IPO: మరో 12 కంపెనీలు రెడీ! | Upcoming Ipos in India 2026 | Sakshi
Sakshi News home page

IPO: మరో 12 కంపెనీలు రెడీ!

Oct 13 2026 9:30 PM | Updated on Oct 13 2026 9:30 PM

Upcoming Ipos in India 2026

ఇప్పటికే పలు ఇష్యూలతో కదం తొక్కుతున్న ప్రైమరీ మార్కెట్లు ఈ నెలలో మరింత కళకళలాడనున్నాయి. రిలయన్స్‌ గ్రూప్‌ డిజిటల్, టెలికం సేవల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్‌సహా జెట్‌వెర్క్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ బిజినెస్, అవాడా ఎలక్ట్రో తదితర డజను కంపెనీలు ఐపీవోలను చేపట్టనున్నాయి. తద్వారా ఈ కేలండర్‌ ఏడాది(2026)లో ఇప్పటికే లిస్టింగ్‌ బాట పట్టిన 96 కంపెనీల జాబితాకు జత కలవనున్నాయి. వీటిలో 35 కంపెనీలు గత నెల(సెప్టెంబర్)లోనే లిస్ట్‌కావడం గమనార్హం!

జాబితాలో తాజాగా చేరనున్న ఇతర కంపెనీలలో ఫ్యూజన్‌ సీఎక్స్, హెచ్‌డీ ఫైర్‌ ప్రొటెక్ట్, టాన్బో ఇమేజింగ్, బాన్‌ఫిగ్లియోలి ట్రాన్స్‌మిషన్స్, సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్, పారస్‌ హెల్త్‌కేర్, ఎన్‌డీఆర్‌ ఇన్విట్ ట్రస్ట్, గుజరాత్‌ విక్టరీ ఫోర్జింగ్స్, ఎస్‌ఎఫ్‌సీ ఎన్విరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌ ఉన్నాయి.

వెరసి నిధుల సమీకరణకు సిద్ధపడుతున్న కంపెనీలలో టెక్నాలజీ, హెల్త్‌కేర్, రెనెవబుల్‌ ఎనర్జీ, డిఫెన్స్, ప్రెసిషన్‌ మ్యాన్యుఫాక్చరింగ్‌ తదితర రంగాలు చేరాయి. అటు తాజా ఈక్విటీ జారీ, ఇటు ప్రస్తుత వాటాదారుల షేర్ల ఆఫర్‌ ద్వారా ఆయా కంపెనీలు నిధుల సమీకరణకు ప్రణాళికలు వేశాయి. నిధులను వ్యాపార విస్తరణ, పెట్టుబడి వ్యయాలు, రుణ చెల్లింపులు, వర్కింగ్‌ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్‌ అవసరాలు తదితరాలకు వెచ్చించనున్నాయి. 2026 జనవరి నుంచి 96 ఐపీవోల ద్వారా కంపెనీలు రూ. 1.1 లక్షల కోట్లకుపైగా సమీకరించడం విశేషం!

ఈ నెల 21కల్లా జియో సై
డిజిటల్, టెలికం సర్వీసుల దిగ్గజం జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీవో ఈనెల 21న ప్రారంభంకానుంది. 23న ముగియనున్న ఇష్యూ దేశీయంగా అతిపెద్ద ఐపీవోగా నిలిచే వీలుంది. తద్వారా సుమారు రూ. 35,000 కోట్లు సమీకరించవచ్చని అంచనా.

రూ. 258–271
అగ్నిమాపక పరికరాలు, వ్యవస్థలను తయారు చేసే హెచ్‌డీ ఫైర్‌ ప్రొటెక్ట్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 258–271 ధరల శ్రేణి ప్రకటించింది. నేడు(13న) ప్రారభంకానున్న ఇష్యూ 15న ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ. 712 కోట్లు అందుకోవాలని భావిస్తోంది.

రూ. 275–289
ఏఐ ఆధారిత ఎక్స్‌పీరియన్స్‌ సొల్యూషన్లు సమకూర్చే ఫ్యూజన్‌ సీఎక్స్‌ ఐపీవోకు రూ. 275–289 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ రేపు(14న) ప్రారంభమై 16న ముగియనుంది. ఇష్యూ ద్వారా రూ. 702 కోట్లు సమకూర్చుకోవాలని ఆశిస్తోంది.

రూ. 143–151
ఈ నెల 15న ప్రారంభమై 19న ముగియనున్న ఐపీవోకు టెక్నాలజీ ఆధారిత మ్యాన్యుఫాక్చరింగ్‌ ప్లాట్‌ఫామ్‌ జెట్‌వెర్క్‌.. రూ. 143–151 ధరల శ్రేణి ప్రకటించింది. తద్వారా రూ. 5,012 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. ఇందుకు అనుగుణంగా రూ. 2,830 కోట్ల విలువైన ఈక్విటీని కొత్తగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 14.45 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు.

రూ. 665–700
థర్మల్‌ ఇమేజింగ్, సంబంధిత డిఫెన్స్‌ టెక్నాలజీ సిస్టమ్స్‌ రూపొందించే టాన్బో ఇమేజింగ్‌ ఐపీవోకు రూ. 665–700 ధరల శ్రేణి నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 15న ప్రారంభమై 19న ముగియనుంది. దీనిలో భాగంగా 1.22 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. తద్వారా రూ. 852 కోట్లు సమీకరించాలని చూస్తోంది.

రూ. 558–586
ఇటాలియన్‌ బాన్‌ఫిగ్లియోలీ గ్రూప్‌ దేశీ అనుబంధ సంస్థ బాన్‌ఫిగ్లియోలీ ట్రాన్స్‌మిషన్స్‌ ఐపీవో ఈ నెల 15న ప్రారంభమై 19న ముగియనుంది. ఇందుకు షేరుకి రూ. 558–586 చొప్పున ధరల శ్రేణి నిర్ణయించింది. దీనిలో భాగంగా 4.32 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్‌ సంస్థ బాన్‌ఫిగ్లియోలీ ఎస్‌పీఏ విక్రయానికి ఉంచనుంది. తద్వారా రూ. 2,534 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. కంపెనీ మెకానికల్, ఎలక్ట్రో–మెకానికల్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్, ఇండ్రస్టియల్‌ డ్రైవ్‌ సొల్యూషన్లు సమకూర్చుతోంది.

రూ. 327–344
ఈ నెల 15న ప్రారంభంకానున్న సహజానంద్‌ మెడికల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోకు రూ. 327–344 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ 19న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.38 కోట్ల షేర్లనుప్రస్తుత వాటాదారులు విక్రయించనున్నారు. తద్వారా రూ. 475 కోట్లు సమీకరించనుంది.

ఇతర ఐపీవోలు ఇలా
ఐపీవో ద్వారా అవాడా ఎలక్ట్రో రూ. 7,600 కోట్లు, పారస్‌ హెల్త్‌కేర్‌ రూ. 1,800 కోట్లు, ఎన్‌డీఆర్‌ ఇన్విట్‌ ట్రస్ట్‌ రూ. 750 కోట్లు చొప్పున సమీకరించే ప్రణాళికల్లో ఉన్నాయి. ఇక గుజరాత్‌ విక్టరీ ఫోర్జింగ్స్‌ ఐపీవోలో భాగంగా 1.97 కోట్ల ఈక్విటీ షేర్లు ఆఫర్‌ చేయనుంది. వీటిని కొత్తగా జారీ చేయడంతోపాటు.. ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. వేస్ట్‌వాటర్‌ ట్రీట్‌మెంట్‌ సేవలు అందించే ఎస్‌ఎఫ్‌సీ ఎని్వరాన్‌మెంటల్‌ టెక్నాలజీస్‌ ఐపీవోలో భాగంగా రూ. 150 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 1.23 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement