తెలంగాణలో ‘గంధర్వ’ కార్యం! | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘గంధర్వ’ కార్యం!

Published Sun, Feb 19 2023 1:14 AM

Telangana: Brs Party Situation Analysis In Forthcoming Elections - Sakshi

గడువు ప్రకారం ఇంకో తొమ్మిది నెలల్లో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగాలి. ముందస్తు ఎన్నికల ప్రచారానికి ఇక తెరపడినట్టే! కర్ణాటకతోపాటే ఎన్నికలు (ముందస్తు) జరగాలంటే ఈ నెలాఖరులోగా శాసనసభను రద్దు చేయాలి. ఇప్పుడు రాజ్‌భవన్‌తోనూ, కేంద్రంతోనూ ఉన్న సంబంధాలను బట్టి చూస్తే అసెంబ్లీని రద్దు చేసి కూర్చునే సాహసానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగట్టే అవకాశం లేదు. కనుక షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి. అయినప్పటికీ ఎన్నికల సీజన్‌ ఇప్పటికే ప్రారంభమైంది.

జాతీయ పార్టీగా ప్రకటించుకున్న నేపథ్యంలో వస్తున్న ఎన్నికలు కనుక ప్రభుత్వాన్ని నిలబెట్టుకొని తీరవలసిన అవసరం బీఆర్‌ఎస్‌కు ఏర్పడింది. ఇప్పుడు గెలవకపోతే నేషనల్‌ హైవేపై రెడ్‌లైట్‌ పడినట్టవుతుంది. ఎంత పేరు మార్చుకున్నా తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్నందున ఎంతోకొంత ప్రజా వ్యతిరేకత ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు సుమారు 47 శాతం ఓట్లు పడ్డాయి. ఆ తర్వాత ఆరు నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆ ఓట్ల శాతం 41కి పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ రెండు ఎన్నికల్లోనూ సుమారు 30 శాతం ఓట్లతో స్థిరంగా నిలబడగలిగింది. బీజేపీ మాత్రం అసెంబ్లీతో పోలిస్తే అదనంగా 12 శాతానికి పైగా ఓట్లను సాధించింది.

ఈ వివరాలను బట్టి చూస్తే బీఆర్‌ఎస్‌కు అసెంబ్లీ ఎన్నికల్లో పడిన ఓట్లలో ఆరు శాతం బీజేపీకి బదిలీ అయ్యాయి. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ 2018లో మూడున్నర శాతం ఓట్లను సాధించింది. ఆరు నెలల తర్వాత ఈ ఓట్లలో ఒక శాతం కాంగ్రెస్‌కు, రెండున్నర శాతం బీజేపీకి బదిలీ అయ్యాయి. గతంలో 1998 లోక్‌సభ ఎన్నికల సందర్భంలో కూడా తెలంగాణ ప్రాంతంలో బీజేపీకి ఇరవై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఆ పార్టీ కనిపిస్తే ఒంటరిగా పోటీ చేసి కూడా ఇరవై శాతం ఓట్లను బీజేపీ పొందగలదనే విషయం రుజువైంది. అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి ప్రత్యామ్నాయంగా కనిపించిన సందర్భం గతంలో రాలేదు. ఇప్పుడు ఆ సందర్భాన్ని సృష్టించడానికి కమలం పార్టీ విశ్వప్రయత్నం చేస్తున్నది.

నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వ వ్యతిరేక ప్రభావం వల్ల బీఆర్‌ఎస్‌ బలమేమైనా తగ్గిందా? లేక పెరిగిందా? కాంగ్రెస్‌ పార్టీలో దిగే మెట్లే తప్ప ఎక్కే మెట్లు కనిపించని ఈ పరిస్థితుల్లో అంతా భావిస్తున్నట్టు ఓటింగ్‌ బలాన్ని ఏ మేరకు ఆ పార్టీ కోల్పోయి ఉంటుంది? కోల్పోతే ఏ పార్టీ ఖాతాలోకి? తనను తాను ప్రత్యామ్నాయ శక్తిగా చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీ ఇరవై శాతాన్ని దాటి ఏ స్థాయికి బలాన్ని పెంచుకోగలిగింది? క్షేత్రస్థాయి పరిస్థితులను శాస్త్రీయ పద్ధతిలో మదింపు చేయడం ద్వారా మాత్రమే ఈ ప్రశ్నలకు సమాధానాలను వెతుక్కోవడం సాధ్యమవుతుంది. అలా మదింపు చేసిన సమాచారాన్ని బట్టి మజ్లిస్‌ పార్టీ ఖాయంగా గెలిచే ఏడు స్థానాలు పోను మిగిలిన 112 చోట్ల కూడా అధికార పార్టీ ప్రధాన పోటీదారుగానే ఉంటుంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు శాతం ఓట్లతో ఒక్క సీటే గెలిచిన బీజేపీ గణనీయంగా పుంజుకొని సుమారు యాభై స్థానాల్లో గట్టి పోటీదారుగా కనబడుతున్నది. ఇంకో యాభై సీట్లలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా పోటీపడుతున్నది. పది పన్నెండు స్థానాల్లో త్రిముఖ పోటీ ఉండవచ్చు. తాజా జాతీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ ప్రతిష్ట మసకబారితే ఈ అంచనాలు మారవచ్చు.

తెలంగాణలో చిన్న పార్టీలు కూడా పెద్దసంఖ్యలోనే ఉన్నాయి. వాటికి తోడు తిరుగుబాటు అభ్యర్థులూ, ఇండిపెండెంట్లూ వగైరాలు కలిసి ఎనిమిది నుంచి పది శాతం ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉంటుంది. మిగిలిన 90–92 శాతం ఓట్లనే మూడు ప్రధాన పార్టీలు పంచుకోవాలి. లోక్‌సభ ఎన్నికల్లో పడిన 41 శాతం ఓట్లను బీఆర్‌ఎస్‌ యథాతథంగా నిలబెట్టుకోగలిగితే మిగిలిన యాభై శాతం ఓట్లలో బీజేపీ, కాంగ్రెస్‌లు పునర్విభజన చేసుకోవాల్సి ఉంటుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి పాత జిల్లాల్లో బీజేపీ ప్రభావం కనబడుతున్నది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పరిస్థితి బీజేపీ కంటే మెరుగ్గా ఉన్నది. ఖమ్మం జిల్లాలో పొంగు లేటి శ్రీనివాసరెడ్డి బీజేపీలో చేరతారనే ప్రచారమే నిజమైతే ఆ జిల్లా ముఖచిత్రం కూడా త్రిముఖ పోరుగా మారవచ్చు.

బీఆర్‌ఎస్‌కు 41 శాతం ఓట్లు భద్రంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లో ఉన్నాయనే అభిప్రాయం నిజమైతే మిగిలిన యాభై శాతంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్, బీజేపీలకు చెరో ఇరవై ఐదు శాతం ఓట్లు పడవచ్చు. ఈ లెక్క ప్రకారం బీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుపై నడక కావాలి. కానీ, ఈ పరిస్థితిని మార్చేస్తామన్న ధీమా బీజేపీ వ్యక్తం చేస్తున్నది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదని, అందువల్ల బీఆర్‌ఎస్‌ ఓట్లు కొన్ని తమ ఖాతాలో పడతాయని బీజేపీ ఆశిస్తున్నది. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ నుంచి, బీఆర్‌ఎస్‌ నుంచీ పలుకుబడి గల నాయకులు పెద్దఎత్తున తమ పార్టీలోకి వస్తారనీ, వారి వెంట ఓట్ల బ్యాంకును కూడా తెచ్చుకుంటారనీ ఆ పార్టీ నమ్ముతున్నది. కానీ, ఎంత బలమైన నాయకుడు పార్టీ మారినా ఆయన వెంట ఆ పార్టీ ఓటర్లందరూ నడిచే అవకాశం ఉండదని మునుగోడు ఎన్నిక నిరూపించింది. ఇతర పార్టీల నాయకులు బీజేపీలోకి ఫిరాయించే అవకాశాలు కూడా క్రమంగా సన్నగిల్లుతున్నాయి.

బెంగాల్‌ ఎన్నికలకు ముందు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొమ్ములు తిరిగిన నాయకుల్లో చాలా మందిని బీజేపీ తన కాంపౌండ్‌లోకి తెచ్చుకోగలిగింది. అధికార పార్టీని ఓడించినంత హడావుడి చేసింది. కానీ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘ఖేలా హోబే’ (ఆట ఇంకా వుంది) అని సవాల్‌ చేసి పీఠాన్ని నిలబెట్టుకోగలిగింది. కాకపోతే బీజేపీ ఒక బలమైన శక్తిగా బెంగాల్‌లో నిలదొక్కుకోవడం ఒక వాస్తవం. తెలంగాణలో హిందూ భావజాలం వెనుక, మోదీ ఇమేజ్‌ వెనుక సమీకరించగలిగే గరిష్ఠ స్థాయి మద్దతు ఇరవై ఐదు, ముప్ఫై శాతాన్ని దాటకపోవచ్చు. ఇప్పటికే ఆ పార్టీ ఇందులో చాలావరకు సాధించింది. ఇంకా అదనపు మద్దతు కావాలంటే సుపరిపాలన, అభివృద్ధి కొనసాగింపు, విశ్వసనీయ నాయకత్వం వంటి అంశాలు తోడు కావాలి. హిందూత్వ అంశాన్ని ఇంతకంటే ఎక్కువ లాగితే మొదటికే మోసం వచ్చే అవకాశం కూడా ఉన్నది. మేము అధికారంలోకి వస్తే కొత్త సెక్రటేరియట్‌ గుమ్మటాలను కూల్చివేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రకటనకు ప్రజల్లో నెగెటివ్‌ స్పందనే కనిపించింది. నిర్మాణ కౌశలం మీద మతం ముద్ర వేయడమేమిటని బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం ఇంకా ముదిరితే బిర్యానీకి, పులిహోరకు, వేణు గానానికి, షెహనాయ్‌ రాగానికీ, మృదంగ నాదానికీ, తబలా వాద్యానికీ కూడా మతం రంగు పులమరనే నమ్మకం ఏముంటుందనే ప్రశ్న తలెత్తుతుంది.

బీజేపీకి, బీఆర్‌ఎస్‌కూ ఎవరి వ్యూహం వారికున్నది. ఎవరి నమ్మకం వారికున్నది. కానీ కాంగ్రెస్‌లో మాత్రమే వ్యూహం గానీ, నమ్మకం గానీ కనిపించడం లేదు. కాకపోతే విజేతను నిర్ణయించడంలో కాంగ్రెస్‌ శ్రేణులు కీలకపాత్ర పోషించగల అవకాశాలు మాత్రం కొన్ని కనిపిస్తున్నాయి. అంతర్గత సమాచారం ప్రకారం రాష్ట్ర కాంగ్రెస్‌లో మూడు రకాల ఆలోచనా ధారలతో కూడిన మూడు పాయలున్నాయి. ఎన్నికల అనంతరం ఏ పార్టీకీ సొంతంగా మెజారిటీ రాదు. సెక్యులర్‌ పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ఇది మొదటి పాయ ఆలోచన. అయితే ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వలన బీజేపీ గణనీయంగా సీట్లు గెలిచి ప్రతిపక్షంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎన్నికల ముందే బీఆర్‌ఎస్‌తో పొత్తు కుదిరితే బీజేపీని సింగిల్‌ డిజిట్‌కు పరిమితం చేయవచ్చనేది రెండో రకం ఆలోచనా స్రవంతి. రాష్ట్ర విభజన చట్టాన్ని రూపొందించడంలో కీలకపాత్ర పోషించిన ఒక ఏఐసీసీ నేత మద్దతు కూడా ఈ వర్గానికి ఉందట! కేంద్ర స్థాయిలో బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ కలిసి పోటీ చేయాలని వస్తున్న ప్రతిపాదనలకు అనుగుణమైన ఆలోచనే ఇది. ఇక ఎవరితో పొత్తులేకుండా ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని మూడో వర్గం భావిస్తున్నది. అయితే వీరి వాదన వెనుక దురుద్దేశాలున్నాయని బీఆర్‌ఎస్‌తో పొత్తు అనుకూల వర్గాలు ఆరోపిస్తున్నాయి. తమ వర్గం వారిని ఎక్కువమందిని గెలిపించుకొని హంగ్‌ అసెంబ్లీ ఏర్పడినట్లయితే బీజేపీ వైపు ఫిరాయించాలనేది వీరి ఆలోచనగా చెబుతున్నారు. 

ఈ మూడు పరిణామాల్లో ఏది జరిగినా కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్‌ నేతల ప్రమేయమున్నట్టే లెక్క. పోషించబోయేది కూరలో కరివేపాకు పాత్రయినా, తులాభారంలో తులసి ఆకు పాత్రయినా సరే, కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చిన చందంగా రాజుగారి గది తాళాలను కాంగ్రెస్‌ నేతలే తెరుస్తారు. హిండెన్‌ బర్గ్‌ వ్యవహారం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్‌ వేగంగా పడిపోతున్నదనే వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఆ ప్రభావం తెలంగాణపై కూడా అంతో ఇంతో ఉండ వచ్చు. అప్పుడు కాంగ్రెస్‌ పార్టీ పునరుజ్జీవనానికి అవకాశం కూడా లభిస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోగలిగితే రాష్ట్రంలో రాబోయే ఎన్నికలు బీఆర్‌ఎస్‌ – కాంగ్రెస్‌ మధ్య పోటీగా మారతాయి. మూడు ముక్కలాటనే కొనసాగిస్తే రెండో స్థానం కోసం పోరాడవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement
Advertisement