హైదరాబాద్: సామాజిక మాధ్యమాలలో నకిలీ ఖాతాలతో హనీ ట్రాప్, సైబర్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన ఓ వ్యక్తిని సోమవారం సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. పురానీహవేలిలో సోమవారం చార్మినార్ జోన్ డీసీపీ ఖారే కిరణ్ ప్రభాకర్ వివరాలను వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముత్యాలంపాడుకు చెందిన కొండబత్తుల పవన్ కుమార్ (23) కూకట్‌పల్లి బాలాజీనగర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు.
ఇతను అమ్మాయిల పేర్లతో నకిలీ ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలను సృష్టించాడు. ఈ ఖాతాలతో ఫ్రెండ్స్‌కు, ఇతర వ్యక్తులకు రిక్వెస్ట్‌లు పంపి అమ్మాయిలాగా చాటింగ్ ప్రారంభించి క్రమంగా లైంగిక సంభాషణల వైపు మళ్లిస్తాడు. అనంతరం నగ్న చిత్రాలను పంపించి బాధితుల నుంచి కూడా నగ్న ఫోటోలను సేకరించి తన పెన్‌డ్రైవ్‌లో, ఇతర సోషల్ మాధ్యమాల్లో సేవ్ చేస్తున్నాడు. అమ్మాయిలా నటిస్తూ తన అన్న పవన్ సంప్రదిస్తాడని పేర్కొంటాడు. ఆ తరువాత ఇతను రంగంలోకి దిగి కాల్స్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా బాధితులను సంప్రదిస్తాడు. కొందరిని వ్యక్తిగతంగా కూడా కలుస్తుంటాడు. బాధితుల నగ్నఫోటోలు, వీడియోలను చూపిస్తూ తన చెల్లితో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయిస్తానని బెదిరింపులకు పాల్పడుతూ భారీగా డబ్బులను వసూలు చేశాడు.
ఈ విధంగా పలువురి వద్ద డబ్బులను వసూలు చేయడమే కాకుండా పలు ప్రాంతాల్లో పని చేసే సమయంలో ముందస్తుగా జీతాలు తీసుకున్నాడు. మరో ఇద్దరు అపరిచిత వ్యక్తుల నుంచి రూ.6.8 లక్షలు, రూ.7 లక్షలు వసూలు చేశాడు. స్నేహితుడిని కూడా హనీట్రాప్ చేసి రూ.4 లక్షలను వసూలు చేశాడు. ఈ హనీట్రాప్, బ్లాక్‌మెయిలింగ్‌లో డాక్టర్లు, వ్యాపారవేత్తలు, లెక్చరర్లు, ప్రైవేటు ఉద్యోగులు, డెలివరీ బాయ్స్, గిగ్ డ్రైవర్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని సోమవారం పవన్ కుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, 16జీబీ పెన్‌డ్రైవ్‌ను స్వా«దీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.


