ఉవ్వెత్తున ఎగసిన సామాజిక ఉత్తేజం | Sakshi
Sakshi News home page

ఉవ్వెత్తున ఎగసిన సామాజిక ఉత్తేజం

Published Thu, Nov 23 2023 11:28 PM

- - Sakshi

ప్రత్తిపాడులో జరిగిన సామాజిక సాధికార సభకు హాజరైన జన సందోహంలో ఒక భాగం

ఈ నాలుగున్నరేళ్లలో సంక్షేమంతో తమకు పట్టం కడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు బ్రహ్మరథం పట్టాయి. ఆయా వర్గాలు సాధించిన సామాజిక సాధికారతను ప్రత్తిపాడు సభ ప్రతిబింబించింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తమకు చేసిన మేలును మరచిపోకుండా కృతజ్ఞత చూపుతామంటూ ఆయా వర్గాలు భారీగా తరలిరావడంతో ప్రత్తిపాడు సామాజిక సాధికారయాత్ర సభ జన సాగరాన్ని తలపించింది. తమ గౌరవ ప్రతిష్టలను మరింత ఇనుమడించేలా సామాజిక హోదా పెంచిన సీఎంకు ముక్త కంఠంతో మద్దతు పలికిన తీరు ముచ్చట గొలిపింది. ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ ఆధ్వర్యంలో సభా ప్రాంగణం సామాజిక నినాదంతో హోరెత్తింది.

సాక్షిప్రతినిధి, కాకినాడ: మెట్ట ప్రాంత పల్లెలన్నీ ప్రత్తిపాడు బాట పట్టాయి. జగన్‌ నినాదాలతో దారులన్నీ మారుమోగాయి. జగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వం అందించిన చేయూతతో సాధించిన సాధికారతను బడుగు వర్గాల నేతలు వివరిస్తున్నప్పుడు సభికులు హర్షధ్వానాలు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో భాగంగా గురువారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడులోని అల్లూరి సీతారామరాజు జంక్షన్‌లో సామాజిక సాఽధికార బహిరంగ సభ జరిగింది. దీనికి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చారు. మెట్ట ప్రాంతంలోని నాలుగు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన జనసందోహంతో బహిరంగసభ కోలా హలంగా మారింది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ద్వా రా అందిన సాయానికి జై జగన్‌ అంటూ నినదించారు.

గంట ముందే చేరుకున్న జనం

ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లోని పల్లెలతో పాటు మెట్ట ప్రాంతంలోని ఉప ప్రణాళికా ప్రాంతం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు పోటెత్తాయి. 4.30 గంటలకు సభ ప్రారంభమవ్వగా గంట ముందుగానే సభా ప్రాంగణం కిక్కిరిసి పోయింది. గంటకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగిస్తున్నంత సేపూ జనం ఆసక్తిగా ఆలకిస్తూ కనిపించారు. తమ వర్గాలకు జగన్‌ చేపట్టిన సంక్షేమాన్ని ప్రస్తావించిన ప్రతి సందర్భంలోను మహిళల నుంచి మంచి స్పందన లభించింది. గోదావరి జిల్లాల్లో ఏదో అయిపోతోందని చెబుతున్నదని బూటకాలు కల్పిస్తున్న వారంతా ఈ సభ చూడాలని వక్తలు పేర్కొన్నారు. జూలు విదిల్చిన సింహాలుగా కనిపిస్తోన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలను చూస్తే వారి మాటలు వాస్తవం కాదని అర్థమవుతోందన్నారు. ఈ సందర్భంగా ఒక్కసారిగా జగన్‌ నినాదాలు హోరెత్తాయి. బస్సు యాత్ర ఎందుకు చేపట్టామో నేతలు స్పష్టీకరించారు. పోరాట పటిమ, క్రెడిబులిటీ, సంక్షేమానికి రోల్‌మోడల్‌, దమ్మున్న నాయకుడు జగన్‌ అంటూ నేతలు అన్నప్పుడు అవును, అవును అంటూ ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలియజేశారు.

జగన్‌ వస్తేనే సంక్షేమం

14 ఏళ్ల పాలనలో బడుగు వర్గాలకు చంద్రబాబు చేయనిది నాలుగున్నరేళ్లలో సంక్షేమంతో చేసి చూపారంటూ మంత్రులు విశ్వరూప్‌, నాగార్జున గణాంకాలతో వివరించారు. వెన్నుపోటు పథకంలో సిద్ధహస్తుడు, నమ్మించి మోసంచేయడంలో దిట్ట అని చంద్రబాబు తీరును వీరు ఎండగట్టారు. చంద్రబాబుకే గ్యారంటీ లేదు. మళ్లీ బాబు పథకానికి గ్యారంటీ ఏమిటంటూ కన్నబాబు, సురేష్‌ ప్రశ్నించారు. జగన్‌ను సీఎంగా చేసుకుంటే సంక్షేమానికి ఢోకా ఉండదని నాయకులు నొక్కి చెప్పారు. ఎస్సీ,బీసీలకు నామినేటెడ్‌ పోస్టుల నుంచి బడ్జెట్‌లో రూ.4 లక్షల కోట్లకు పైనే కేటాయించడం, 30 లక్షల ఇళ్లలో 70 శాతం ఇవ్వడాన్ని ప్రస్తావించగా జనం సానుకూలంగా స్పందించారు. 2024లో మనకు ఏమి కావాలి..అని ఎంపీ నందిగం అడిగినప్పుడు జగనే కావాలంటూ బదులిచ్చారు. సభ సక్సెస్‌ కావడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలు వేసింది. ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, వరుదు కళ్యాణి, ఎమ్మెల్యేలు కె.పార్ధసారథి, పెండెం దొరబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల నేతలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. శరభవరం తప్పెటగుళ్లు, తీన్‌మార్‌ సహా కళాకారుల ప్రదర్శనలు ఉత్సాహాన్ని నింపాయి.

పోటెత్తిన ఎస్సీ, ఎస్టీ,

బీసీ సామాజిక వర్గాలు

మెట్ట నుంచి కదలివచ్చిన పల్లెసీమలు

సామాజిక సాధికార సభలో

నవ్యోత్సాహం

నేతల ప్రసంగాలకు సభికుల

హర్షధ్వానాలతో మద్దతు

సీఎం జగన్‌ నినాదాలతో

హోరెత్తిన ప్రత్తిపాడు సభ

సామాజిక న్యాయానికి రోల్‌ మోడల్‌

నాలుగున్నరేళ్లుగా దేశం మొత్తం మీద సామాజిక న్యాయాన్ని ఆచరణలోకి తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే దక్కుతుంది. సామాజిక న్యాయానికి ఆయన ఒక రోల్‌మోడల్‌. చంద్రబాబూ మీ హయాంలో సామాజిక న్యాయం ఏం జరిగిందో, గడచిన ఈ నాలుగున్నరేళ్లలో ఏ స్థాయిలో జరుగుతోందో చర్చకు సిద్ధమా. సామాజిక న్యాయానికి, సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా జగన్‌ నిలుస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓట్ల కోసం అక్కడి పార్టీలు ఏపీలో వలంటీరు వ్యవస్థ తీసుకువస్తామంటున్నాయి. ఏపీలో మాదిరిగానే పింఛన్‌లు తెల్లవారుజామునే ఇస్తామని చెబుతున్నాయి. ఈ మాటలే జగన్‌ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం.

– కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే

క్రెడిబులిటీకి కేరాఫ్‌ జగన్‌

చంద్రబాబు మేనిఫెస్టోను వెబ్‌సైట్‌ నుంచే తీసివేశారు. అందులో 10 శాతం కూడా నెరవేర్చలేదు. జగనన్న పాలన క్రెడిబులిటీకి కేరాఫ్‌. గత ఎన్నికల్లో సాధించిన ఘన విజయంలో ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీల పాత్ర కీలకమైనది. ఆ రోజు నమ్మకంతో మన వర్గాలన్నీ జగనన్నకు ఓటు వేశాయి. మనం పెట్టుకున్న నమ్మకాన్ని సుపరిపాలనతో ఆయన నిజం చేశారు. చంద్రబాబు పాలనలో బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలు అవమానాలకు గురయ్యారు. ఆయన హయాంలో బీసీలకు కేవలం రూ.35వేల కోట్లు ఖర్చుపెడితే, సీఎం జగనన్న 1.12 కోట్లు ఖర్చుపెట్టారు. ఎస్సీల కోసం చంద్రబాబు రూ. 33వేల కోట్లు వెచ్చిస్తే జగనన్న రూ. 75వేల కోట్లు ఖర్చుపెట్టారు. ఎస్టీలకు బాబు రూ.11వేల కోట్లు ఖర్చుపెడితే మన ప్రభుత్వం 25వేల కోట్ల ఖర్చు చేసింది.

– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ

1/3

2/3

3/3

Advertisement
Advertisement