చేనుకు చేవ.. రైతుకు చేరువ | Sakshi
Sakshi News home page

చేనుకు చేవ.. రైతుకు చేరువ

Published Tue, Mar 21 2023 2:12 AM

- - Sakshi

అన్నదాతకు ప్రభుత్వం కొత్త కానుక

జిల్లాలో కేవీకే ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌

ఏరువాక కేంద్రానికీ ఓకే

అందుబాటులోకి రానున్న శాస్త్రవేత్తలు,

సాంకేతిక పరిజ్ఞానం

సాక్షి, అమలాపురం: పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన కోనసీమ జిల్లా రైతులకు మేలు చేసేలా ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. మరోపక్క ఏరువాక కేంద్రం (డాట్‌) సెంటర్‌ ఏర్పాటుకు సైతం పచ్చజెండా ఊపింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రాజానగరం, ఏజెన్సీలోని రంపచోడవరం మండలం పందిరి మామిడిలో కేవీకేలు ఉన్నాయి. రాజానగరం కేవీకేలో వ్యవసాయ పంటల మీద రైతులకు అవగాహన కల్పించడంతో పాటు, నూతన సాంకేతిక పద్ధతులపై శిక్షణ ఇస్తారు. ప్రస్తుతం ప్రకృతి వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. పందిరి మామిడిలో తాటిపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ రెండు కేంద్రాలూ కోనసీమకు దూరంగా ఉండటంతో రైతులకు దూరాభారమవుతోంది. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోనే కేవీకే, డాట్‌ సెంటర్ల ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఇక్కడి రైతులకు సరికొత్త కానుక అందిస్తోంది.

కేవీకేతో మెరుగైన సలహాలు

జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు ఆక్వా సాగు పెద్ద ఎత్తున జరుగుతోంది. జిల్లాలోని గోదావరి డెల్టా పరిధిలో సుమారు 2.30 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనిలో 90 శాతం వరి సాగవుతుంది. మెరక ప్రాంతాల్లో వరితో పాటు, మొక్కజొన్న, చెరకు సాగు కూడా సాగవుతున్నాయి. రబీ, మూడో పంటగా అపరాలు, నువ్వులు, గోదావరి లంకల్లో సైతం మొక్కజొన్న, నువ్వులు, పుచ్చ, దోస, ఇతర కూరగాయల పంటలు పెద్ద ఎత్తున సాగువుతున్నాయి. వీటికి అవసరమైన సలహాలు, సూచనలను ప్రస్తుతం వ్యవసాయ అధికారులు, సచివాలయాల్లోని విలేజ్‌ అగ్రికల్చర్‌ ఆఫీసర్లు (వీఏఓ) అందిస్తున్నారు.

కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేస్తే ఇందులోని వివిధ విభాగాలకు చెందిన ఏడుగురు శాస్త్రవేత్తలు పని చేస్తారు. వీరు వరితో పాటు ఇతర వ్యవసాయ పంటలకు కూడా సూచనలు, సలహాలు అందిస్తారు. సాగు క్షేత్రాల ద్వారా రైతులకు పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, అవసరమైన వరి విత్తనాలను ఇక్కడ పండించడంతో పాటు ప్రకృతి వ్యవసాయం వంటి వాటిపై శిక్షణ ఇస్తారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు. కేవీకే ఏర్పాటుకు సుమారు 50 ఎకరాలు అవసరమని జిల్లా యంత్రాంగం గుర్తించింది. దీనిని ఐ.పోలవరం మండలంలో సేకరించాలని నిర్ణయానికి వచ్చింది.

వరికి ఊతం

గోదావరి డెల్టాలో.. ముఖ్యంగా జిల్లాలో వరి సాగు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటోంది. ఖరీఫ్‌లో ముంపు, రబీలో ఎద్దడి, మారిన వాతావరణం వల్ల దిగుబడి తగ్గుతోంది. మొత్తం మీద వరి సాగు గిట్టుబాటు కావడం లేదు. ఈ నేపథ్యంలో కేవీకే వస్తే ఇది గిట్టుబాటు అయ్యేందుకు శాస్త్రవేత్తల సలహాలు, అధిక దిగుబడి రకాలు అందుబాటులోకి వస్తాయని రైతులు అంటున్నారు. డెల్టాలో అపరాల సాగు 5 శాతం కూడా జరగడం లేదు. ఈ సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. లంక రైతులు సైతం మొక్కజొన్న, ఇతర పంటలకు మేలు జరుగుతుందని ఆశిస్తున్నారు.

జిల్లాలో ఇప్పటి వరకూ కేవీకే ద్వారా రైతులకు అందిన సేవలు చాలా తక్కువ. వరి, ఇతర వ్యవసాయ పంటలతో పోల్చుకుంటే ఉద్యాన పంటలకు అంబాజీపేటలోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఉద్యాన పరిశోధన స్థానం ద్వారా సేవలందుతున్నాయి. కొబ్బరి, కోకోతో పాటు పలు రకాల ఉద్యాన పంటలకు ఇక్కడి నుంచి బదనికలు, జీవన ఎరువులు, సాగు సలహాలు అందుతున్నాయి. అంతర పంటలకు ప్రోత్సాహం ఉంది. అధికంగా సాగు జరిగే వరికి వ్యవసాయ శాఖ మినహా శాస్త్రవేత్తల పరిశోధనలు అందడం లేదు. కేవీకే వస్తే వ్యవసాయ పంటలకు ఆ లోటు తీరుతుంది.

ఎయిమ్స్‌లో ఏరువాక కేంద్రం

జిల్లాకు మంజూరైన ఏరువాక కేంద్రాన్ని (డాట్‌ సెంటర్‌) ముమ్మిడివరం ఎయిమ్స్‌ కళాశాలలో నెలకొల్పుతున్నారు. ఇక్కడే జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం కూడా ఉంది. ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయానికి చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఏరువాక కేంద్రం నుంచి సేవలందిస్తారు.

Advertisement
Advertisement