పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం? | Sakshi
Sakshi News home page

పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?

Published Mon, May 27 2024 1:15 AM

పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?

● ప్యాకెట్‌పై రెండింతలు వసూలు ● విత్తనాల కృత్రిమ కొరత పేరిట దండుకుంటున్న వైనం ● పట్టించుకోని వ్యవసాయశాఖ ● టాస్క్‌ఫోర్స్‌ ఉన్నట్టా.. లేనట్టా? ● దిక్కుతోచని స్థితిలో జిల్లా రైతాంగం

కరీంనగర్‌ అర్బన్‌: పత్తి విత్తనాల కొరత పేరిట వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారు. నియంత్రించాల్సిన వ్యవసాయశాఖ అధికారులు పట్టించుకోక పోవడం విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి అధికారుల నిర్లక్ష్యం.. ఉన్నతాధికారు ల పర్యవేక్షణ లోపం అన్నదాతలకు శాపంగా మారింది. సాక్షాత్తూ కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోనే పత్తి విత్తనాలను అధిక ధరలకు విక్రయిస్తుండగా.. ఇక పల్లెల్లో పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు. వానాకాలం సీజన్‌ ముంచుకొస్తుంటే టాస్క్‌ఫోర్స్‌ ఉందా లేదా అన్నది అధికారులు ప్రకటించకపోవడం, ఫిర్యాదు నంబర్లు వెల్లడించకపోవడం వ్యాపారులకు వరమవుతోంది.

రెండు, మూడింతల ధరలు

పత్తి ప్యాకెట్‌ ధర రూ.862 కాగా, ఎక్కువ ధరకు విక్రయించవద్దని ఇటీవలే సీఎంతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి స్పష్టం చేశారు. కానీ, జిల్లాలో మాత్రం విరుద్ధ పరిస్థితి ఉంది. అధికారులతో ఉన్న లోపాయికారి ఒప్పందంతో ఇప్పటికే క్వింటాళ్ల కొద్దీ ప్యాకెట్లను నిల్వ చేసిన ఓ మార్వా డి వ్యాపారి భారీగా ధరలను పెంచేసి, విక్రయిస్తుండగా మరి కొందరు ఇదే దారిని అనుసరిస్తుండటంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. బ్రాండ్‌ పేరిట వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. జిల్లాలో వరి తర్వాత అధిక విస్తీర్ణంలో సాగయ్యేది పత్తి. దీంతో రెండు నెలల ముందుగానే పత్తి విత్తనాలను గోడౌన్లలో నిల్వ చేసిన వ్యాపారులు తీరా కర్షకులు కొనుగోలు చేసే సమయంలో కొరత పదాన్ని ఉచ్చరిస్తూ కాసులు దండుకుంటున్నారు. ఒక్కో ప్యాకెట్‌కు రూ.1,400, బ్రాండ్‌ పేరిట రూ.2,500 అంటూ కొత్త రాగం పాడుతున్నారు. అదీ ముందస్తుగా అడ్వాన్స్‌ ఇస్తేనే ఇవ్వగలమని చెబుతుండటం విశేషం. రాశి, నూజివీడ్‌, నాత్‌సీడ్స్‌, సాకేత్‌, యూఎస్‌ కంపనీల విత్తనాలకు మార్కెట్లో కొరత సృష్టించి, వీలైనంత దండుకుంటున్నారు. ఇక, సాకేత్‌ విత్తన ప్యాకెట్‌ను రూ.2,500 విక్రయిస్తున్నారు. ఇదెక్కడి అన్యాయమంటే.. ఎవరికీ చెప్పమంటేనే బ్లాక్‌ మార్కెట్‌ నుంచి తెప్పిస్తామని చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లకు ప్యాకెట్‌ రూ.700కు లభిస్తుండగా, ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ రూ.862. అయినా, అధిక ధరలతో రైతులను పీల్చిపిప్పి చేస్తున్నారు.

అధికారులు ఏం చేస్తున్నట్లు?

వ్యవసాయశాఖ పక్కాగా వ్యవహరిస్తే ఒక్క ప్యా కెట్‌ కూడా బ్లాక్‌ మార్కెట్‌కు వెళ్లే పరిస్థితి లేదు. కానీ, కొందరు అధికారులతో మామూళ్ల బంధంతో వ్యాపారులకు అడ్డూఅదుపు లేకుండా పో తోంది. వానాకాలం సీజన్‌కు రెండు నెలల ముందే జిల్లా వ్యవసాయ అఽధికారి, ఏడీఏలు, ఏవో, ఏఈవోలు సీడ్‌ డిస్ట్రిబ్యూటర్లు, రిటేల్‌, హోల్‌సేల్‌ వ్యాపారుల గోడౌన్లను తనిఖీ చేసి, రిజిస్టర్లను పరిశీలించాలి. ఏయే విత్తనాలు విక్రయిస్తున్నారు.. ఏయే కంపనీ సీడ్‌ ఎంత ఉంది.. అనే వివరాలను వ్యాపారులు కచ్చితంగా రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అధికారుల పర్యవేక్షణ కూడా అదేస్థాయిలో ఉండాలి. కానీ, అవేం జరగడం లేదన్నది రైతులు చెబుతున్న మాట.

టాస్క్‌ఫోర్స్‌ కమిటీలేవి..?

వాస్తవానికి కల్తీ విత్తన విక్రేతలు సీజన్‌కు రెండు నెలల ముందే వ్యాపారం విస్తరిస్తుంటారు. జిల్లాలో అనధికార గోడౌన్లలో కల్తీ దందా సాగుతుందన్న ఆరోపణలున్నాయి. జిల్లా వ్యవసాయ శాఖలోని ఓ అధికారి సంపూర్ణ సహకారంతోనే నిషేధిత మందులు, విత్తనాల అమ్మకాలు సాగుతున్నాయన్న వి మర్శలున్నాయి. గ్రామాల్లో, పట్టణాల్లో నమ్మకమైన వ్యక్తుల వద్ద విత్తనాలను నిల్వ చేసి, చాపకింద నీరులా రైతులకు చేరుస్తుంటారు. ఏప్రిల్‌, మే రెండో వారం కల్లా చేరాల్సిన చోటుకు చేరిపోతాయి. ఈ క్రమంలో ఏప్రిల్‌ నెల నుంచే వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో నిఘాను ఏర్పాటు చేస్తే అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. కానీ, నేటికీ టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం విడ్డూరం.

Advertisement
 
Advertisement
 
Advertisement