ఇలాంటి ఇల్లు కొంటే తలనొప్పే.. | Water Leaks Considerations When Buying Home | Sakshi
Sakshi News home page

ఇంటి కొనుగోలు సమయంలోనే గమనించాలి..

Apr 21 2025 4:11 PM | Updated on Apr 21 2025 4:19 PM

Water Leaks Considerations When Buying Home

భవన నిర్మాణం సమయంలో తడిగా ఉండే ప్రదేశాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆయా ప్రాంతాల వద్ద అత్యంత నాణ్యత ఉండేలా చూసుకుంటే.. మన కలల సౌధం పది కాలాల పాటు దృఢంగా ఉంటుంది. మరుగుదొడ్లు, స్నానాల గదులు, కిచెన్‌ సింక్, వాషింగ్‌ మిషన్‌ ఉండే చోట నిర్మాణం సమయంలోనే నాణ్యత పాటించేలా చూసుకోవడం కూడా అవసరం. - సాక్షి, సిటీబ్యూరో

ముఖ్యంగా మరుగుదొడ్లు, స్నానాల గదుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు తలనొప్పిగా మారుతుంటాయి. ఇంటి కొనుగోలు సమయంలోనే ఈ విషయాలు గమనించాలి. పైకి ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఎంత క్వాలిటీ వస్తువులు వాడారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అనే విషయాలు తెలుసుకోవాలి.

వెంటనే అప్రమత్తం.. 
వాటర్‌ ప్రూఫింగ్‌ సక్రమంగా లేకుంటే టైల్స్‌పై నిలిచిన నీటి నుంచి సన్నగా లీకేజీ ప్రారంభమవుతుంది. ఇందుకు వ్యక్తిగత గృహాలు, విల్లాలు ఏవీ మినహాయింపు కాదు. లీకేజీకి ఎక్కడైనా అవకాశం ఉంటుంది. నిర్మాణం పూర్తయిన సంవత్సరం.. ఆ తర్వాత ఈ సమస్య బయట పడుతుంది. గోడలకు చెమ్మ రావడం, వాసన వస్తుండటం వంటి సంకేతాలు కనిపిస్తుంటాయి. వెంటనే అప్రమత్తం కాకపోతే సమస్య క్రమంగా భవనమంతా వ్యాపిస్తుంది.

అదే అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీ బహుళ అంతస్తుల భవనాల్లో మన ఫ్లాట్‌ కింద ఉన్న వారికి సమస్యలు మొదలవుతాయి. గోడలకు చెమ్మ రావడం, రంగు మారిపోవడం, పెచ్చులుగా రంగు ఊడిపోతుండడం, దుర్వాసన వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. సమస్య తమ ఫ్లాట్‌లోనే ఉందని తొలుత అంతా భావిస్తారు. భవన నిర్మాణదారుడు సరైన వాటర్‌ ప్రూఫింగ్‌ విధానం పాటించకపోవడంతో పైఫ్లాట్‌ నుంచి లీకేజీ అవుతున్నట్లు ఆలస్యంగా గ్రహిస్తారు. వీటిని ప్లంబర్లు, నిర్మాణ మేస్త్రీలు మాత్రమే కచ్చితంగా గుర్తిస్తారు.

అక్కడి నుంచే మొదలు.. 
సాధారణంగా అత్యధిక లీకేజీలు టాయిలెట్‌ రూమ్‌ నుంచే మొదలవుతాయి. ఆ ప్రదేశాలలో నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు టైల్స్‌ ఎగుడుదిగుడుగా లేకుండా చూసుకోవాలి. దీనికంటే ముందు నిర్మాణ దశలోనే కాంక్రీట్‌ లేదంటే బ్రిక్స్‌తో రసాయనాలు వినియోగించి వాటర్‌ ప్రూఫ్‌ బెడ్‌ ఏర్పాటు చేయాలి. ఇక నీటి పైప్‌లైన్ల కారణంగానూ లీకేజీలు ఏర్పడతాయి. వంట గదిలో సింక్‌ దగ్గర, వాషింగ్‌ మిషన్‌ ప్రదేశాలలో పైపుల దగ్గర జాగ్రత్తగా వ్యవహరించాలి.

Advertisement
 
Advertisement
Advertisement