ప్రతికూలం..! | Sakshi
Sakshi News home page

ప్రతికూలం..!

Published Fri, Dec 15 2023 12:56 AM

యాసంగిలో కూరగాయల సాగు, 
అంచనా వివరాలిలా.. 
 - Sakshi

ఆర్థికంగా నష్టపోయాం

వానాకాలం సీజన్‌లో క్యాలీఫ్లవర్‌, క్యాబేజీ సాగు చేశాం. ఆశించిన స్థాయిలో వర్షాలు రాకపోవడంతో దిగుబడులు తగ్గి ఆర్థికంగా నష్టాలు చవిచూశాం. యాసంగిలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో రెండు ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు చేస్తున్నాం.

– సుదర్శన్‌రెడ్డి, రైతు, గద్వాల

కూరగాయల సాగు తగ్గింది

వానాకాలం సీజన్‌లో వర్షాభావ పరిస్థితుల వల్ల కూరగాయల సాగు బాగా తగ్గింది. ఏటా ఒక్క వానాకాలం సీజన్‌లోనే 5వేల ఎకరాలకు పైగా వివిధ రకాల కూరగాయలు సాగు అయ్యేవి. భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల యాసంగిలోనూ ఆశించిన స్థాయిలో కూరగయాల సాగు ఉండటం లేదు.

– ఎంఏ అక్బర్‌, జిల్లా ఉద్యానశాఖ అధికారి

గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈఏడాది (2023–24) కూరగాయల సాగుపై వాతావరణం తీవ్ర ప్రభావాన్ని చూపింది. వానాకాలం సీజన్‌లో కూరగాయల సాగు సగానికి తగ్గగా.. యాసంగిలోనూ అదే పరిస్థితి ఏర్పడబోతోంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడం.. భూగర్బ జలాలు తగ్గిపోవడంతో కూరగాయలకు రైతులు వెనకడుగు వేస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా కూరగాయాల సాగు

జిల్లాలో సాధారణ పంటలతో పాటు కూరగాయలను ఏటా విస్తారంగా పండిస్తారు. రెండు సీజన్‌లతో కలిపి ఏటా దాదాపు 10వేల ఎకరాల్లో ఇక్కడి రైతులు వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తారు. గద్వాల మండలంలో వంకాయ, బెండ, పచ్చిమిర్చి, చిక్కుడు, క్యాలిఫ్లవర్‌, క్యాబేజీ ధరూర్‌ మండలంలో బెండ, టమాట మల్దకల్‌ మండలంలో చిక్కుడు, టమాట, బీర, సోరకాయ, బెండ, కాకర అయిజలో బెండ, చిక్కుడు వడ్డేపల్లిలో వంకాయ, బెండ, కాకర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌, ఉల్లి, అలంపూర్‌లో ఉల్లి, రాజోళిలో పచ్చిమిర్చి, ఉల్లి, టమాట గట్టు, కేటీదొడ్డి మండలాల్లో టమాటతోపాటు ఆకుకూరలు సైతం సాగు చేస్తారు. తమకున్న పొలంలో రెండు నుంచి ఐదు ఎకరాల్లో బోర్లు, బావుల కింద రైతులు కూరగాయలు సాగు చేస్తున్నారు.

వానాకాలంలో కేవలం 2858 ఎకరాల్లోనే..

ఏటా వానాకాలం సీజన్‌లో 5000 నుంచి 5500 ఎకరాల్లో, యాసంగిలో 4వేల నుంచి 4500 ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతున్నట్లు ఉద్యానశాఖ రికార్డులు చెబుతున్నాయి. అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. వర్షాకాలంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం, అధిక ఉష్ణోగ్రతలు ఉండటం మూలంగా కేవలం 2858 ఎకరాల్లో మాత్రమే కూరగాయలు సాగు అయ్యాయి. అరవై శాతం మాత్రమే సాగు అయ్యింది. సకాలంలో వర్షాలు రాక చాలా ప్రాంతాల్లో పంటను తీసివేసిన పరిస్థితి ఏర్పడింది.

గద్వాల శివారులో సాగు చేసిన క్యాలీఫ్లవర్‌

కూరగాయ రకం అంచనా ఇప్పటి వరకు

(ఎకరాల్లో) సాగైంది

టమాట 885 50

ఉల్లి 549 28

బీర 50 12

కాకర 40 20

సోరకాయ 21 12

చిక్కుడు 87 15

పచ్చిమిర్చి 78 52

వంకాయ 130 30

క్యాలీఫ్లవర్‌ 40 14

క్యాబేజీ 50 03

ఆకుకూర 54 24

ఇతర కూరగాయలు 959 40

కూరగాయల సాగుకు

అనుకూలించని వాతావరణం

వానాకాలం సీజన్‌లో తగ్గిన సాగు..

యాసంగిలోనూ అదే పరిస్థితి

తీవ్ర వర్షాభావం,

అధిక ఉష్ణోగ్రతలే కారణం

40శాతం మేర మధ్యలోనే

పంట తొలగింపు

జిల్లాలో ఏటా 10వేల ఎకరాల్లో

వివిధ రకాల కూరగాయల సాగు

యాసంగిలోనూ అదే పరిస్థితి

వానాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా, సగటు వర్షపాతం సైతం ఏ మండలంలోనూ నమోదు కాలేదు. దీని ఫలితంగా భూగర్భ జలాలు తగ్గి పోయాయి. బోర్లు, బావుల్లో జలాలు తగ్గిపోవడాన్ని ఉద్యానశాఖ అధికారులు గుర్తించారు. యాసంగిలో అనుకున్నంత కూరగాయల సాగు కాదు అని నిర్ధారణకు వచ్చారు. ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న నీటి వనరుల ఆధారంగా 2,943 ఎకరాల్లో కూరగాయలు సాగు అవుతాయని అంచనా వేశారు. ఏటా యాసంగిలో కనీసం 4వేల ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా ఈసారి 2,943 ఎకరాల్లో సాగు అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే డిసెంబర్‌ రెండో వారం వచ్చినా ఇప్పటి వరకు 300 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే కూరగాయలు సాగు అయ్యాయి. దీనిని బట్టి కూరగాయల పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏటా పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. కూరగాయల సాగుకు తగినంత నీటి లభ్యత ఉండాలి. బోర్లు, బావుల్లో నీటి మట్టాలు బాగా తగ్గాయి. దీనివల్ల కూరగాయలు వేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

మల్దకల్‌ శివారులో సాగు చేసిన పచ్చిమిర్చి
1/3

మల్దకల్‌ శివారులో సాగు చేసిన పచ్చిమిర్చి

2/3

3/3

Advertisement
Advertisement