Sakshi News home page

ఎన్నికల్లో విష్ణు సృష్టించిన గొడవలు ఇవీ..

Published Thu, Apr 18 2024 10:15 AM

-

● ఎన్నికలు వచ్చాయంటే విష్ణువర్ధన్‌రెడ్డి పూనకాలు వచ్చినట్లు ఊగిపోతాడు. ఎన్నికల్లో నేరుగా తానే స్వయంగా వెళ్లి దొరికిన ఆయుధాలతో దాడులకు తెగబడడం ఆయనకు అలవాటుగా మారిపోయింది.

● 1985లో పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏరాసు అయ్యపురెడ్డికి కేఈ సోదరులు మద్దతిచ్చి మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఓటమికి కారణమయ్యారనే కోపంతో కేఈ సోదరుల ఇంటిపై రౌడీమూకలతో దాడి చేయించాడు. అప్పట్లో కర్నూలు పాతబస్టాండ్‌ మొత్తం బీభత్సకరమైన వాతావరణం ఏర్పడింది.

● 1994లో ఆలంపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఎదురూరు విష్ణువర్ధన్‌రెడ్డి పోటీచేసిన సమయంలో ప్రత్యర్థి కొత్తకోట ప్రకాష్‌రెడ్డి బ్యాలెట్‌ బాక్స్‌ల్లో ఇంకు పోశాడన్న నెపంతో విష్ణువర్ధన్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి కొత్తకోట ప్రకాష్‌రెడ్డి అనుచరులను దాదాపు 35 మందిని గాయపరిచినట్లు అలంపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైంది.

● 1998లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి మద్దతుగా ఉంటూ ఆ ఎన్నికలో స్వయంగా దౌర్జన్యానికి దిగాడు. కల్లపరిలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా గ్రామస్తులంతా తిరగబడ్డారు. చివరకు పరిస్థితి విషమించడంతో ఒక ఇంటిలో విష్ణువర్ధన్‌రెడ్డిని బంధించారు. ప్రజలు శాంతించిన తర్వాత ఆ గ్రామ నాయకుడు యువీ రాజారెడ్డి వచ్చి విష్ణును క్షేమంగా ఊరు దాటించాడు.

● 1999 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి పడిన ఓట్లు టీడీపీ అభ్యర్థి టీజీ వెంకటేష్‌కు పడుతున్నాయని పుల్లారెడ్డి కాలేజీలో పెద్ద ఎత్తున విష్ణువర్ధన్‌రెడ్డి గొడవ చేశాడు. ఓ దశలో అప్పటి ఎమ్మెల్యే ఎం.శిఖామణిపై దాడి చేసేందుకు ప్రయత్నించగా విష్ణును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

● మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా తొలగించాలని కర్నూలు జిల్లా నుంచి 50 నుంచి 60 లారీల్లో జనాలను హైదరాబాద్‌కి తీసుకెళ్లి పీసీసీ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున అలజడి సృష్టించాడు.

● 2014 ఎన్నికలనంతరం కోడుమూరు నియోజకవర్గంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లను తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్పించి కోడుమురు నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జీగా పవర్‌ పెత్తనం నడిపాడు.

● 2019 ఎన్నికలో తెలుగుదేశం పార్టీలో ఉంటూ తన చిరకాల ప్రత్యర్థి అయిన కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై గొందిపర్లలో దాడికి తెగబడ్డాడు. తన అనుచరులను ఉసిగొల్పి కొత్తకోట ప్రకాష్‌రెడ్డిపై దాడి చేయించిన ప్రయత్నం అప్పట్లో సంచలనంరేకేత్తించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement