స్కిన్‌ కేర్‌ 'ఏజ్‌ నో బార్‌'..! | Skin Care: These ways to reduce premature skin aging | Sakshi
Sakshi News home page

యవ్వనంగా ఉండాలంటే.. చర్మంపై ఫోకస్‌ తప్పనిసరి..!

Jun 24 2025 11:22 AM | Updated on Jun 24 2025 1:07 PM

 Skin Care: These ways to reduce premature skin aging

కాలం ఎవరికోసమూ ఆగదు. కాలం గడుస్తున్న కొద్దీ అది ప్రతి అంశం మీదా ఏదో ఒక ప్రభావం చూపుతుంది.అలాగే మన చర్మం మీద కూడా. వయసు పెరుగుతున్న కొద్దీ వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుండటంతో చర్మానికి వచ్చే  సమస్యలు, వ్యాధులొచ్చే అవకాశాలూ పెరుగుతాయి. అందుకే వయసు పెరుగుతున్న ప్రతి ఒక్కరూ...వారు ఏ వయసు వారైనప్పటికీ...తమ చర్మానికి వచ్చే కొన్ని సమస్యలను తెలుసుకుని తగిన శ్రద్ధ తీసుకోవడం అవసరం. కాలాన్నైతే ఆపలేం గానీ... దాని ప్రభావం వల్ల చర్మంపై వచ్చే మార్పులను ఆలస్యంగా వచ్చేలా చేసుకుని చాలాకాలం పాటు యౌవనంగా కనిపించవచ్చు. అదెలాగో తెలుసుకుందాం...

వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేమార్పులు...
సమయం గడుస్తున్న కొద్దీ చర్మానికి వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు చాలానే ఉంటాయి. ఉదాహరణకు చర్మాన్ని పొడిబార్చే జీరోసిస్‌ వంటి  సాధారణ సమస్యలు మొదలుకొని చర్మం కింద రక్తం పేరుకున్నట్లు కనిపించే పర్‌ప్యూరా, హిమటోమా వరకు... ఎండకు పగుళ్లుబారినట్లు కనిపించే సోలార్‌ ఎలాస్టోసిస్‌ మొదలుకొని... కొన్ని రకాల క్యాన్సర్స్‌ వరకు చాలా సమస్యలు రావచ్చు. 

అలాంటి సమస్యలేమిటన్నది చూద్దాం. చర్మంలో ప్రధానంగా మూడు పొరలు ఉంటాయి. బయటి పొరను ఎపిడర్మిస్, మధ్యపొరను డర్మిస్‌ అంటారు. దానికింద సబ్‌క్యుటేనియస్‌ టిష్యూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ మూడు పొరల్లో చాలా మార్పులు వస్తాయి. 

ఎపిడర్మిస్‌ పొర: ఈ పొర పలుచబారడం మొదలవుతుంది. ఈ పొరలో చర్మానికి రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గడం మొదలవుతుంది. అందుకే వృద్ధుల్లోని చర్మం చాలావరకు పారదర్శకంగా మారి... లోపలు ఉండే రక్తనాళాలు కొంతవరకు బాగా కనిపిస్తూ ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం పాలిపోయినట్లుగా అవుతుంది. 

డర్మిస్‌ పొర : ఇందులో చర్మ కణాలను గట్టిగా పట్టి ఉంచే కొలాజెన్, ఎలస్టిన్‌ అనే కనెక్టివ్‌ కణజాలాలు ఉంటాయి. వీటి వల్ల చర్మానికి సాగే గుణం, బలం సమకూరుతాయి. ఈ కణాలు బలంగా ఉన్నప్పుడు చర్మం బిగుతుగా ఉంటుంది. యౌవనంలో కొలాజెన్, ఎలాస్టిన్‌ కణజాలం బలంగా ఉంటుంది కాబట్టి చర్మం బిగుతుగా ఉంటుంది. 

వయసు పైబడుతున్నకొద్దీ ఈ బలం తగ్గుతుండటంతో చర్మం సాగినట్లుగా, వదులవుతున్నట్లుగా కనిపిస్తుంది. దాంతోపాటు డర్మిస్‌లో ఉండే రక్తనాళాలు సైతం బలహీనంగా అవుతాయి. దాంతో వయసు పెరిగిన వారిలో చిన్న దెబ్బకైనా వెంటనే రక్తస్రావం అవుతుంది. 

సబ్‌క్యుటేనియస్‌ పొర : ఇందులో కొవ్వు ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ కొవ్వు తగ్గిపోతూ ఉండటం కారణంగా చర్మం మునుపటిలా మందంగా ఉండదు. పలచబారి΄ోతుంది. ఈ పొరలోనే చెమట గ్రంథులూ, అలాగే చర్మంపై నూనెలాంటి పదార్థాన్ని స్రవించే సెబేషియస్‌ గ్రంథులూ ఉంటాయి. 

వయసు పెరుగుతున్న కొద్దీ ఈ గ్రంథుల పనితీరు కూడా తగ్గుతూ ఉంటుంది. దాంతో చెమట పట్టే సామర్థ్యం కూడా తగ్గిపోయి చర్మం పొడిబారినట్లుగా అవుతుంది. తన స్వాభావికమైన నునుపుదనాన్నీ కోల్పోతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ పైన చెప్పిన అన్ని సమస్యల కారణంగా చర్మం తన పటుత్వాన్ని కోల్పోయి వేలాడుతున్నట్లుగా అవుతుంది. 

చర్మంపై ముడుతలు (రింకిల్స్‌) కూడా వస్తాయి. కాలంతో వచ్చే ఈ మార్పులు రాకుండా చేయడానికిగానీ లేదా ఆపడం గానీ పూర్తిగా సాధ్యం కాదు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరిలో ఈ మార్పులు చాలా వేగంగా జరగవచ్చు. అందుకు కారణమయ్యే అంశాలివి...

తొలి ప్రభావం ఇలా...  
చర్మం పొడిబారిపోవడం, పాలిపోవడం, సాగేగుణం (ఎలాస్టిసిటీ) కోల్పోవడం, ముడుతలు, వేలాడినట్లుగా కావడం... ఈ గుణాలన్నీ తొలుత ముఖం, చేతుల చర్మంపై ఎక్కువగా కనిపిస్తాయి. ముఖంలోనూ ముక్కుకు ఇరువైపులా, నోటి చుట్టూ, దవడపైన ఉండే చర్మం, గవదల దగ్గరా ఎక్కువగా కనిపిస్తాయి. 

చేతుల విషయానికి వస్తే ముంజేతులు, కాళ్ల వద్ద ఉన్న చర్మంలో తొలుత మార్పులు వస్తాయి. ఆ తర్వాత శరీరంలోని మిగతా చర్మంపై అంతటా ఈ మార్పులు చోటు చేసుకుంటాయి. 

ముడతలు పడటం ఇలా : చర్మంపై వచ్చే ముడతల్లోనూ రెండు రకాలుగా చెప్పవచ్చు. తొలుత కాస్త స్పష్టంగా కనిపించే ముడతలను ‘ఫైన్‌ రింకిల్స్‌’ అంటారు. ఇవే ముడతలు మరింత లోతుగా, ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటే వాటిని ‘డీప్‌ రింకిల్స్‌’ అంటారు. 

ఇవి నలభై ఏళ్లు దాటాక మొదట్లో ముడతలు కాస్త కనిపించీ కనిపించనట్లుగా ఉంటూ, ఆ తర్వాత క్రమంగా మరింత లోతుగా మారుతుంటాయి.  తొలుత కనిపించీ కనిపించని సమయంలోనే చర్మంపై శ్రద్ధ తీసుకోకపోతే త్వరగానే డీప్‌ రింకిల్స్‌గా మారతాయి. 

జీరోసిస్‌  లేదా ఏస్టిటోటిక్‌ డర్మటైటిస్‌ : ఈ సమస్యనే మామూలు వాడుక భాషలో పొడి చర్మంగా చెప్పవచ్చు. ఈ సమస్య ముందుగా కాళ్లలోని మోకాలి కింద భాగంలో ఉన్న చర్మంలో ఎక్కువగా కనిపిస్తుంది. దుస్తులు కప్పని భాగాల్లో ఈ సమస్య కొంత స్పష్టంగా కనిపిస్తుంది. 

ఏజ్‌ స్పాట్స్‌ లేదా లివర్‌ స్పాట్స్‌ : చర్మానికి రంగును ఇచ్చే కణాలు మెలనోసైట్స్‌ తగ్గడం వల్ల ఒంటి రంగు పాలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఆ తర్వాత పెద్ద పెద్ద నల్లటి మచ్చలు వస్తాయి. వాటిని ఏజ్‌ స్పాట్స్‌ లేదా లివర్‌స్పాట్స్‌ లేదా సోలార్‌ లెంటిజీన్స్‌ అంటారు. చర్మం సూర్యరశ్మికి ఎక్స్‌΄ోజ్‌ అయ్యేచోట ఇవి ఎక్కువగా వస్తుంటాయి. 

సోలార్‌ ఎలాస్టోసిస్‌ : సూర్యరశ్మి నేరుగా తగిలే భాగాల్లో చర్మం కాస్త మందంగా మారినట్లుగా (లెదరీగా) ఉండటం, పగుళ్లువారినట్లుగా కనిపించడం జరుగుతుంది. ఈ సమస్య ఎండలో పనిచేసే వారిలో అంటే రైతులు, ఎండలో పనిచేసే కార్మికులు,  నావికుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.  

సెబోరిక్‌ కెరటోసిస్‌ : చర్మంపై కందిగింజ పరిమాణంలో (ముఖ్యంగా చేతుల మీద, ముఖంపైన) గోధుమరంగు (బ్రౌన్‌)లో మచ్చలు వస్తాయి. వాటినే సెబోరిక్‌ కెరటోసిస్‌ అంటారు. 

హైపోథెర్మియా : హైపోథెర్మియా అనే కండిషన్‌లో సబ్‌ క్యుటేనియస్‌ పొరలో ఓ మార్పు వస్తుంది. స్వేదగ్రంథుల సామర్థ్యం తగ్గిపోతుంది. చర్మం మందం కోల్పోయి పలచబారుతుంది. దాంతో ‘హై΄ోథెర్మియా’ కండిషన్‌ ఉన్నవారు – వాతావరణంలో చలి ఎక్కువగా ఉంటే సాధారణ వ్యక్తుల కంటే చలిని చాలా ఎక్కువగా ఫీలవుతారు. అలాగే ఉష్ణోగ్రత కొద్దిపాటి పెరిగినా వెంటనే ఎండదెబ్బకు గురవుతారు. 

స్కిన్‌ ట్యాగ్స్‌ లేదా యాక్రోకార్డాన్స్‌ : చర్మం వదులుగా మారి –  మెడలు, బాహుమూలాల వద్ద పులిపిర్లలా కాయల్లా కనిపిస్తాయి. తొడల వద్ద కూడా  కనిపిస్తాయి. అదనపు చర్మంలా ΄÷డుచుకు వచ్చినట్లుగా పులిపిర్ల (ఔట్‌గ్రోత్స్‌) లాగా కనిపిస్తాయి. 

ఎయిర్‌బార్న్‌ కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ : వయసు పైబడుతున్న కొద్దీ చర్మానికి అలర్జీలు వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి. అంతేకాదు అలర్జీలు చాలా తేలిగ్గా కూడా వస్తుంటాయి. పరిసరాల్లో ఉండే మొక్కల కారణంగా (పార్థీనియం వంటివి) చర్మంపై అలర్జీలు వస్తే దాన్ని ఎయిర్‌బార్న్‌ కాంటాక్ట్‌ డర్మటైటిస్‌ అని అంటారు. 

పర్‌ప్యూరా అండ్‌ హిమటోమాస్‌ : చర్మం కింద ఉన్న రక్తనాళాలు పెళుసుబారడం వల్ల (ఫ్రాజైల్‌గా మారడం వల్ల) అవి తేలిగ్గా చిట్లవచ్చు. దాంతో అక్కడ రక్తం చేరినట్లుగా చర్మం లోంచి బయటకు కనిపిస్తుంది. దాన్ని ‘సెనైల్‌ పర్‌ప్యూరా’  అంటారు. రక్తం పేరుకు΄ోవడంతో అక్కడ చర్మం కాస్త ఉబ్బుగా కనిపిస్తుంటే దాన్ని హిమటోమా అని అంటారు. 

కెరటో ఆకాంథోమా : వయసు పైబడుతున్న వారిలో, ఎండలో ఎక్కువగా తిరిగే వారిలో క్యాన్సర్‌కాని కొన్ని కాయలు (నాన్‌ క్యాన్సరస్‌ స్కిన్‌ గ్రోత్స్‌) కనిపిస్తాయి. అవి చాలా పెద్దగా ఉండి, చుట్టూ ఎత్తుగా ఉన్నా మధ్యలో గుంటలా ఉంటాయి. 

న్యూరోడర్మటైటిస్‌ : ప్రధానంగా పాదాల మీద నల్లటి మచ్చలా వచ్చి, చాలా దురదగా ఉండే లక్షణాలతో వ్యక్తమయ్యే సమస్య ఇది.

చర్మానికి వచ్చే ఇన్ఫెక్షన్‌లు
వయసు పైబడుతున్నకొద్దీ చర్మం ఇన్ఫెక్షన్స్‌కు తేలిగ్గా గురవుతుంది. ఆ ఇన్ఫెక్షన్లు ఇవి...

  • బ్యార్టీరియా వల్ల –ఫాలికులైటిస్, సెల్యులైటిస్‌ 

  • ఫంగస్‌ వల్ల–క్యాండిడియాసిస్, డెర్మటోఫైట్‌ ఇన్ఫెక్షన్స్‌ 

  • వైరస్‌ వల్ల–జోస్టర్‌

  • ఇన్‌ఫెస్టేషన్స్‌ వల్ల–గజ్జి (స్కేబిస్‌) వంటివి. 

ఆటో ఇమ్యూన్‌ వ్యాధులు 
తమలోని వ్యాధి నిరోధక వ్యవస్థ తమ సొంత కణాలనే శత్రుకణాలుగా భావించడం వల్ల వచ్చే వ్యాధులనే ఆటో ఇమ్యూన్‌ వ్యాధులుగా చెబుతారు. ఆటో ఇమ్యూన్‌ వ్యాధులకు ఒక ఉదాహరణగా సోరియాసిస్‌ను చెప్పవచ్చు. 

సోరియాసిస్‌ : వయసు పెరుగుతున్న కొద్దీ సోరియాసిస్‌ అనే చర్మ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇవి మొదట పొడిగా ఆ తర్వాత వెండిరంగు ΄÷ట్టు రాలుతున్నట్లుగా లక్షణాలు కనిపిస్తాయి. 

చర్మ కేన్సర్లు : చర్మ క్యాన్సర్లు కాస్త అరుదుగా వచ్చేవే అయినప్పటికీ... పెరుగుతున్న వయసు వాటికి ఒక రిస్క్‌ ఫ్యాక్టర్‌. అందుకే వయసు పెరుగుతున్న కొద్దీ చర్మానికి క్యాన్సర్‌ వచ్చే అవకాశాలూ పెరుగుతాయి. వయసు పెరుగుతున్న వారిలో బేసల్‌ సెల్‌ ఎపిథిలియోమా, స్క్వామస్‌ సెల్‌ కార్సినోమా, మెలనోమా వంటి క్యాన్సర్స్‌లు  కనిపించవచ్చు. 

జాగ్రత్తలు
వయసును ఆపలేకపోయినా... కొన్ని జాగ్రత్తలతోనూ, సూచనలతో పాటు మంచి పోషకాహారం, వ్యాయామాలతో... వయసుతో పాటు వచ్చే దుష్ప్రభావాలను చాలావరకు ఆపవచ్చు. వయసు పైబడుతున్న వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా చాలాకాలం పాటు చర్మాన్ని ఏజింగ్‌ తాలూకు లక్షణాల నుంచి సంరక్షించుకోవచ్చు. అవి... 

  • బాగా సుగంధభరితమైన సబ్బులు వాడకపోవడం. మైల్డ్‌ సోప్స్‌ మాత్రమే వాడటం 

  • బాత్‌ ఆయిల్స్‌ను వాడకపోవడం. బాత్‌ ఆయిల్స్‌తో, సుగంధభరితమైన సబ్బులతో అలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువ  

  • ఎండలోకి వెళ్లేప్పుడు తగినంత ఎస్‌పీఎఫ్‌ ఉన్న సస్‌స్క్రీన్‌ లోషన్స్‌ వాడటం. (చలికాలంలోనూ వీటిని వాడటం మానుకోకూడదు) 

  • మాయిశ్చరైజేషన్‌ లోషన్స్‌తో చర్మాన్ని పొడిబారకుండా చూసుకోవడం 

  • శరీరాన్ని దాదాపుగా కప్పి ఉంచే మంచి సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం 

  • అవసరాన్ని బట్టి క్యాప్‌ లేదా బ్రిమ్‌డ్‌ హ్యాట్‌ వంటివి వాడటం 

  • అన్ని రకాల పోషకాలూ ఉండే సమతుల ఆహారాన్ని తీసుకోవడం. పెరుగుతున్న వయసుతో చర్మంపై ప్రభావం కనపడనివ్వకుండా చేసుకోడానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అందులో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల చర్మం చాలాకాలం ఆరోగ్యంగా, ఏజింగ్‌కు గురికాకుండా ఉంటుంది. ఆకుకూరలు, పండ్లు, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి, విటమిన్‌ ఇ ఎక్కువగా ఉంటాయి 

  • ఆహారంతోపాటు తగినంత ద్రవాహారం తీసుకుంటూ శరీరంలోని లవణాలను కోల్పోకుండా (డీ హైడ్రేషన్‌కు గురికాకుండా) చూసుకోవడం 

  • పొగతాగే అలవాటును తక్షణం మానేయడం. (ఈ అలవాటు వల్ల కాలం గడిచేకొద్దీ ఏజింగ్‌ వల్ల చర్మంపై వచ్చే దుష్ప్రభావాలు చాలా వేగంగా వస్తాయి) 

  • గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం. (స్నానం చేసే విషయంలో గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... మనం స్నానానికి వాడే నీటి ఉష్ణోగ్రత... మన శరీర ఉష్ణోగ్రత కన్నా తక్కువగా ఉండటం మంచిది) ∙చర్మంపై వచ్చే ఇన్ఫెక్షన్స్‌కు వెంటనే చికిత్స తీసుకోవడం. (నిర్లక్ష్యం చేస్తే అవి మరిన్ని ఇతర సమస్యలకు దారితీయవచ్చు) 

  • డయాబెటిస్, థైరాయిడ్, పోషకాహారలోపాలు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో చర్మం పొడిబారిపోయి మరికొన్ని సమస్యలు రావచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం ద్వారా పెరిగే వయసుకు అతీతంగా చాలాకాలం పాటు యంగ్‌గా కనిపించవచ్చు.

డాక్టర్‌ కొప్పిశెట్టి సత్య నాగ రవితేజ, సీనియర్‌ డర్మటాలజిస్ట్‌ 

(చదవండి: ఏఐ, మెషిన్‌ లెర్నింగ్‌ కోర్సులవైపు యువత అడుగులు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement