Congress: Review On Political Strategist Prashant Kishor Joined In Congress Rayani Dairy - Sakshi
Sakshi News home page

Congress Rayani Dairy: ప్రశాంత్‌ కిశోర్‌ (ఎన్నికల వ్యూహకర్త) రాయని డైరీ

Apr 24 2022 1:14 AM | Updated on Apr 24 2022 11:34 AM

Review On Political Strategist Prashant Kishor Joined In Congress Rayani Dairy - Sakshi

సోనియాజీకి ఒక్కో స్లయిడ్‌ వేసి చూపిస్తున్నాను. అవన్నీ 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే వ్యూహాల స్లయిడ్స్‌. ‘‘ఇంకా ఎన్ని స్లయిడ్స్‌ ఉన్నాయి కిశోర్‌?’’ అని అడిగారు సోనియాజీ!! ‘‘కొన్ని వందల స్లయిడ్స్‌ ఉన్నాయి మేడమ్‌జీ. ఇప్పటికి కొన్ని పదుల స్లయిడ్స్‌ మాత్రమే మీకు చూపించగలిగాను. చిన్న బ్రేక్‌ తీసుకుని మళ్లీ మొదలు పెడితే బాగుండని మీకు అనిపిస్తుంటే కనుక అలాగే చేద్దాం’’ అన్నాను. ఆ మాటకు రాహుల్‌ స్పందించారు. ‘‘నాకైతే అలాగే అనిపిస్తోంది కిశోర్‌. బ్రేక్‌ తీసుకోవడం వల్ల పునరుత్తేజం పొంది స్లయిడ్స్‌ని మరింత ఉత్సాహంగా చూడగలమేమో కదా..’’ అన్నారు రాహుల్‌.. ఒక పెద్ద అలవిమాలిన ఆవలింతతో! 

అప్పటికే ఆయన తన సీట్లోంచి లేచేందుకు సిద్ధమై ఉన్నారు. ఆ సమయానికి స్క్రీన్‌ మీద ‘ఉత్సాహం–ఉత్తేజం’ అనే స్లయిడ్‌ పడి ఉంది.‘‘రాహుల్‌ కూర్చో. మన మంచి కోసమే కదా కిశోర్‌ అన్నన్ని స్లయిడ్స్‌ వేసి చూపిస్తున్నాడు. ‘ఇంకా ఎన్ని స్లయిడ్స్‌ ఉన్నాయి కిశోర్‌..’ అని నేను అడిగింది.. కిశోర్‌కేమైనా బ్రేక్‌ తీసుకోవాలనిపిస్తోందేమోనని. అవతలి వాళ్ల కష్టసుఖాల గురించీ మనం ఆలోచించాలి కదా..’’ అన్నారు సోనియాజీ. ‘‘మరైతే రాహుల్‌జీ.. మీరెళ్లి బ్రేక్‌  తీసుకుని వస్తారా? అంతవరకు  ‘ఉత్సాహం–ఉత్తేజం’ అనే ఈ స్లయిడ్‌ని స్క్రీన్‌ మీద అలా కదలకుండా ఉంచేస్తాను’’ అన్నాను. ‘‘అవునా! అయితే మేం కూడా రాహుల్‌బాబుతో పాటు చిన్న బ్రేక్‌ తీసుకుని వచ్చేస్తాం..’’ అని జైరాం రమేశ్, కేసీ వేణు గోపాల్, దిగ్విజయ్‌సింగ్‌ లేచారు. తారిఖ్‌ అన్వర్, సుర్జేవాలా, సోనియాజీ, ప్రియాంక నేను.. ప్రెజెంటేషన్‌ రూమ్‌లో మిగిలాం. 

‘‘వాళ్లు బ్రేక్‌ తీసుకోవడానికి వెళ్లి మనకు బ్రేక్‌ ఇచ్చారుగా..’’ అని నవ్వారు తారిఖ్‌ అన్వర్‌. ఆ మాటకు అంతా నవ్వారు. ‘‘మనమెప్పుడూ ఇలాగే నవ్వుతూ ప్రజలకు కనిపించాలి. నరేంద్ర మోదీని చూసినా కూడా మన ముఖంపై చిరునవ్వు నాట్యమాడాలి. అప్పుడే పార్టీ ఎనర్జిటిక్‌గా ఉందని ప్రజలకు సంకేతం వెళుతుంది. పోల్‌ స్ట్రాటజీలో ఇది ఫస్ట్‌ పాయింట్‌..’’ అన్నాను. ‘‘ఇది ఫస్ట్‌ పాయింట్‌ అయితే కావచ్చు కానీ, పెద్ద పాయింట్‌ అయితే కాదనిపిస్తోంది. నరేంద్ర మోదీ నవ్వడం నేనెప్పుడూ చూళ్లేదు. గెలవడమే చూశాను.. ’’ అన్నారు సుర్జేవాలా. నవ్వుముఖంతో ఉన్నా లేకున్నా ఈసారి కాంగ్రెస్‌ గెలిచి తీరాలన్న సంకల్పం ఆయనలో  బలంగా ఉన్నట్లు క్రితంరోజు స్లయిడ్స్‌ వేస్తున్నప్పుడు కూడా నాకు అనిపించింది. ఆ ప్రెజెంటేషన్‌లో సుర్జేవాలాతో పాటు సచిన్‌ పైలట్, అశోక్‌ గెహ్లోత్, భూపేష్‌ బఘేల్,  మరికొందరు ఉన్నారు. వాళ్లలో ఒక్కరు కూడా నవ్వుముఖంతో లేరు. ‘ప్రశాంత్‌ కిశోర్‌కి ఇక్కడేం పని..’ అనే ముఖంతోనే ఉన్నారు. నేను ఏం మాట్లాడితే దానికి కౌంటర్‌ ఇస్తున్నారు. 

‘ఇండియా డిజర్వ్స్‌ బెటర్‌’.. ఇదీ మన పోల్‌ క్యాంపెయిన్‌. ఎలా ఉంది?’ అని అడిగితే.. దానికన్నా అర్ణబ్‌ గోస్వామి ‘నేషన్‌ వాంట్స్‌ టు నో’ అనే ట్యాగ్‌ లైనే ఎక్సయిటింగ్‌గా ఉంది’ అన్నారు సచిన్‌ పైలట్‌! ‘మన పార్టీ పునరుత్తేజ ప్రణాళిక పేరు ‘నటరాజ్‌’! సృష్టి, స్థితి, లయకారుడు కదా శివుడు.. అందుకే అలా పెట్టాను..’ అన్నప్పుడు.. ‘పార్టీ స్థితికి, సృష్టి స్థితి లయలకు సంబంధం ఏమిటి?’ అన్నారు భూపేష్‌ బఘేల్‌! నా ఐడియాలు నచ్చకా?! నేను నచ్చకా?! బ్రేక్‌ అయిపోయినట్లుంది.. రాహుల్, ఆయన వెనకే మిగతావారు లోపలికి వచ్చారు. స్లయిడ్‌ మార్చబోతుంటే.. ‘‘కిశోర్‌జీ! మీరు పార్టీ బయటే ఉండి స్ట్రాటజిస్ట్‌గా పని చేస్తారా? లేక, పార్టీ లోపలికి వచ్చి అడ్వైజర్‌గా ఉంటారా?’’ అని రాహుల్‌ అడిగారు!లోపల, బయట అనే మాట వచ్చిందంటే.. బయట బ్రేక్‌లో రాహుల్‌కి ఎవరి స్లయిడ్స్‌ వాళ్లు వేసి చూపించి ఉంటారు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement