వ్యవసాయ పనులు షురూ.. | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పనులు షురూ..

Published Sun, May 26 2024 3:10 AM

వ్యవసాయ పనులు షురూ..

జగిత్యాలఅగ్రికల్చర్‌: రోహిణి కార్తె శనివారం ప్రవేశించడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. నైరుతి రుతుపవనాలు ఈ కార్తెలోనే రానుండడంతో పశువుల ఎరువును రైతులు పొలాల్లోకి తరలిస్తున్నారు. చెత్తాచెదారం లేకుండా చేస్తున్నారు. భారీవర్షం పడగానే విత్తనాలు వేసేలా ప్రణాళిక వేసుకుంటున్నారు.

కూలీలతో ఒప్పందం

ఏడాదంతా పనిచేసేందుకు రైతులు కూలీలతో ఒప్పందం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మగమనిషికి రూ.లక్ష వరకు జీతం ఉన్నా.. దొరికే పరిస్థితి లేదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే పాలేర్లుగా ఉంటున్నారు. ఆడమనిషికి సుమారు రూ.50వేల వరకు ఇస్తున్నారు.

విత్తనాలు సిద్ధం

జిల్లాలో 4.16లక్షల ఎకరాల్లో వరి, మొక్కజొన్న, పత్తి, కంది, పెసర వంటి పంటలు సాగుకానున్నాయి. ప్రస్తుతం జనుము, జీలుగ, కంది, పెసర విత్తనాలు ఆగ్రోస్‌ సేవాకేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. జనుము, జీలుగ, పిల్లిపెసర, పెసర విత్తనాలు పంపిణీ చేస్తున్నామని అధికారులు చెబుతున్నా.. రైతులందరికీ అందడం గగనంగానే మారింది.

రసాయన ఎరువుల కొనుగోలు

గతంలో యూరియావంటి రసాయన ఎరువులకు కొరత ఏర్పడి రైతులు ఇబ్బందిపడ్డారు. దీనికితోడు రసాయన ఎరువుల ధరలు ఎప్పుడు పెరుగుతాయో..? ఎప్పుడు తగ్గుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో రైతులు ముందు జాగ్రత్తగా ఖరీఫ్‌ సీజన్‌కు సరిపడా యూరియా, కాంప్లెక్స్‌ ఎరువులు కొనుగోలు చేసి స్టాక్‌ పెట్టుకుంటున్నారు.

రుణాలపై రైతుల సందిగ్ధం

పంట రుణాలపై రైతుల్లో సందిగ్ధం నెలకొంది. వాస్తవంగా రైతులు మే, జూన్‌లో బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకుని ఏడాదిలోపు రెన్యూవల్‌ చేసుకుంటారు. ప్రభుత్వం ఆగస్టు 15 లోపు రూ.2లక్షలలోపు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఎదురుచూస్తున్నారు. రుణాల రెన్యూవల్‌కు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.

వర్షాలపైనే ఆందోళన

గతేడాది అత్యధికంగా వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతాలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్‌ మొదటివారంలోనే రావచ్చనే అంచనాల దృష్ట్యా రైతులు అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నారు.

రోహిణి కార్తె ప్రవేశం

సమాయత్తం అవుతున్న రైతులు

Advertisement
 
Advertisement
 
Advertisement