ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర | Sakshi
Sakshi News home page

ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర

Published Fri, May 10 2024 1:30 PM

ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర

యంత్రాలయం లోపల స్వామి ఆవిర్భావం వివరాలు

ఆలయ నిర్మాణ సమాచారమూ నిక్షిప్తం

అన్నవరం: రత్నగిరిపై స్వయంభువుగా వెలసిన శ్రీ వీర వేంకట సత్యనారాయణ స్వామివారి ఆలయానికి 135 సంవత్సరాలకు పైబడిన చరిత్ర ఉంది. అయితే, దీని గురించి పుస్తకాల్లో తప్ప ఆలయంలో ఎక్కడ శిలా శాసనాలుగా కానీ మరే ఇతర రూపాల్లో కానీ భక్తులు తెలుసుకునేలా ఎటువంటి ఏర్పాటూ ఇప్పటి వరకూ లేదు. ఈ నేపథ్యంలో స్వామివారి చరిత్రను దేవస్థానం ఈఓ, దేవదాయ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ కె.రామచంద్ర మోహన్‌ శిలాశాసనంగా చెక్కించారు. స్వామివారి యంత్రాలయం లోపల ఈశాన్య దిశఘా భక్తులు వెలుపలకు వచ్చే ద్వారం పక్కన గ్రానైట్‌ గోడపై దీనిని తెలుగులో క్లుప్తంగా చెక్కించారు. యంత్రాలయ దర్శనానంతరం భక్తులు ఈ శాసనాన్ని చదివి, స్వామివారి ఆలయ చరిత్ర తెలుసుకుంటున్నారు.

ఏం చెక్కించారంటే..

‘తొలుత రత్నగిరిపై సత్యనారాయణ స్వామివారి విగ్రహం 1891వ సంవత్సరం ఖర నామ సంవత్సరంలో శ్రావణ శుద్ధ విధియ నాడు కనుగొనడమైనది. తదుపరి విజయ నామ సంవత్సరంలో 29.12.1893న మొట్టమొదటిగా నిర్మించిన ఆలయంలో స్వామివారి ప్రతిష్ఠ జరిగింది. అనంతరం తిరిగి 1933–34లో ఆలయాన్ని స్థానికంగా లభించిన రాయితో పునర్నిర్మించారు. అది శిథిలావస్థకు చేరినందున 2010లో దాని తొలగింపు ప్రక్రియ చేపట్టి, పూర్తి చేయడమైనది. 28.04.2011న ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తమిళనాడులోని నమ్మక్కల్‌ నుంచి గ్రానైట్‌ రాయి తెచ్చి, ఉలులతో చెక్కించి ఆ రాతితో యథాతథంగా ఆలయం పునర్నిర్మాణం జరిగింది. 14.03.2012న ఫాల్గుణ బహుళ సప్తమి నాడు స్వామివారిని పునఃప్రతిష్ఠించుట జరిగింది’ అని ఆలయ గోడపై చెక్కించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement