Sakshi News home page

స్టాటిక్‌ సర్వేలైన్స్‌ బృందాల పాత్ర కీలకం

Published Wed, Apr 17 2024 1:25 AM

సమావేశంలో మాట్లాడుతున్న నాసరరెడ్డి  - Sakshi

కర్నూలు (అర్బన్‌): సార్వత్రిక ఎన్నికల్లో స్టాటిక్‌ సర్వేలైన్స్‌ బృందాల పాత్ర చాలా కీలకమని మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ (ఎంసీసీ) నోడల్‌ ఆఫీసర్‌ జి.నాసరరెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్‌ సమావేశ భవనంలో స్టాటిక్‌ సర్వేలైన్స్‌ బృందాలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాటిక్‌ సర్వేలైన్స్‌ టీమ్‌లు తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని వాహనాల తనిఖీని ముమ్మరం చేయాలన్నారు. ఒక వాహనంలో రూ.50 వేలకు మించి ఉన్నట్లయితే, అందుకు తగిన ఆధారాలు చూపని పక్షంలో, అలాగే ఏవైనా రాజకీయ పార్టీకి చెందిన బ్యానర్లు, పోస్టర్లు, ఇతర ప్రచార సామాగ్రి విలువ రూ.10 వేలకు మించి ఉన్నట్లయితే ఆ వివరాలను ఎలక్షన్స్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ లాగిన్‌లో నమోదు చేయాలన్నారు. వివరాలను నమోదు కాగానే ఎన్నికల నిబంధనలను అమలు చేస్తున్న 13 ఏజెన్సీలకు సమాచారం వెళ్తుందన్నారు. సంబంధిత శాఖలు తక్షణమే స్పందించి ఎస్‌ఎస్‌టీ బృందాలతో సమన్వయం చేసుకుని పరిమితికి మించి ఉంటే సంబంధిత పత్రాల ఆధారంగా సీజ్‌ చేస్తారన్నారు. సీజ్‌ చేసిన నగదు, ఇతర వస్తువులను పంచనామా చేసి సంబంధిత రిటర్నింగ్‌ అధికారికి అందించాల్సి ఉందన్నారు. హౌసింగ్‌ పీడీ సిద్ధలింగమూర్తి మాట్లాడుతూ.. ఎస్‌ఎస్‌సీ బృందాలు తనిఖీ చేసే ప్రక్రియను వీడియోగ్రఫీ చేయించాలన్నారు. బంగారు నగలు ధరించిన/రవాణాకు సంబంధించి వివాహిత అయినట్లయితే 500 గ్రాములు అవివాహిత మహిళ అయితే 250 గ్రాముల వరకు, పురుషులకు సంబంధించి 100 గ్రాముల వరకు మినహాయింపు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్‌ సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంసీసీ నోడల్‌ ఆఫీసర్‌ జి.నాసరరెడ్డి

Advertisement
Advertisement