దసరా దంగల్‌ | Swati Patil from Belagavi wins gold in wrestling at Mysuru Dasara sports | Sakshi
Sakshi News home page

దసరా దంగల్‌

Oct 23 2026 12:26 AM | Updated on Oct 23 2026 12:26 AM

Swati Patil from Belagavi wins gold in wrestling at Mysuru Dasara sports

న్యూస్‌ మేకర్‌

మైసూర్‌ దసరా ఉత్సవాల్లో కత్తి యుద్ధాలు, ఏనుగు అంబారీలే కాదు.. మట్టి అఖాడాలో అమ్మాయిల కుస్తీకూడా ఉంటుంది. కర్నాటక ఊళ్ల నుంచి తరలి వచ్చే మహిళా పహిల్వాన్లు గోదాల్లో భీకరంగా తలపడతారు. వాళ్లందరిలో గెలిచిన వారికి ‘దసరా కిషోరి’ బిరుదునిస్తారు. ఈసారి ఆ ఘనత పేదింటి అమ్మాయి స్వాతి పాటిల్‌ సాధించింది.

ఆ డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ అమ్మాయిని చూడటానికి ఊరంతా కదిలి వచ్చింది. పొలిమేరలో ప్రవేశించగానే జేజేలతో స్వాగతం చెప్పింది. భుజాలకు ఎత్తుకుంది. దండలు వేసింది. మరి మైసూరు దసరా వేడుకల్లో కుస్తీ గెలిచి ఊరి పేరును కర్నాటక అంతా మార్మోగించడం అంటే మాటలా? ఆ ఊరు కర్ణాటకలోని బెళగావి జిల్లా కాదోలి అనే చిన్న గ్రామం. ఆ అమ్మాయి పేరు స్వాతి పాటిల్‌. సాధించిన బిరుదు ‘దసరా కిషోరి’. మైసూరు దసరా వేడుకల్లో మహిళా పహిల్వాన్లతో తలపడి ఆ బిరుదు సాధించడం సామాన్యం కాదు.

నాడ కుస్తీ... కర్ణాటకలో కుస్తీ (నాడ కుస్తీ) కేవలం ఒక క్రీడ కాదు. అదొక శతాబ్దాల వారసత్వం. మైసూర్‌ దసరా ఉత్సవాలలో పురుషుల కుస్తీకి జనం విరగబడతారు. ఏం స్త్రీలు ఎందుకు కుస్తీ ఆడకూడదు అని 2006లో అధికారికంగా ప్రవేశపెట్టారు. తొలి ఏడాది 40 మంది అమ్మాయిలతో ప్రారంభమైన ఈ కుస్తీ ఇప్పుడు ఊహించని స్థాయికి చేరింది. ప్రస్తుతం కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక బెల్ట్‌ (బెళగావి, బాగల్‌కోట్, విజయపుర), మైసూర్‌ డివిజన్‌ (మండ్య, హాసన్‌), కోస్టల్‌ కర్ణాటకలోని వందలాది పల్లెల నుంచి దాదాపు 150 నుండి 200 మంది మహిళా పైల్వాన్లు దసరా బరిలో కుస్తీ కోసం కదంతొక్కుతున్నారు. వాళ్లందరిలోకెల్లా పహిల్వానుగా నిలిచి ‘దసరా కిషోరి’ టైటిల్‌ స్వాతి గెలుచుకుంది.

స్వాతి ఎవరు? స్వాతి పాటిల్‌ బెళగావిలో బి.ఎ. ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. చిన్నప్పటి నుంచి ఊళ్లో మగపిల్లలు కుస్తీలు పట్టడం చూస్తూ పెరిగిన స్వాతికి మట్టి అఖాడాపై తలపడాలని కోరిక. అమ్మాయిలకు కుస్తీ ఏంటనే సామాజిక అడ్డంకులను, పాతకాలపు ఆలోచనలను పక్కనపెట్టి, లోకల్‌ వ్యాయామశాలల్లో కఠినమైన క్రమశిక్షణతో  సాంప్రదాయ కుస్తీ పట్లను నేర్చుకోవడం ప్రారంభించింది. అయితే వాళ్లది పేద కుటుంబం.

 కుస్తీ లాంటి క్రీడకు రోజువారీ పాలు, బాదం, నెయ్యి, గుడ్లు వంటి హై-ప్రోటీన్‌ డైట్‌ కావాలి. ఆమె తల్లిదండ్రులకు అదో పెద్ద సవాల్‌గా మారింది. కనీస  జిమ్‌ వసతులు లేకపోయినా, స్పాన్సర్లు దొరకకపోయినా, మోకాళ్లకు గాయాలవుతున్నా భరిస్తూ.. కేవలం ఇంట్లో ఉన్న కొద్దిపాటి వనరులతోనే, పట్టుదలతో మట్టి అఖాడాలలో చెమటోడ్చింది స్వాతి.

మైసూరులో గెలుపు... ఈ ఏడాది మైసూర్‌ దసరా క్రీడలు స్వాతి జీవితాన్ని మలుపు తిప్పాయి. అత్యంత కఠినమైన 63 కేజీల విభాగంలో ప్రత్యర్థులను చిత్తు చేసి ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. అంతేకాకుండా ఎలాంటి బరువు పరిమితి లేని ‘ఓపెన్‌ కేటగిరీ’లో కూడా అటాకింగ్‌ గేమ్‌తో ఆడి సిల్వర్‌ మెడల్‌ సాధించి రన్నరప్‌గా నిలిచింది. దాంతో ‘దసరా కిషోరి’ బిరుదు సొంతమైంది.

 ఈ అద్భుత విజయంతో ఆమె సొంత గ్రామానికి చేరినప్పుడు ఊరు ఊరంతా కదిలి వచ్చి ఘనంగా సన్మానించింది. స్వాతి కష్టాన్ని, కుటుంబ ఆర్థిక ఇబ్బందులను గమనించిన అధికారులు, స్థానిక బ్యాంక్‌ డైరెక్టర్లు స్పందించి.. స్వాతి తదుపరి అంతర్జాతీయ స్థాయి శిక్షణ కు అయ్యే పూర్తి ఖర్చులను, ఆమె కుటుంబానికి కావాల్సిన ఆర్థిక సాయాన్ని అందిస్తామని అధికారికంగా హామీ ఇచ్చారు.

కష్టాల అఖాడాలో జీవితాన్ని ఎలా గెలవాలో స్వాతి నిరూపించింది. సరైన వసతులు, ప్రోత్సాహం అందితే పల్లెటూరి ప్రతిభ కూడా అంతర్జాతీయ వేదికపై దేశ జెండాను ఎగరేయగలదని ఆమె విజయం చాటి చెప్పింది. మట్టిలో మొదలైన ఆమె ప్రయాణం ఇప్పుడు మైసూర్‌ పీఠాన్ని దాటి ఒలింపిక్‌ పీఠం వైపు సాగాలని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement