రాజ్యాంగం గొప్పది | Sakshi
Sakshi News home page

రాజ్యాంగం గొప్పది

Published Mon, Nov 27 2023 1:16 AM

- - Sakshi

జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇప్పుడు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సిద్ధిస్తుందంటే అది బీఆర్‌ అంబేడ్కర్‌ మహాశయుడు లిఖించిన రాజ్యాంగ గొప్పదనమేనని ఉమ్మడి గుంటూరు జెడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా చెప్పారు. ఆదివారం రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని జెడ్పీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన హెనీ క్రిస్టినా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అంబేడ్కర్‌ అందరికీ సమాన హక్కులు కల్పించారని కొనియాడారు. తాను ఈ రోజు జెడ్పీ చైర్‌పర్సన్‌గా ప్రజల ముందు నిలబడి ఉన్నానంటే అది రాజ్యాంగ గొప్పదనమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జె.మోహన్‌రావు, వైస్‌ చైర్‌పర్సన్‌ బత్తుల అనురాధ, పొన్నూరు జెడ్పీటీసీ రమేష్‌, కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడదాం

జాయింట్‌ కలెక్టర్‌ రాజకుమారి

గుంటూరు వెస్ట్‌: రాజ్యాంగం కల్పించిన హక్కులు వినియోగించుకుంటూ విధులు నిర్వర్తించి భారతీయ స్ఫూర్తిని కాపాడదామని జాయింట్‌ కలెక్టర్‌ జి.రాజకుమారి పేర్కొన్నారు. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ అందరూ రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటేనే సుఖమయ జీవనం సిద్ధిస్తుందని చెప్పారు. అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని గొప్పగా రచించారని చెప్పారు. అనంతరం ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీఆర్వో చంద్రశేఖరరావు, ఆర్డీఓ పి.శ్రీకర్‌, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్‌, సోషల్‌ వెల్ఫేర్‌ డీడీ మధుసూదనరావు, జిల్లా వ్యవసాయాధికారి నున్న వెంకటేశ్వర్లు, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ గుర్రం బ్రహ్మయ్య, కలెక్టరేట్‌ ఏఓ పూర్ణచంద్రరావు, జిల్లా అధికారులు అంబేడ్కర్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.

గిరిప్రదక్షిణకు

విస్తృత ఏర్పాట్లు

నరసరావుపేట రూరల్‌: కోటప్పకొండ గిరిప్రదక్షిణకు వచ్చే భక్తుల కోసం అటవీశాఖ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్టు జిల్లా అటవీశాఖ అధికారి ఎన్‌.రామచంద్రరావు తెలిపారు. అరుణాచలం తరహాలోనే కోటప్పకొండ గిరిప్రదక్షిణపై గైడ్‌ మ్యాప్‌తో కూడిన సమాచార బోర్డులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే భక్తులు సేదతీరేందుకు గిరిప్రదక్షిణ దారిలో గ్రానైట్‌ బెంచీలను సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు గిరి బాలవిహార్‌లో కొత్తగా వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. గిరిప్రదక్షిణ వెంట నైట్‌ క్యాంపింగ్‌ సదుపాయాన్ని ప్రారంభించినట్టు వెల్లడించారు. ఇందుకోసం భద్రతను పటిష్టం చేసేందుకు వాచ్‌మెన్‌ను నియమించినట్టు తెలిపారు. గిరిబాల విహార్‌, గిరిప్రదక్షిణ దారిలో సుందరీకరణ పనులు ప్రారంభించినట్టు పేర్కొన్నారు.

నేటి నుంచి చిన్నారులకు ఉచితంగా వైద్య పరీక్షలు

గుంటూరు మెడికల్‌: గుంటూరు జీజీహెచ్‌ ఆవరణలోని జిల్లా సత్వర చికిత్స కేంద్రం(డేక్‌ సెంటర్‌)లో 19 ఏళ్ల లోపు పిల్లలకు ఉచితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డేక్‌ సెంటర్‌ మేనేజర్‌ పావులూరి నాగశిరీష తెలిపారు. నవంబర్‌ 26నుంచి డిసెంబర్‌ 2 వరకు పిల్లల్లో పుట్టుకతో వచ్చే సమస్యలు, కంటి సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సమస్యలు, మానసిక సమస్యలకు స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేస్తారన్నారు. అంగవైకల్యం ఉన్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేస్తారని వెల్లడించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య శిబిరం జరుగుతుందని, వివరాలకు 96423 82249 ఫోన్‌ నెంబర్‌లో సంప్రదించాలని నాగశిరీష కోరారు.

1/2

2/2

Advertisement

తప్పక చదవండి

Advertisement