ప్రపంచ వ్యాప్తంగా ఏఐ వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. ఒకప్పుడు మనుషులకు మనుషులే సహాయకులుగా ఉండేవాళ్లు. ఇప్పుడు వారి స్థానంలోకి ఏఐ ఏజెంట్లు వచ్చేశాయి. కావాల్సిన పనులు చక్కబెడుతున్నాయి. ఉచిత సలహాలూ ఇచ్చేస్తున్నాయి. ఖర్చులు ఆదా చేస్తున్నాయి.
అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీ సిస్కో అధ్యక్షుడు జీతూ పటేల్ వ్యక్తిగత ఏఐ ఏజెంట్ల వినియోగంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టెక్ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. తన వ్యక్తిగత ఈమెయిళ్లను పరిశీలించేందుకు ఏఐ ఏజెంట్‌కు అనుమతించిన ఆయనకు, ఏడాదికి సుమారు 9,000 డాలర్లు (సుమారు రూ .8.54 లక్షలు) వివిధ సబ్‌స్క్రిప్షన్ల కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. అవసరం లేని సర్వీసులను గుర్తించి, డూప్లికేట్ సబ్‌స్క్రిప్షన్లను తొలగించడం ద్వారా ఏడాదికి 1,000 – 1,200 డాలర్లు (సుమారు రూ .95,000-రూ .1.14 లక్షలు) వరకు ఆదా చేయగలిగినట్లు ఆయన వెల్లడించారు. ఈ వివరాలను బిజినెస్ ఇన్‌సైడర్ ప్రచురించింది.
పటేల్ తెలిపిన వివరాల ప్రకారం.. తన ఈమెయిల్ ఖాతాను పరిశీలించిన ఏఐ ఏజెంట్ ముందుగా అన్ని సబ్‌స్క్రిప్షన్లకు సంబంధించిన ఖర్చులను గుర్తించింది. అనంతరం వాటి వివరాలు, చెల్లింపుల కాలవ్యవధితో కూడిన పట్టికను సిద్ధం చేసింది. దీంతో తనకు ఇక అవసరం లేని రెండు సర్వీసులను గుర్తించడంతోపాటు, ఇప్పటికే 2 టెరాబైట్ల డ్రాప్‌బాక్స్ ప్లాన్ ఉన్నప్పటికీ పొరపాటున మరో 11.95 డాలర్ల ప్లాన్‌కు కూడా చెల్లిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆయన ఆదేశాలతో ఏజెంట్ అనవసరమైన సబ్‌స్క్రిప్షన్లను రద్దు చేసి, వాటికి సంబంధించిన నిర్ధారణ ఈమెయిళ్లను కూడా పంపింది.
ఈ ప్రక్రియ ఎంత సులభంగా పూర్తయిందో చూసి ఆశ్చర్యపోయానని పటేల్ పేర్కొన్నారు. నెలకు 20 డాలర్లు (సుమారు రూ.1,900) ఖర్చయ్యే ఏఐ సర్వీస్ ద్వారా ఏడాదికి రూ.95 వేలకుపైగా ఆదా చేయగలిగానని వివరించారు. అంటే, ఆ సర్వీస్‌కు ఏడాది పాటు చెల్లించే సుమారు రూ.22,800తో పోలిస్తే పొదుపు చాలా ఎక్కువ. తాను ఒకే ఏఐ సాధనంపై ఆధారపడకుండా నాలుగు నుంచి ఐదు వ్యక్తిగత ఏఐ ఏజెంట్లను వేర్వేరు పనుల కోసం ఉపయోగిస్తున్నట్లు పటేల్ తెలిపారు.


