ఆ దసరా రావాలి.. ఆ సరదా కావాలి | Dasara Festival Memories | Sakshi
Sakshi News home page

ఆ దసరా రావాలి.. ఆ సరదా కావాలి

Oct 19 2026 1:34 PM | Updated on Oct 19 2026 1:40 PM

Dasara Festival Memories

పావలా బేడిస్తే పట్టేది లేదు 
అర్ధ రూపాయిస్తే అంటేది లేదు 
ముప్పావలైతేను ముట్టేది లేదు.. 

ఒకప్పుడు దసరా రాగానే మా నోటి వెంట వచ్చిన రాగాలివి. ‘జయ విజయీభవా దిగ్విజయీ భవా!!..’ అంటూ దసరాను సరదాగా గడుపుకున్న రోజులవి. పాఠాలు చెప్పిన మాస్టార్లను వెంట బెట్టుకుని దండుగా కదిలిన జ్ఞాపకాలు మా బతుకంతా పచ్చగా ఉంటాయి. 
నేను ఎవరు అనుకుంటున్నారా.. నిన్నటి తరానికి ప్రతినిధిని. చేజారిపోయిన జ్ఞాపకాలను పోగు చేసుకుంటూ బతుకుతున్న మనిíÙని. ఇలాంటి పండగలు వచ్చినప్పుడు బాల్యాన్ని గుర్తు చేసుకుని ఆనందపడే సామాన్యుడిని.   

2000 అంతకంటే ముందు దసరా వస్తోందంటే చాలు ఊరు విశ్వరూప విన్యాసం చేసేది. బడి ప్రాంగణాలు కళకళలాడేవి. బడిలో సరస్వతీ పూజ, చిన్నారుల అక్షరాభ్యాసం ఎంతో వేడుకగా జరిగేవి. అక్షరాలు నేరి్పన గురువును సాక్షాత్తు దేవుడిగా భావించి గౌరవించేవాళ్లం.  

నాటి నవరాత్రుల్లో పిల్లల సందడి మామూలుగా ఉండేది కాదు. చేతుల్లో సంచులు పట్టుకుని కొండలు, గుట్టలు తిరిగి తంగేడు పూలను ఏరుకున్న జ్ఞాపకాలు ఇప్పటికీ మా గుండె గదులను దాటి పోలేదు. ఈ సాహసం ఎందుకో నేటి తరం పిల్లలు  చేయలేకపోతున్నారు. దసరా అంటే సెలవు మాత్రమే అనుకుంటున్నారు. 

ఇంటికొచ్చి రూపాయి, రెండు రూపాయల వెదురు ధనస్సుల కోసం అమ్మనాన్నల దగ్గర మారాం చేసేవాళ్లం. ఆ చిన్న ధనుస్సు చేతికి రాగానే లోకాన్నే జయించినంత సంబరపడిపోయేవాళ్లం. 

అవన్నీ నెమరువేసుకుంటుంటే.. మళ్లీ చిన్నపిల్లాడినై ఆ రోజుల్లోకి వెళ్లిపోతే బావుణ్ణనిపిస్తోంది.  
ఇట్లు, 
నిన్నటి తరం అభిమాని.
(కాశీబుగ్గ)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement