Sakshi News home page

నందవరం విద్యుత్‌ ఏఈ రవీంద్ర సస్పెన్షన్‌

Published Tue, Nov 21 2023 2:14 AM

-

ప్రైవేటు వ్యక్తితో పనులు, అతని మరణానికి కారణం

ఇప్పటికే లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్లపై సస్పెన్షన్‌ వేటు

ఏఈ ప్రమేయం ఉండడంతో తాజాగా చర్యలు

కర్నూలు(రాజ్‌విహార్‌): విద్యుత్‌ పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించి, ఒకరి చావుకు కారణమైన విద్యుత్‌ సంస్థ నందవరం మండలం ఏఈ రవీంద్రను సస్పెండ్‌ చేస్తూ కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎం.ఉమాపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలోని నదికైరవాడి గ్రామంలో ఈ నెల 14న ఓ ట్రాక్టర్‌ విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో స్తంభం విరిగిపోయింది. స్తంభం, తీగలు, మరమ్మతు ఖర్చు (సుమారు రూ.30వేలు) ట్రాక్టర్‌ యజమానే భరించాల్సి ఉండగా ఏఈ రవీంద్ర ట్రాక్టర్‌ డ్రైవర్‌ను వదిలేసి, సంస్థ సొమ్ముతో పనులు చేయించేందుకు శ్రీకారం చుట్టారు. నిబంధనల ప్రకారం ఏ పని చేయాలన్నా అంచనా వేసి, ఉన్నతాధికారుల నుంచి మంజూరు అయ్యాక సెక్షన్‌ (ఏఈ పరిధిలోని మండలం) కాంట్రాక్టర్‌ చేత పనులు చేయించి, బిల్లు చేయాలి. కానీ పనులు కాంట్రాక్టరుకు ఇవ్వకుండా ఏఈనే సొంతంగా చేయిస్తున్నట్లు సమాచారం. విరిగిపోయిన స్తంభం మార్చేందుకు సరైన ఎల్‌సీ (లైన్‌ క్లియరెన్స్‌ కోసం ఆ తీగలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి) తీసుకోకుండా ఈ నెల 15న పనులు చేయించేందుకు సిద్ధపడ్డారు. ఓ ప్రైవేటు వ్యక్తి నబీరసూల్‌ (సంస్థ ఉద్యోగి కాదు) చేత పనులు చేయిస్తున్న క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై అతను అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో సంబంధిత లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ భాస్కర్‌, అసిస్టెంట్‌ లైన్‌మన్‌ రాఘవేంద్రరావులను విద్యుత్‌ అధికారుల సస్పెండ్‌ చేశారు. అయితే వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఆదోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌ కుమార్‌ను విచారణాధికారిగా నియమించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావడంతో ఏఈపై చర్యలకు సిఫార్సు చేస్తూ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సంస్థ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.సంతోషరావు అనుమతితో ఏఈని సస్పెండ్‌ చేసినట్లు ఎస్‌ఈ ఉమాపతి తెలిపారు. అయితే గతంలోనూ ఇదే మండలంలో జరిగిన ప్రమాదంలో ఓ మహిళ చనిపోగా ఏఈ నిర్లక్ష్యం ఉన్నా లైన్‌మ్యాన్‌ను మాత్రమే సస్పెండ్‌ చేసినట్లు సమాచారం.

Advertisement
Advertisement