బ్లడ్‌ క్యాన్సర్‌కు ‘కార్‌-టీ’ చికిత్స అందించేలా ఒప్పందం | Cancer Care How NuCilion VeGen Dual Target CAR-T Therapy Myeloma Treatment | Sakshi
Sakshi News home page

బ్లడ్‌ క్యాన్సర్‌కు ‘కార్‌-టీ’ చికిత్స అందించేలా ఒప్పందం

Oct 21 2026 8:53 PM | Updated on Oct 21 2026 9:01 PM

Cancer Care How NuCilion VeGen Dual Target CAR-T Therapy Myeloma Treatment

న్యూసిలియన్‌, వీజెన్‌ బయో భాగస్వామ్యం

బ్లడ్‌ క్యాన్సర్‌లో అత్యంత సంక్లిష్టమైన ‘మల్టిపుల్ మైలోమా’ నివారణకు భారత్‌లో సరికొత్త వైద్య చికిత్సకు పునాది పడింది. డ్యూయల్-టార్గెటింగ్ (రెండు లక్ష్యాలపై పనిచేసే) అత్యంత అధునాతన కార్‌–టీ (CAR-T) కణ చికిత్సను భారతీయ రోగులకు అందుబాటులోకి తెచ్చేందుకు న్యూసిలియన్‌ థెరప్యూటిక్స్‌, వీజెన్‌ బయో సంస్థలు భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.

వీజెన్‌ బయో అభివృద్ధి చేసిన ‘వీఎల్‌–2511’ చికిత్సకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, క్లినికల్ పరీక్షలు, వాణిజ్య స్థాయి ఉత్పత్తి బాధ్యతలను భారత్ బయోటెక్ అనుబంధ సంస్థ న్యూసిలియన్ పర్యవేక్షించనుంది. 2028 నాటికి ఈ చికిత్సను మార్కెట్లోకి తేవడమే లక్ష్యంగా ఫేజ్‌-1/2 క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించనున్నారు.

క్యాన్సర్ కణాలకు చెక్

సాధారణ చికిత్సల్లో క్యాన్సర్ కణాలు రూపాంతరం చెంది తప్పించుకునే ప్రమాదముంది. అయితే, వీఎల్‌–2511 విధానంలో రోగి సొంత టీ-కణాలను జన్యు మార్పిడి చేసి బీసీఎంఏ, సీడీ19 అనే రెండు యాంటిజెన్లను ఏకకాలంలో దాడి చేసేలా రూపొందించారు. చైనా, అమెరికా క్లినికల్ అధ్యయనాల్లో ముఖ్యంగా ఎముక మజ్జ వెలుపలకు వ్యాపించిన మైలోమా రోగుల్లో ఈ చికిత్స ఆశాజనక ఫలితాలను ఇచ్చింది.

తయారీ వ్యయం తగ్గించేలా..

అత్యంత ఖరీదైన ఈ కణ చికిత్సను సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చేందుకు ప్రాసెస్ డెవలప్‌మెంట్, సెల్ ప్రాసెసింగ్, వైరల్ వెక్టర్ ఇంజినీరింగ్‌ను స్థానికంగా మెరుగుపరచనున్నారు. అమెరికా ఎఫ్‌డీఏ, ఐరోపా ఈఎంఏ, సీడీఎస్‌సీఓ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న న్యూసిలియన్ అధునాతన మౌలిక సదుపాయాలు ఈ బయో-మాన్యుఫాక్చరింగ్ దిగుబడిని పెంచి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని భావిస్తున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా పరిశోధన నుంచి వాణిజ్య ఉత్పత్తి వరకు ఉన్న అంతరం తగ్గి భవిష్యత్తులో పోయెమ్స్ సిండ్రోమ్, లూపస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులకు కూడా తక్కువ ఖర్చుతో అధునాతన జీన్ థెరపీలు అందుబాటులోకి రానున్నాయి.

ఇదీ చదవండి: కోమాలో ఉంటే బ్యాంకు డబ్బు తీయలేరా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement