ఆలస్యం.. అవకాశం | Sakshi
Sakshi News home page

ఆలస్యం.. అవకాశం

Published Sun, May 26 2024 5:55 AM

ఆలస్యం.. అవకాశం

● స్థానిక సంస్థల ఎన్నికల జాప్యంతో అనర్హులకు ఊరట ● ఈ నెలాఖరుతో అనర్హత వేటు గడువు పూర్తి ● ఉమ్మడి జిల్లాలో 5వేల మంది పోటీకి అవకాశం

కరీంనగర్‌రూరల్‌: ‘ఆలస్యం అమృతం విషం’ అనే సామెత కొంతమందికి విషం కాగా.. రాజకీయ నాయకులకు మాత్రం అమృతంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఆలస్యం కావడంతో అనర్హతకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీచేసే అవకాశం కలిగించింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఆగస్టులో నిర్వహించే అవకాశముందనే సమాచారం అనర్హులకు ఆనందం కలిగిస్తోంది. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈ నెలాఖరుతో ముగిసిపోతోంది. దీంతో వీరికి పోటీ చేసే అవకాశం కలుగుతోంది. పంచాయతీ పాలకవర్గాల పదవీకాలం ఫిబ్రవరి 1న ముగియడంతో గ్రామాల్లో ప్రత్యేక అధికారుల పాలన ప్రారంభమైంది. జూలై 4న ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీకాలం ముగియనుంది.

ఐదువేల మందిపై..

స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులందరూ తప్పనిసరిగా లెక్కలు చూపెట్టాలి. అయితే కొందరు సకాలంలో లెక్కలు అప్పగించకుంటే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులయ్యారు. 2019 జనవరిలో పంచాయతీ, మే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో 1,212 పంచాయతీల్లోని సర్పంచులు, 12,045 మంది వార్డు సభ్యులు, 52 మంది జెడ్పీటీసీ సభ్యులు, 646 మంది ఎంపీటీసీ సభ్యులు ఎన్నికయ్యారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోపు పోటీ చేసిన అభ్యర్థులందరూ ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాలి. అయితే ఖర్చుల నివేదికపై అవగాహన లేకపోవడంతోపాటు మరోసారి పోటీ చేయమనే ఆలోచనతో పలువురు అభ్యర్థులు లెక్కలు అప్పగించలేదు. అధి కారులు పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో 2021 సంవత్సరంలో ఉమ్మడి జిల్లాలో 5,055 మందిపై అనర్హత వేటు పడింది. ఇందులో వార్డు మెంబర్‌ అభ్యర్థులు 4,228, సర్పంచ్‌ అభ్యర్థులు 410, ఎంపీటీసీ అభ్యర్థులు 387, జెడ్పీటీసీ అభ్యర్థులు 30 మంది ఉన్నారు.

ఈ నెలాఖరుతో గడువు ముగింపు

అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అవకాశం కలిగింది. అనర్హత నోటీసులు జారీ చేసినప్పటి నుంచి మూడు సంవత్సరాలు ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. వార్డుసభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ఈ నెలాఖరుతో అనర్హత వేటు కాలం ముగుస్తోంది. షెడ్యూల్‌ ప్రకారం సర్పంచు ఎన్నికలు నిర్వహిస్తే అనేకమంది పోటీచేసే అవకాశం కోల్పోయేవారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆగస్టులో నిర్వహించే అవకాశముండటంతో నిషేధం గడువు తీరిపోయి అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే అదృష్టం కలిసివచ్చింది.

ఉమ్మడి జిల్లాలో అనర్హుల వివరాలు

జిల్లా వార్డు సభ్యులు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు

కరీంనగర్‌ 1,295 115 145 07

జగిత్యాల 1,348 153 116 10

పెద్దపల్లి 1,104 96 79 10

రాజన్న సిరిసిల్ల 481 46 47 03

Advertisement
 
Advertisement
 
Advertisement