అభిప్రాయాలు ఉన్న ఒక అమ్మాయి, అబ్బాయి చుట్టూ తిరిగే కథ ఇది. అభి(మోహిత్‌ పెడద)కి ప్రేమ వివాహంపై నమ్మకం ఎక్కువ. దీనికి పూర్తి వ్యతిరేకం శృతి(లావణ్య). గత చేదు అనుభవాల వల్ల పెళ్లి తర్వాతే నిజమైన ప్రేమ మొదలవుతుందని శృతి భావిస్తుంది. ఇలాంటి భిన్నమైన ఆలోచనలు ఉన్న ఇద్దరూ..ఒకే ఆఫీస్‌లో ఉద్యోగులుగా కలుస్తారు. శృతిని చూసిన మొదటి చూపులోనే అభి ప్రేమలో పడతాడు. అభి తన స్నేహితురాలికి సాయం చేయడంతో శృతికి అతనిపై మంచి అభిప్రాయం ఏర్పడినప్పటికీ, గత అనుభవాల వల్ల ఆమె తన భావాలను వ్యక్తపరచదు. ఈ పరిస్థితుల్లో, గతంలో అభి చూసిన పెళ్లి సంబంధం రాధ మళ్లీ అతని జీవితంలోకి వస్తుంది. మరోవైపు లయ అనే మహిళ నుంచి అభికి నిరంతరం రహస్య కాల్స్ వస్తుంటాయి. ఈ భావోద్వేగ సంఘర్షణలు, ఉత్కంఠ మధ్య అభి ఎవరిని వివాహం చేసుకుంటాడు, అసలు ఆ లయ ఎవరు అనేది మిగిలిన కథ.

ఎలా ఉందంటే..
లవ్ మ్యారేజ్ లేదా అరేంజ్డ్ మ్యారేజ్ లలో ఏది గొప్పదనే వాదన కంటే, పరస్పర అవగాహన, గౌరవం ఉన్నప్పుడే దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుందనే సందేశం ఇచ్చిన చిత్రం 321.  మూడు ముళ్లు, రెండు హృదయాలు, ఒక జీవితం అనే భావనను హృద్యంగా చూపించారు. చిన్న చిన్న విషయాలకే విడిపోవాలనుకునే నేటి తరం యువతకు, కాలంతో పాటు ఆలోచనా విధానంలో మార్పు తెచ్చుకోవాల్సిన పెద్దలకు ఈ చిత్రం ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది. అయితే సందేశం బాగున్నా..దాన్ని ఆకట్టుకునేలా తెరపై చూపించడంలో మాత్రం దర్శకుడు కొంతవరకే సఫలం అయ్యాడు. సినిమా పరిధి చిన్నది కావడంతో పాటు, మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. ప్రేమకు సంబంధించిన సంభాషణలు, కుటుంబ సన్నివేశాల మధ్య వచ్చే మార్పులు కొన్ని చోట్ల పాత పద్ధతిలోనే సాగుతాయి. థ్రిల్లర్ అంశం బాగున్నప్పటికీ, ప్రారంభంలో వచ్చే ఆఫీస్ సన్నివేశాలను మరింత ఆసక్తికరంగా మలిచి ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది.

ఎవరెలా చేశారంటే.. 
చిత్రంలో నటించినవారంతా కొత్తవాళ్లే అయినప్పటికీ  సహజ సిద్ధమైన నటనను కనబరిచారు. అభి పాత్రలో మోహిత్ పెడద చక్కగా ఒదిగిపోయాడు. వినోదం పంచడంలోనూ, భావోద్వేగ సన్నివేశాల్లోనూ చక్కటి పరిపక్వత చూపించాడు. లావణ్య సహుకర శృతి పాత్రకు ఎంతో హుందాతనాన్ని తీసుకొచ్చింది. అంతర్గత భావాలను మోసే ఉద్యోగినిగా ఆమె నటన మెప్పిస్తుంది. వివాన్ సూర్య, లక్ష్మి వెన్నెల తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించి కథకు బలాన్ని చేకూర్చారు. టెలివిజన్ రంగ నేపథ్యం ఉన్నప్పటికీ, నటీనటులు వెండితెరపై ఎక్కడా అతిగా అనిపించకుండా సహజంగా మెప్పించారు.

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. దర్శకుడు శాంతికుమార్ చిలుముల బలవంతపు కమర్షియల్ హంగులకు, అసభ్య హాస్యానికి తావులేకుండా మానవ సంబంధాల విలువలను నిజాయతీగా తెరకెక్కించారు. సంగీత దర్శకుడు కాల్విన్ జాయ్ అందించిన పాటలు గ్రామీణ, పట్టణ వాతావరణాలకు సరిగ్గా సరిపోయాయి. భావోద్వేగాలతో పాటు ఉత్కంఠను పెంచే సన్నివేశాల్లో నేపథ్య సంగీతం బాగా కుదిరింది. ఆఫీస్ పరిసరాలు, కుటుంబ వాతావరణం, నగర జీవన దృశ్యాలను సినిమాటోగ్రాఫర్ సహజంగా చూపించారు. బ్రహ్మ ఆర్ట్ క్రియేషన్స్ నిర్మాణ విలువలు కథకు తగినట్లుగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement