పరిషత్‌లే నాటకరంగ నిలయాలకు పునాదులు | Sakshi
Sakshi News home page

పరిషత్‌లే నాటకరంగ నిలయాలకు పునాదులు

Published Mon, Apr 8 2024 1:45 AM

నటరాజ పూజ చేస్తున్న 
డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు తదితరులు - Sakshi

యడ్లపాడు: పరిషత్‌లే నాటకరంగ నిలయాలకు పునాదులని డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు చెప్పారు. మండలంలోని లింగారావుపాలెంలో కొండవీడు కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ పరిషత్‌ సంయుక్తంగా నిర్వహించే జాతీయస్థాయి నాటికల పోటీలు ఆదివారం మొదలయ్యాయి. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు జ్యోతి ప్రజ్వలన, మల్నేని సుబ్బారావు నటరాజ పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ నాటికల ప్రదర్శనలు మొదటి రెండు రోజులు లింగారావుపాలెంలోనూ..తదుపరి రెండు రోజులు యడ్లపాడులో ప్రదర్శితం అవుతాయని తెలిపారు. మండేఎండల్లోనూ..ఎన్నికల కోడ్‌ ఉన్నప్పటికీ అధికారుల అనుమతితో నిర్వహిస్తున్న ఈ నాటికల ప్రదర్శనలను ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పరిషత్‌ కార్యవర్గం కట్టా శ్రీహరిరావు, తోకల సాంబశివరావు, కట్టా వీరాంజనేయులు, మల్నేని సీతారామయ్య, నంబూరి వీరాంజనేయులు, మండెపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

బాధ్యతలు గుర్తు చేసిన ‘కొత్తతరం కొడుకు’

తల్లిదండ్రులు, పిల్లల బాధ్యతను ’కొత్తతరం కొడుకు’ నాటిక తెలిపింది. పిల్లల్ని ప్రేమగా పెంచడం, పోషించడం తల్లిదండ్రుల బాధ్యత. పెరిగి పెద్దయ్యాకా తల్లిదండ్రుల్ని చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలదే అనే విషయాన్ని మరువకూడదన్న సందేశాన్ని వినూత్న తరహాలో చూపిన ‘కొత్తతరం కొడుకు’ నాటిక కథాంశం ఆకట్టుకుంది. వయసు మీద పడిన తల్లిదండ్రులు కాస్త కష్టమైనా తమ పిల్లల్ని దగ్గరే ఉండాలన్న సందేశం అందరినీ ఆలోచింపజేసింది. రావు కృష్ణారావు మూలకథకు చెలికాని వెంకట్రావు నాటకీకరణ, దర్శకత్వం వహించిన ఈ నాటికను మణికంఠ ఆర్ట్స్‌ (పిఠాపురం) వారు ప్రదర్శించారు.

ఆలోచింపచేసిన ‘నిశబ్దమా..నీ ఖరీదెంత’ ?

కుటుంబ వ్యవస్థను సంస్కరించే దిశగా చట్టంలో చేసిన ఓ మార్పుతో వ్యవస్థ సంగతి అటుంచితే ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఆయా కుటుంబాల్లోని కొందరు వ్యక్తులు మానసికంగా నలుగుతూ..కుంగిపోతున్నారనే అంశాన్ని కళ్లకు చూపెట్టిన కథే ‘నిశ్శబ్దమా..నీ ఖరీదెంత’ ? నాటిక. పీటీ మాధవ్‌ రచనకు చలసాని కృష్ణప్రసాద్‌ దర్శకత్వం వహించారు. తెలుగు కళాసమితి (విశాఖపట్నం) వారు ప్రదర్శించిన ఈ నాటికలో 498/ఏ ఐపీఎస్‌ చట్టాన్ని కొందరు అతివలు దుర్వినియోగం కారణంగా కుటుంబాల్లో రగులుతున్న చిచ్చు, కక్షసాధింపు చర్యలు, విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు ప్రస్తుత పరిస్థితిని అద్దం పట్టింది. అక్రమ సంబంధం నేరంకాదని సెక్షన్‌ 497 ఐపీఎస్‌ నుంచి తొలగించడం వల్ల కుటుంబ వ్యవస్థ, నైతికత పతనమవుతున్న వైనాన్ని అద్భుతంగా చూపింది.

బంధాల విలువల్ని తెలిపిన ‘అమృత హస్తం’

బంధాల విలువల్ని సమాజానికి ‘అమృత హస్తం’’ నాటిక తెలిపింది. సమాజంలో నానాటికి మృగ్యమైపోతున్న బంధాలు.. వాటి విలువలను చాటిచెప్పేదే ‘అమృతహస్తం’ నాటిక. ఒకే తల్లి గర్భాన జన్మించిన అన్నాచెల్లెళ్ల ప్రేమానుబంధం, దాని గొప్పతనాన్ని నేటి సమాజానికి తెలియజేయడం ఎంత అవసరమో అనే స్ఫూర్తిని నాటిక కలిగిస్తుంది. కావూరి సత్యనారాయణ రచనకు ఏపూరి హరిబాబు దర్శకత్వం వహించారు. అమరావతి ఆర్ట్స్‌ (గుంటూరు) సమర్పించిన ఈ నాటిక ప్రేక్షక మనసుల్ని బంధంలా పెనవేసుకుంది.

డాక్టర్‌ ముత్తవరపు సురేష్‌బాబు లింగారావుపాలెంలో జాతీయస్థాయి నాటికల పోటీలు ప్రారంభం కొండవీడు కళాపరిషత్‌, పుచ్చలపల్లి సుందరయ్య నాటకోత్సవ పరిషత్‌ నిర్వహణ తొలిరోజు మూడు నాటికల ప్రదర్శన

కొత్తతరం కొడుకు 
నాటికలోని ఓ సన్నివేశం
1/1

కొత్తతరం కొడుకు నాటికలోని ఓ సన్నివేశం

Advertisement
Advertisement