అనంతపురం జిల్లా నార్పలలో పురుగు మందు డబ్బాతో ఓ వ్యక్తి నిరసన
శింగనమల(నార్పల): ‘ఇంటి పన్ను రూ.22 వేలు కట్టమంటున్నారు. అంత డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? దీనికంటే చచ్చిపోవడమే మేలు’ అంటూ అనంతపురం జిల్లా నార్పలలోని దివ్యాంగుల కాలనీకి చెందిన సిద్దవట్టం పెద్దన్న వాపోయారు. ఆయన సోమవారం భార్య, పిల్లలతో కలిసి పురుగు మందు డబ్బా తీసుకొని.. నార్పల పంచాయతీ కార్యాలయం వద్దకు వచ్చారు.
ఇంటి పన్ను తగ్గించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని కన్నీటిపర్యంతమయ్యారు. రూ.22 వేలు ఇంటి పన్ను కట్టాలంటూ నోటీసు ఇస్తే.. ఎక్కడి నుంచి తేవాలని పంచాయతీ అధికారులను ప్రశ్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. పంచాయతీ కార్యాలయానికి చేరుకొని.. పెద్దన్న నుంచి పురుగు మందు డబ్బా లాక్కున్నారు. చివరకు ఇంటి పన్నును రూ.16 వేలకు తగ్గించి.. ఆయనకు సర్దిచెప్పి పంపించేశారు.


