Sakshi News home page

3 రోజులు వర్షసూచన

Published Fri, Nov 17 2023 1:06 AM

- - Sakshi

యశవంతపుర: రాజధానితో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు బెంగళూరు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గురువారం సాయంత్రం నుంచి మూడురోజుల పాటు భారీవర్ష సూచన ఇచ్చారు. శుక్ర, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా భారీ వానలకు ఆస్కారముంది. బెంగళూరు చుట్టుపక్కల మేఘావృతమై, సాయంత్రం, రాత్రి వర్షం పడనుంది. కరావళి జిల్లాలో, ఉత్తర ఒళనాడులోను భారీ వానలు కురవవచ్చు. మైసూరు, మండ్య, చిక్కమగళూరు, చామరాజనగర, కోలారు జిల్లాలకు వర్షసూచన ఉంది. ఉత్తర కన్నడ, ఉడుపి, దక్షిణకన్నడ జిల్లాలో ఈ నెల 19 వరకు వానలు రావచ్చని తెలిపారు.

నక్సల్స్‌ కోసం

కొడగులో అలర్ట్‌

యశవంతపుర: కేరళ సరిహద్దుల్లో ఎస్‌టీఎఫ్‌ పోలీసులు– నక్సలైట్ల మధ్య కాల్పులు జరగటంతో కొడగు జిల్లా అటవీ ప్రాంతాలలో హై అలర్ట్‌ను ప్రకటించారు. కొడగుకు 9 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది. నక్సల్స్‌ మొబైల్‌ ఫోన్లను అక్కడే వదిలేయటంతో స్వాధీనం చేసుకున్నారు. వాటిలో విలువైన సమాచారం లభించినట్లు తెలుస్తోంది. కాల్పుల్లో ఒక నక్సల్‌ గాయపడినట్లు సమాచారం రావటంతో ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అటవీ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

డ్రైప్రూట్స్‌ షాపులపై

ఐటీ దాడులు

బనశంకరి: ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ అధికారులు బెంగళూరులోని పలుప్రాంతాల్లో డ్రై ప్రూట్స్‌ దుకాణాలు, యజమానుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. గురువారం ఉదయం రాజాజీనగర, బీవీకే అయ్యంగార్‌రోడ్డులోని డ్రై ఫ్రూట్స్‌ షాపుల్లో తనిఖీలు చేసి లావాదేవీలను పరిశీలించారు. ఇళ్లలో కూడా సోదాలు చేసి పరిశీలన చేపట్టారు. కంప్యూటర్లు, ఫైళ్ల తదితరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. బెంగళూరులో కొన్నివారాలుగా ఐటీ అధికారులు కాంట్రాక్టర్లు, బంగారు షాపులు, రియల్టర్లపై దాడులు చేస్తుండడం తెలిసిందే. ఆదాయపు పన్నుల ఎగవేతలే ఇందుకు కారణమని సమాచారం. వరుస దాడులతో ఎప్పుడు తమ ఇంటికి ఐటీ అధికారులు వస్తారోనని నగరంలోని ప్రముఖ వ్యాపారులు, సంపన్నుల్లో గుబులు నెలకొంది.

లంచంగా సెల్‌ఫోన్‌..

అధికారికి జైలుశిక్ష

యశవంతపుర: లంచం డిమాండ్‌ చేసిన శిరసి కొలతలు, తూనికల శాఖ ఇన్‌స్పెక్టర్‌ కేసీ మోహన్‌రాజుకి ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ కార్వార జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. వివరాలు... యల్లాపురకు చెందిన విశ్వనాథ నారాయణ దేసాయి మొబైల్‌ ఫోన్ల దుకాణం నిర్వహిస్తున్నారు. ఆ షాపును కొలతలు, తూనికల శాఖ ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రాజుతనిఖీ చేశాడు. బిల్లులు సరిగా లేవంటూ రూ.25వేల జరిమానా విధించాలని నిర్ణయించాడు. అయితే తనకు ఒక మొబైల్‌ ఫోన్‌ ఇస్తే రూ.3వేలు మాత్రమే జరిమానా వేస్తానని బేరం పెట్టాడు. దీంతో దుకాణ యజమాని లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. అధికారి మోహన్‌రాజ్‌పై లోకాయుక్త అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసును లోకాయుక్త తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లక్ష్మీకాంత ఎస్‌.ప్రభు వాదించారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.

డిసెంబరు 4 నుంచి

బెళగావి అసెంబ్లీ

దొడ్డబళ్లాపురం: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు బెళగావి సువర్ణసౌధలో డిసెంబరు 4 నుంచి జరగనున్నాయి. డిసెంబరు 15 వరకూ 10 రోజులపాటు సమావేశాలు కొనసాగుతాయని అసెంబ్లీ సచివాలయం అధికారిక ప్రకటన చేసింది. ప్రతి ఏడాది రెండు వారాలపాటు సువర్ణసౌధలో శాసనసభ సమావేశాలు జరపడం ఆనవాయితీ. సభాపతులు ఖాదర్‌, బసవరాజు హొరట్టి సువర్ణసౌధలో పరిశీలించి సూచనలిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలు చాలా వాడివేడిగా జరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement