వీక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు ఏర్పాట్లు | Sakshi
Sakshi News home page

వీక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు ఏర్పాట్లు

Published Thu, Nov 23 2023 11:28 PM

సమీక్షలో మాట్లాడుతున్న ఉమా నండూరి  - Sakshi

కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ జాయింట్‌ సెక్రటరీ

కాకినాడ సిటీ: జిల్లాలో వీక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర ఏర్పాట్లపై కేంద్ర సాంస్కృతిక శాఖ జాయింట్‌ సెక్రటరీ, వీక్షిత్‌ భారత సంకల్పయాత్ర పర్యవేక్షకులు ఉమా నండూరి సంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని విధాన గౌతమి సమావేశపు మందిరంలో సంకల్ప యాత్రకు సంబంధించిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై మరింత అవగాహన కల్పించేందుకు వీక్షిత్‌ భారత్‌ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పథకాల లబ్ధి పొందని వారిని గుర్తించి సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపాలని అధికారులను కోరారు. ప్రతి గ్రామానికి వెళ్లేందుకు షెడ్యూల్‌ తయారు చేయాలన్నారు. శుక్రవారం నుంచి వచ్చే జనవరి 25వ తేదీ వరకూ ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. బ్యాంకర్లు, హాస్టల్‌ శాఖ , వివిధ ప్రభుత్వ శాఖలు చిన్న, చిన్న స్టాల్స్‌ను ఏర్పాటు చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ఒక వాహనం ద్వారా రోజుకు రెండు గ్రామాల్లో వీక్షిత్‌ భారత్‌ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కలెక్టర్‌ కృతికా శుక్లా, జిల్లా యంత్రాంగాన్ని ఆమె అభినందించారు. ఎంపీ గీత మాట్లాడుతూ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం పథకాలపై కూడా ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పిస్తారన్నారు. అర్హులైన లబ్ధిదారులకు అన్ని పథకాలు అందిస్తామన్నారు. కలెక్టర్‌ కృతికా శుక్లా మాట్లాడుతూ జిల్లాలోని 385 గ్రామ పంచాయతీల్లో వీక్షిత్‌ భారత్‌ సంకల్ప యాత్రకు ఏర్పాట్లు చేశామన్నారు. కేంద్రం నుంచి వచ్చే మూడు వాహనాలు రోజుకు రెండు గ్రామాలు తిరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఇలక్కియ, జెడ్పీ సీఈవో రమణారెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌ఓ జె నరసింహనాయక్‌, డీపీవో కె భారతిసౌజన్య, డీఆర్‌డీఏ పీడీ కె శ్రీరమణి, వ్యవసాయశాఖ జేడీ ఎన్‌ విజయకుమార్‌, పశుసంవర్థకశాఖ జేడీ ఎస్‌ సూర్యప్రకాశరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement