● కీలక బాధ్యతల నుంచి ‘ఔట్‌’ సోర్సింగ్‌ ● సీడీఎంఏ ఆదేశాలతో చర్యలు ● బల్దియాలో 11 మందికి స్థానచలనం | Sakshi
Sakshi News home page

● కీలక బాధ్యతల నుంచి ‘ఔట్‌’ సోర్సింగ్‌ ● సీడీఎంఏ ఆదేశాలతో చర్యలు ● బల్దియాలో 11 మందికి స్థానచలనం

Published Sat, May 25 2024 12:50 AM

● కీలక బాధ్యతల నుంచి ‘ఔట్‌’ సోర్సింగ్‌ ● సీడీఎంఏ ఆదేశాల

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరపాలకసంస్థలో ఎక్కడ అవినీతి, అక్రమాలు వెలుగు చూసినా...అందులో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపాత్ర తప్పకుండా కనిపిస్తోంది. కాంట్రాక్ట్‌ పద్ధతిన నియామకమైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కొంతమంది అవినీతి, అక్రమాలకు పాత్రదారులుగా ఉంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కాదు కాబట్టి, అవినీతి, అక్రమాలు నిరూపణ అయినా, తాము పెద్దగా నష్టపోయేది ఏమీ ఉండదనే భావన చాలామందిలో ఉందని విమర్శలున్నాయి. అంతేకాకుండా ఉన్నన్ని రోజులు సంపాదించుకొని వెళ్లాలనే ధోరణితో మరికొంతమంది ఉన్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఇక కొంతమంది అధికారులు అక్రమ సంపాదనకు నమ్మకస్థులైన ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులనే ఎంచుకుంటున్నారనేది బహిరంగరహస్యం. రెగ్యులర్‌ ఉద్యోగాల భర్తీ లేనందున, సేవలకు అంతరాయం కలగరాదనే ఉద్దేశంతో ఏర్పడిన ఔట్‌సోర్సింగ్‌ విధానం, క్రమక్రమంగా కలెక్షన్‌లకు దగ్గరిదారిగా మారింది.

కీలక బాధ్యతల నుంచి ఔట్‌

ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఆయా మున్సిపాల్టీల్లో అక్రమాలకు ఎక్కువగా బాధ్యులుగా తేలుతుండడం, పలు మున్సిపాల్టీల కమిషనర్ల నివేదికల ఆధారంగా కీలక బాధ్యతల నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తప్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సీడీఎంఏ మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌లకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలతో నేరుగా సంబంధాలుండే రెవెన్యూ విభాగానికి ఈ ఉత్తర్వులను ప్రస్తుతానికి పరిమితం చేశారు. పురపాలక, నగరపాలకసంస్థల రెవెన్యూ విభాగంలో కలెక్షన్‌ బాధ్యతలను ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అప్పగించొద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

11 మందికి స్థానచలనం

కరీంనగర్‌ నగరపాలకసంస్థ రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న 11 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను కీలకమైన బిల్‌కలెక్టర్ల బాధ్యతల నుంచి తప్పించారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు కీలక బాధ్యతలు నిర్వర్తించడంతో అక్రమాలకు అవకాశం ఎక్కువగా ఉండడంతో నగరపాలకసంస్థ అధికారులు ఈ చర్యలు చేపట్టారు. అంతకుముందు ఈ 11 మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు బిల్‌కలెక్టర్లుగా విధులు నిర్వర్తించారు. కానీ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మే ర కు వీరిని తప్పించి రెగ్యులర్‌ ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించారు. ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిని రెగ్యులర్‌ బిల్‌కలెక్టర్లకు సహాయకులుగా నియమించారు.

మిగతా విభాగాల్లోనూ...

నగరపాలక సంస్థ రెవెన్యూ విభాగంలో కీలక బాధ్యతల నుంచి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తప్పించినట్లుగానే ఇతర విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపై దృష్టి సారించాల్సి ఉంది. నగరపాలకసంస్థలో దాదాపు అన్ని విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో కొంతమంది కీలక బాధ్యతలు, ఎక్కువగా కంప్యూటర్‌ ఆపరేటర్స్‌గా విధులు సాగిస్తున్నారు. అయితే ఇందులో ఎక్కువ మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులపైనా అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నా యి. ఆయా విభాగాల్లో అక్రమాలకు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే బాధ్యులుగా కనిపిస్తున్నారు. సూత్రధారులు వేరైనా పాత్రధారులు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులే ఉంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement