మేం ఓటు వేసేది లేదు... | Sakshi
Sakshi News home page

మేం ఓటు వేసేది లేదు...

Published Tue, May 14 2024 10:55 AM

మేం ఓ

● పలుచోట్ల బహిష్కరించిన ప్రజలు ● సమస్యల పరిష్కారంపై హామీ ఇవ్వాలని డిమాండ్‌ ● ప్రజాప్రతినిధులు, అధికారులు నచ్చచెప్పడంతో ఓటింగ్‌కు హాజరు

కొత్తగూడెంరూరల్‌: గ్రామంలోని సమస్యలు పరిష్కరించేంతవరకు ఓటు వేయబోమని భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామంలోని గొల్లగూడెం వాసులు నిరసన తెలిపారు. సోమవారం ఉదయం గంట పాటు బైఠాయించిన వారు రహదారులు, డ్రెయినేజీలు, తాగునీరు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఏఎస్పీ విక్రాంత్‌సింగ్‌, డీఎస్పీ రెహమాన్‌, ఎస్‌ఐ రమణారెడ్డి గొల్లగూడెం చేరుకున్నారు. సమస్యలన్నీ త్వరలో పరిష్కరిస్తామని చెప్పగా.. వారు ఓటింగ్‌కు బయలుదేరారు. కాగా, గ్రామస్తుల సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లి ఓటు వేసేలా కృషి చేసిన ఏఎస్పీ, డీఎస్పీ, ఎస్సైని ఎస్పీ రోహిత్‌రాజ్‌ అభినందించారు.

గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో..

గుండాల: గుండాల మండలం పెద్దతోగు గ్రామంలో 81 మంది ఓటర్లు ఉండగా స్థానిక పోలింగ్‌ కేంద్రంలో 21 మంది, గుండాల పోలింగ్‌ కేంద్రంలో 60 మందికి కేటాయించారు. దీంతో ఓటర్లు 16 కి.మీ దూరం వెళ్లాల్సి వస్తోంది. తమకు ముత్తాపురం నుంచి ఆరు కి.మీ. మేర రోడ్డు సౌకర్యం లేదని, గ్రామంలోనే ఓటు వేసే అవకాశం కల్పించాలనే డిమాండ్‌తో రెండు గంటల పాటు రోడ్డుపై ధర్నా చేశారు. దీంతో గుండాల సీఐ రవీందర్‌, తహసీల్దార్‌, ఎంపీడీఓ చేరుకుని వారితో మాట్లాడారు. రోడ్డు నిర్మాణానికి నిధులు ఉన్నా అటవీశాఖ అనుమతి కోసం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వచ్చే ఎన్నికల నాటికి అందరూ స్థానికంగా ఓటు వేసేలా అవకాశం కల్పిస్తామని చెప్పడంతో శాంతించిన గ్రామస్తులు గ్రామపంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో గుండాలకు వెళ్లి ఓటేశారు. ఇక ఆళ్లపల్లి మండలం రాయిగూడెం గ్రామస్తులు సైతం కిన్నెరసానిపై వంతెన, బాటన్ననగర్‌కు రోడ్డు సౌకర్యం కోసం ఎన్నికలను బహిష్కరించగా విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నచ్చచెప్పడంతో వారు ఓటేసేందుకు ముందుకు వచ్చారు. అలాగే, గ్రామాభివృద్ధి కోసం ఎన్నికలు బహిష్కరిస్తూ పెద్దవెంకటాపురం గ్రామస్తులు తీర్మానం చేయగా వారు సైతం ఎమ్మెల్యే హామీతో ఓటు వేశారు.

మేం ఓటు వేసేది లేదు...
1/1

మేం ఓటు వేసేది లేదు...

Advertisement
 
Advertisement
 
Advertisement