దేశంలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోంది | Sakshi
Sakshi News home page

దేశంలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోంది

Published Fri, May 10 2024 3:15 PM

దేశంలో కాంగ్రెస్‌ సునామీ రాబోతోంది

నయీంనగర్‌: కాంగ్రెస్‌ పార్టీది గాలి కాదని.. సునామీ అని, కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ పార్టీ వరంగల్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య అన్నారు. హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో అధ్యక్షుడు వేముల నాగరాజు అధ్యక్షతన గురువారం ఏర్పాటు చేసిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ దేశంలో భారత్‌ జోడో యాత్ర ద్వారా రాహుల్‌గాంధీ రైతులు, శ్రామికులు, కర్షకులు, కార్మకులు, ప్రజలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 5న్యాయ్‌–25గ్యారంటీలతో ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. పోటీ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యనే ఉంటుందని.. బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో మద్దతు లేదన్నారు. కవిత అరెస్ట్‌పై ప్రజల్లో సానుభూతి లేదన్నారు. దేశాన్ని పదేళ్లు పాలించిన బీజేపీ కాజీపేటకు కోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వలేదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. అరూరి రమేష్‌ ఓడిపోతున్నాడు కాబట్టే కడియం శ్రీహరిపై ఆరోపణలు చేస్తున్నాడని చెప్పారు. లిక్కర్‌ స్కాం, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భూ కబ్జా ఆరోపణలు తన గెలుపునకు నష్టంచేస్తాయని కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర పూరితంగా వరంగల్‌ అభివృద్ధి చెందకుండా ఆరు ముక్కలు చేసి ప్రజలకు తీవ్ర నష్టం చేసిందని దుయ్యబట్టారు. తనను గెలిపిస్తే వరంగల్‌ను హైదరాబాద్‌ తీరులో అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు. ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు, ఐఐఎం, అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ సిస్టమ్‌, వరంగల్‌ ఐటీ పార్క్‌ విస్తరణ, తాగు–సాగు నీటి ఏర్పాటు, ఎస్‌ఎంఈల ఏర్పాటు, రిహాబిలిటేషన్‌ సెంటర్‌, ఇన్‌పేషెంట్‌ సైకియాట్రిక్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తానన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో గ్రామ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు అందరూ సహకరిస్తున్నారని తన గెలుపు ఖాయమన్నారు. కార్యక్రమంలో ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడు వేముల నాగరాజు, ప్రధాన కార్యదర్శి బొల్లారపు సదయ్య, జర్నలిస్టు సంఘాల నాయకులు బీఆర్‌.లెనిన్‌, మెండు రవీందర్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజల్లో మద్దతు లేదు

మీట్‌ది ప్రెస్‌లో కాంగ్రెస్‌ వరంగల్‌

ఎంపీ అభ్యర్థి కడియం కావ్య

Advertisement
 
Advertisement
 
Advertisement