సాక్షి, హైదరాబాద్ : ప్రపంచంలోని టాప్ 10 సెమీకండక్టర్ సంస్థలలో ఏడింటికి ఇప్పటికే ఆతిథ్యం ఇస్తూ, చిప్ డిజైన్ నియామకాలలో బెంగళూరును అధిగమిస్తున్న హైదరాబాద్, భారత దేశ ప్రధాన సెమీకండక్టర్ డిజైన్ కేంద్రంగా ఆవిర్భవించే దిశగా పయనిస్తోంది. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి, ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్) తన వధ్వానీ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (డబ్లు్యఐఎన్–సిఓఇ) ద్వారా, తాజాగా గుజరాత్‌లోని కేన్స్ సెమికాన్ తో రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ సందర్భంగా "సాక్షి"తో వధ్వానీ ఇన్నోవేషన్ నెట్‌వర్క్ (డబ్ల్యూయఐఎన్) మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ శిర్షెందు ముఖర్జీ మాట్లాడుతూ, ఈ ఒప్పందంలో ఉమ్మడి పరిశోధన,అభివృద్ధి అధ్యాపకులు, పరిశోధకుల మార్పిడి, కేన్స్ కేంద్రాలలో విద్యార్థుల ఇంటర్న్‌షిప్‌లు, పాఠ్య ప్రణాళిక అభివృద్ధి వంటి అంశాలు ఉన్నాయని, మంచి పరిశోధన దానంతట అదే మంచి ఉత్పత్తిగా మారదు. కాబట్టి, ఈ ప్రయాణంలో మొదటి నుంచే ప్రణాళికాబద్ధంగా పరివర్తన ప్రక్రియను అందులో భాగం చేయాలి’’ అని అన్నారు.
డిజైన్, యంత్రాలు, మెటీరియల్స్, ప్యాకేజింగ్, పరిశోధన అభివృద్ధి (ఆర్ అండ్ డి), నైపుణ్యాభివృద్ధి వంటి విభిన్న రంగాలను విస్తరించే ప్రభుత్వ సెమికాన్ 2.0 కార్యక్రమాన్ని స్వాగతిస్తూన్నామని, ఈ వ్యవస్థకు తోడ్పడగల పరిశోధన, సాంకేతికతలు, మేధో సంపత్తి, నైపుణ్యం కలిగిన మానవ వనరుల నిరంతర సరఫరా కూడా అవసరం’’ అని అన్నారాయన.
ఈ సందర్భంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బి.ఎస్. మూర్తి మాట్లాడుతూ, విద్యాసంస్థల్లో జరిగే పరిశోధనకు, పరిశ్రమకు మధ్య ఏర్పడిన ఈ భాగస్వామ్యం అధునాతన మెటీరియల్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, సిలికాన్ సాంకేతికతల రంగాల్లోని పరిశోధనలను ఆచరణాత్మక అనువర్తనాలుగా మార్చేందుకు దోహదపడుతుందన్నారు. సెమీకండక్టర్లకు సంబంధించిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు తోడ్పడటంలో సంస్థ పరిశోధన, ఆవిష్కరణల వ్యవస్థ పోషించే పాత్రను కూడా ఆయన వివరించారు.

శిర్షెందు ముఖర్జీ


