భద్రాచలాన్ని భ్రష్టుపట్టించారు | Sakshi
Sakshi News home page

భద్రాచలాన్ని భ్రష్టుపట్టించారు

Published Thu, Nov 9 2023 12:20 AM

మాట్లాడుతున్న రాఘవులు, పక్కన తమ్మినేని తదితరులు   - Sakshi

● కనీసం డంపింగ్‌ యార్డుకు కూడా స్థలం లేదు ● సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు

భద్రాచలంఅర్బన్‌ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు భద్రాచలం పట్టణాన్ని భ్రష్టు పట్టించారని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు విమర్శించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో సీపీఎం ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే పట్టణం అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం భద్రాచలంలో కనీసం డంపింగ్‌ యార్డుకు కూడా స్థలం లేదని అన్నారు. ఇప్పుడు చెత్తంతా రాములవారి పాదాల వద్దనే వేస్తున్నారని, పాలకుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని చెప్పారు. ఆయా పార్టీలకు ఇప్పుడు ఓట్లడిగే హక్కు లేదన్నారు. రాబోయే రోజుల్లో భద్రాద్రి అభివృద్ధి కోసం సీపీఎం అభ్యర్థి కారం పుల్లయ్యను గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు బీజేపీ అంటే భయమని, లిక్కర్‌ స్కామ్‌లో ఆ పార్టీతో రాజీ పడేందుకే ఈ ఎన్నికల్లో ఆయన సీపీఎంతో కలవలేదని చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక వరకే బీఆర్‌ఎస్‌తో పొత్తు అని ఆనాడే చెప్పామని, అయితే కేసీఆర్‌ తమ ప్రమేయం లేకుండానే భవిష్యత్‌లో కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటామని నాడు చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల్లో కనీసం తమతో సంప్రదించకుండానే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి మాట తప్పారని విమర్శించారు. కాంగ్రెస్‌తోనూ సంప్రదింపుల సందర్భంగా తాము భద్రాచలం స్థానాన్ని అడిగామని, 40 ఏళ్ల పాటు తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించి అభివృద్ధి చేశారని వివరించారు. వచ్చే ఎన్నికల్లోనూ సీపీఎం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అభ్యర్థి కారం పుల్లయ్య, మాజీ ఎంపీ మీడియం బాబురావు, సీపీఎం జాతీయ, రాష్ట్ర నాయకులు వెంకట్‌, పోతినేని సుదర్శన్‌, బండారు రవికుమార్‌, జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్‌, యలమంచి రవికుమార్‌, శంకర్‌రావు, రేణుక, ఎంబీ నర్సారెడ్డి, గడ్డం స్వామి, వెంకటరెడ్డి, బండారు శరత్‌, వై.వి. రామారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement