జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ...యాంకర్‌ ఇన్వెస్టర్ల క్యూ | Jio Platforms anchor book draws record Rs2. 5 lakh crore in bids ahead of IPO | Sakshi
Sakshi News home page

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ...యాంకర్‌ ఇన్వెస్టర్ల క్యూ

Oct 20 2026 4:57 AM | Updated on Oct 20 2026 5:51 AM

Jio Platforms anchor book draws record Rs2. 5 lakh crore in bids ahead of IPO

30 రెట్ల అధిక స్పందన... 

రూ. 2.5 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు

జాబితాలో బ్లాక్‌రాక్, క్యాపిటల్‌ గ్రూప్, ఫిడెలిటీ, జేపీ మోర్గాన్, ఫ్రాంక్లిన్‌ 

టెంపుల్‌టన్‌ తదితర దిగ్గజాలు 

21 నుంచి 23 వరకు పబ్లిక్‌ ఆఫర్‌

ధరల శ్రేణి రూ. 1,065–1,119

న్యూఢిల్లీ: జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ ప్రారంభానికి ముందే ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల నుంచి బంపర్‌ స్పందన దక్కించుకుంది. సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల కోసం రూ.8,110 కోట్ల విలువైన షేర్లను బిడ్డింగ్‌కు ఉంచగా.. అనూహ్య డిమాండ్‌తో 30 రెట్లకు పైగా అధిక స్పందన లభించింది. సంస్థాగత ఇన్వెస్టర్లు ముఖ్యంగా గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ దిగ్గజాలు, సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్‌. దేశీ మ్యూచువల్‌ ఫండ్స్, ఇన్సూరెన్స్‌ సంస్థలు, పెన్షన్‌ పండ్స్‌ పోటాపోటీగా బిడ్స్‌ దాఖలు చేశాయి. దీంతో యాంకర్‌ బుక్‌లో ఏకంగా రూ.2.5 లక్షల కోట్ల విలువైన బిడ్‌లు నమోదయ్యాయి.

 జియో వృద్ధి పథంలో భాగమవ్వాలన్న లక్ష్యంతో దిగ్గజ సంస్థాగత ఇన్వెస్టర్లందరూ బిడ్స్‌ వేయడం వల్లే యాంకర్‌ బిడ్డింగ్‌లో ఇంత భారీ స్పందన వచ్చిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా, బడా విదేశీ ఇన్వెస్టర్లు, దేశీ దిగ్గజాలు 750 మిలియన్‌ డాలర్ల నుంచి 1 బిలియన్‌ డాలర్లకుపైగానే విలువైన బిడ్స్‌ సమర్పించాయని సమాచారం. దాదాపు టయర్‌–1 ఫండ్స్‌కు రూ.400–450 కోట్ల విలువైన షేర్లు లభించవచ్చని.. మిగతా ఇన్వెస్టర్లకు రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల మధ్య షేర్ల కేటాయింపు ఉండొచ్చని ఆయా వర్గాలు వెల్లడించాయి. 

వరుస కట్టిన దేశ విదేశీ దిగ్గజాలు... 
రూ. 8,110 కోట్ల విలువైన యాంకర్‌ బుక్‌లో బిడ్డింగ్‌ వేసిన విదేశీ గ్లోబల్‌ అసెట్‌ మేనేజర్లలో బ్లాక్‌రాక్, క్యాపిటల్‌ గ్రూప్, ఫిడెలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, టి. రోవె ప్రైస్, ష్రోడర్స్, జేపీమోర్గాన్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్, ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్, ఇన్వెస్కో, జానస్‌ హెండర్‌సన్‌ ఉన్నాయి. ఇక సావరీన్‌ వెల్త్‌ ఫండ్స్, పబ్లిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థల్లో సింగపూర్‌కు చెందిన జీఐసీ, అబుధాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, ఖతార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ, నార్వేకు చెందిన నార్జెస్‌ బ్యాంక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ క్యూ కట్టాయి. దేశీ దిగ్గజ సంస్థల్లో ప్రధానంగా ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఎంఎఫ్, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్, ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ ఎంఎఫ్, నిప్పన్‌ ఇండియా ఎంఎఫ్, కోటక్‌ మహీంద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ పాలుపంచుకున్నాయి.  అదేవిధంగా ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ పెన్షన్‌ ఫండ్స్, హెచ్‌డీఎఫ్‌సీ పెన్షన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ బిడ్స్‌ వేశాయి.

రూ.30,213 కోట్లతో రికార్డు... 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికం, డిజిటల్‌ సరీ్వసుల విభాగం అయిన జియో ప్లాట్‌ఫామ్స్‌ రూ.30,213 కోట్ల మెగా ఐపీఓ.. పబ్లిక్‌ సబ్‌్రస్కిప్షన్‌ ఈ నెల 21న ప్రారంభమై, 23న ముగుస్తుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.1,065–1,119. రూ. 10 ముఖ విలువగల 27 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ ఆఫర్‌ చేస్తోంది. దీంతో ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓగా నిలుస్తున్న హ్యుందాయ్‌ మోటార్స్‌ను (రూ.27,879 కోట్లు) అధిగమించి దేశీ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో కొత్త చరిత్ర లిఖించనుంది. లిస్టింగ్‌లో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.10.5 లక్షల కోట్లను అధిగమించవచ్చనేది మార్కెట్‌ వర్గాల అంచనా. కాగా, అర్హులైన ఉద్యోగులకు ఒక్కో షేరుకు రూ. 54 డిస్కౌంట్‌ అందిస్తోంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు దరఖాస్తు చేసుకోవడానికి కనీస లాట్‌ 12 షేర్లు. ఇష్యూ పరిమాణంలో రిలయన్స్‌ వాటాదారులకు రూ. 2,500 కోట్లు, జియో ఉద్యోగులకు రూ. 500 కోట్ల విలువైన షేర్లను రిజర్వ్‌ చేసింది. కాగా, ఈ నెల 28న బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో జియో లిస్టింగ్‌ జరుగుతుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement