Indian students: యూరప్‌ పిలుస్తోంది.. | Better opportunities in Europe To Indian Students | Sakshi
Sakshi News home page

Indian students: యూరప్‌ పిలుస్తోంది..

Feb 26 2025 8:12 AM | Updated on Feb 26 2025 8:14 AM

Better opportunities in Europe To Indian Students

లక్షలాది మంది విద్యార్థులు, యువతకు భంగపాటు 

ఆంక్షల నేపథ్యంలో ఫ్రాన్స్, ఐర్లాండ్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాలకు పయనం

 ప్రధాని పర్యటనతో యూరప్‌లో మెరుగైన అవకాశాలు

 లైఫ్‌ సైన్స్‌ కోర్సుల్లో ఉద్యోగావకాశాలు పుష్కలం  

అమెరికా డాలర్‌ కల కరిగిపోతోంది. బాగా చదువుకొని యూఎస్‌లో స్థిరపడాలని ఆశించిన యువత ఆశల రెక్కలను ట్రంప్‌ మహాశయుడు తుంచేశాడు. ఏదో ఒక విధంగా అమెరికాకు వెళితే చాలు నాలుగు డాలర్లు వెనుకేసుకోవచ్చని ఆశించిన లక్షలాది మంది విద్యార్థులు, యువత భంగపాటుకు గురయ్యారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్ముకొని, ఊరూ, పేరూ లేని విశ్వవిద్యాలయాల్లో చేరి ఉన్నత చదువుల నెపంతో రకరకాల ఉద్యోగాలు చేస్తున్న యువత ట్రంప్‌ దెబ్బకు తిరుగుపయనం అవుతున్నారు.

మరోవైపు తమ పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారని, అగ్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకొన్న తల్లిదండ్రులు సైతం ట్రంప్‌ దెబ్బతో తల్లడిల్లుతున్నారు. ఈ  క్రమంలో ఉన్నత చదువులు చదివి విదేశాల్లో స్థిరపడాలని, బాగా సంపాదించాలని కోరుకొనే యువతను ఇప్పుడు యూరప్‌ దేశాలు ఆకర్షిస్తున్నాయి. కేవలం ఐటీ ఆధారిత కోర్సులు, ఐటీ ఆధారిత ఉద్యోగ, ఉపాధి అవకాశాలే కాకుండా లైఫ్‌సెన్స్, ఎని్వరాన్‌మెంటల్, బయోటెక్నాలజీ వంటి కోర్సుల్లోనూ అద్భుత అవకాశాలు ఉన్నాయని, విద్యార్థులు తమ అభిరుచికి తగిన వాటిని ఎంపిక చేసుకోవచ్చని పలు కన్సల్టెన్సీలు సూచిస్తున్నాయి.   

యూఎస్‌కు వెళ్లే విద్యార్థుల్లో చాలామంది ప్రామాణికమైన విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవడంలో విఫలమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. నకిలీ కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతున్నారు. ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్లిన తరువాత ఆ దేశంలో ఉండే  కన్సల్టెన్సీలు సైతం విద్యార్థులను మరోవిధంగా మోసం చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరేందుకు కనీసం రూ.40 లక్షల వరకూ ఖర్చు కావచ్చు. కానీ తాము కేవలం రూ.8 లక్షలతో మరో  వర్సిటీలో తమకు నచి్చన కోర్సుల్లో చేరి్పస్తామంటూ నమ్మిస్తున్నారు. మరోవైపు పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో అలాంటి యూఎస్‌ కన్సల్టెన్సీలను నమ్మి నకిలీ వర్సిటీల్లో చేరుతున్నారు. 

ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (ఓపీటీ)లో భాగంగా మొదటి 36 నెలల పాటు పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసుకొనే వెసులుబాటు ఉంటుంది. మరోవైపు  లాటరీలో హెచ్‌–1 వీసా లభిస్తే ఇక భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా ఉండబోదనే ఆలోచనతో తక్కువ బడ్జెట్‌ ఆఫర్‌లతో ఆకట్టుకొనే  వర్సిటీల్లో చేరుతున్నారు. మరి కొందరు రకరకాల విశ్వవిద్యాలయాల పేరిట ఆన్‌లైన్‌ కోర్సుల్లో చేరి ఒకే సమయంలో రెండు, మూడు రకాల పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలా ఒక నిర్థిష్ట లక్ష్యం లేకుండా, ప్రామాణికమైన విశ్వవిద్యాలయంలో చేరకుండా ఏదో ఒకవిధంగా స్థిరపడాలని  భావించే వారిపై ట్రంప్‌ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. యూఎస్‌లోని వివిధ ప్రాంతాల్లో కనీసం లక్షన్నర మంది విద్యార్థులు ఉన్నట్లు  నగరానికి చెందిన ఓ ప్రముఖ కన్సల్టెన్సీ వెల్లడించింది. ట్రంప్‌  విధానాల ఫలితంగా ప్రస్తుతం చాలా మంది విద్యార్థులు ఇంటిదారి పట్టినట్లు ఆ సంస్థ ప్రతినిధి 
చెబుతున్న మాట.

వెల్‌కం టు యూరప్‌.. 
ఈ క్రమంలో యూరప్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాల్లో చదువుకొని స్థిరపడాలని కోరుకొనే విద్యార్థులు ప్రస్తుతం బ్రిటన్, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌ తదితర దేశాలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘యూఎస్‌లో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి విద్యారంగంలో మార్పులు కనిపించాయి. ముఖ్యంగా ట్రంప్‌ గెలుపు అనివార్యంగా మారిన తరువాత చాలా మంది విద్యార్థులు యూఎస్‌ ఆలోచనను విరమించుకొని బ్రిటన్, తదితర దేశాలకు వెళ్తున్నారు.’ అని అమీర్‌పేట్‌కు చెందిన కాన్వొకేషన్స్‌ స్క్వేర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ వ్యవస్థాపకులు హిమబింధు కోల్లా తెలిపారు. 

జర్మనీ, ఫ్రెంచ్‌ వంటి భాషల్లో కొద్దిపాటి ప్రవేశం ఉన్నా చాలు అక్కడి విద్యాసంస్థల్లో చేరవచ్చు. స్విట్జర్లాండ్‌లోనూ గొప్ప విద్య, ఉద్యోగావకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇటీవల ప్రధాని పర్యటనతో మన విద్యార్థులకు  ఫ్రాన్స్‌ ప్రాధాన్యతనిస్తోంది. ప్రస్తుతం 5 సంవత్సరాల గడువుతో కూడిన వీసాలు ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేయవచ్చు. జర్మనీలో స్థిరపడుతున్న తెలుగువాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో అక్కడ 
స్థిరపడాలనుకొనేవారికి చక్కటి అవకాశాలు 
అందుబాటులో ఉన్నాయి.

సృజనాత్మకతకు పెద్దపీట.. 
చాలా మంది బీటెక్‌ చదివి ఇంజినీరింగ్‌ వైపే వెళ్లాలని భావిస్తారు. కానీ ఎన్విరాన్‌మెంటల్‌ సస్టెయినబుల్‌ గవర్నెన్స్‌ (ఈఎస్‌జీ), వేస్ట్‌మేనేజ్‌మెంట్, ఏఐ ఎథి్నక్స్, సైబర్‌క్రైమ్, సైబర్‌ సెక్యూరిటీ, ఫైనాన్షియల్‌ టెక్నాలజీ, నర్సింగ్, మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ వంటి వివిధ కోర్సుల్లో  ప్రతిభను చాటే విద్యార్థులు, యువతకు యూరప్‌ దేశాల్లో అద్భుత అవకాశాలు ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

స్పష్టమైన లక్ష్యంతో ఢోకా లేదు.. 
అమెరికాలో కూడా చదువుకోవచ్చు. అక్కడే మంచి ఉద్యోగాల్లో చేరి స్థిరపడొచ్చు. కానీ ఏ లక్ష్యంతో వెళ్లాలి, ఏ విశ్వవిద్యాలయంలో చదవాలనే విషయంలో స్పష్టత ఉండాలి. యూరప్‌లో అభిరుచికి తగిన కోర్సుల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకునేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి.  
– హిమబింధు కోల్లా, కాన్వొకేషన్స్‌స్కే్వర్‌ ఎడ్యుకేషన్‌ కన్సల్టెన్సీ 

 

Advertisement
 
Advertisement
Advertisement